07 October 2015
Hyderabad
భారి వ్యయంతో, లేటెస్ట్ టెక్నాలజీ తో 'కొమరం భీమ్' చిత్రం
ఓం సాయి తేజా ఆర్ట్స్ పతాకం పై సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ- ఉట్నూర్ సమర్పణ లో నాగ బాల సురేష్ కుమార్ స్వీయ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం 'కొమరం భీమ్'. కొమరం భీముగా - వైభవ్ సూర్య, నిటిస్తున్న ఈ చిత్రం లో ఇంకా అనుభవజ్ఞులైన సుమారు 170 మంది నటీనటులతో, 50 మంది సాంకేతిక నిపుణులతో భారి వ్యయంతో నిర్మిస్తున్నారు నాగబాల సురేష్ కుమార్. అక్టోబర్ 7న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్, జూబిలీ హిల్స్ లోని భూత్ బంగాళా లో జరుగుతుండగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి షూటింగ్ విశేషాలను తెలియచేసారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అతిధి గా విచ్చేసిన తెలంగాణా రాష్ట్ర మంత్రి వర్యులు ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ :"తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లొ వుంది. ఆ ప్రాతం లోని జోడే ఘాట్ లో గోండు జాతికోసం ప్రాణత్యాగం చెసింది కొమరం భీం ఒక్కడే. గిరిజన జాతికే ఆరధ్యంగా, చిరస్మరనీయుడుగా చరిత్రలో నిలిచిన కొమురం భీం అలాంటి మహనీయుని చరిత్ర ను గతం లో టి వి సిరియల్ గా అందించిన నాగబాల సురేష్ కుమార్ గారు ఇప్పుడు సినిమా గా రూపొందిచడం అభినందించాలి.గత ఏడాది అక్టోబర్ 27న మన రాష్ట్ర ముఖ్య కె సి అర్ గారు కొమరం భీమ్ జయంతి సందర్భం గా అక్కడికి వెళ్లి 25 కోట్ల రూపాయలతో గిరిజన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. సినిమా రంగం పై వున్నా అభిమానంతో రాచ కొండ లో ఫిలిం సిటీ నిర్మాణానికి నాంది పలికారు. ఇక మున్ముందు కూడా తెలంగాణా పోరాట యోధుల కథలను చిత్ర రూపం లో ప్రజలకి అందించవలసిన అవసరం వుంది." అన్నారు
చిత్ర నిర్మాత దర్శకుడు నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ :" గతం లో ఇదే బ్యానర్ పై 'వీర భీమ్' గా 'కొమరం భీమ్' చరిత్రను 70 ఎపిసోడ్స్ గా తీసాను. దూరదర్శన్ లో ఈ సిరియల్ మంచి ప్రజాదరణ పొందింది . గోండుల సంక్షేమమే ధ్యేయంగా, వారి సాంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణే ఉచ్చ్వాస నిస్వాసాలుగా, వారి ఆత్మ గౌరవ రక్షణే ఎకైక ధ్యేయంగా, గిరిజన జాతి అభ్యున్నతే ప్రధాన ఆషయంగా నిరంతరం తపించిన వీర గిరిజన యోధుడు "కొమరం భీం" జాతి నవనిర్మాణం కోసం ప్రణాల్ని తృణప్రయంగా త్యజించిన అద్బుత అమరవీరుడి జీవిత చరిత్రకు వెండి తెర రూపం ఇస్తే బాగుంటుందని ఈ చిత్రాన్ని ప్రారంభించాను. సిరియల్ లో చేసిన నటి నటులతో పాటు సినీ రంగానికి చెందిన నటులతో మొత్తంగా 170 మంది ఆర్టిస్టులతో, ఈ చరిత్రను ఎలాంటి కాంట్రవర్సి లేకుండా, అన్ని వర్గాలను అలరించే విధం గా నిర్మిస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తారని బావిస్తున్నాను." అన్నారు
మరో ముక్య అతిధి రాష్ట్ర సలహాదారులు వేణు గోపాల చారి మాట్లాడుతూ : "నాగబాల సురేష్ కుమార్ కి ఈ చిత్రం ద్వార ఆర్ధికం గా ఎంత వస్తుందో ఎంత పోతుందో గాని, ఆదిలాబాద్ జిల్లా వస్తవ్యుడిగా చరిత్ర లో నిలిచిపోతాడు.నిన్న సిరియల్ ద్వార రేపు చిత్రం ద్వార కొమరం భీమ్ జీవిత కధను బావితరాలకు అందించిన వాడు అవుతాడు." అన్నారు
కొమరం భీమ్ పాత్రధారి వైభవ్ మాట్లాడుతూ : "ఇప్పటి వరకు టి వి లలో సినిమాలలో ఎన్నో పాత్రలు వేసిన నాకు తెలంగాణా పోరాట యోధుడు కొమరం భీమ్ లాంటి మహోన్నత వ్యక్తి పాత్ర వేయడం నిజంగా నా అదృష్టం. ఎవరికి దొరకని ఈలాంటి అవకాశం నాకు ఇచ్చిన నాగబాల సురేష్ గారికి జన్మంతా రుణపడి వుంటాను."అన్నారు
ఈ చిత్రంలో కొమరం భీముగా - వైభవ్ సూర్య, పైకూభాయిగా - స్వప్న, సత్తార్గా రామకృష్ణతో పాటు మానిక్, హేమసుందర్, ఉమ మహేశ్వర్ రావు, లవకుశ నాగరాజు, అనిల్, జొసఫ్ బబూరవు, రమణ, కల్పన, చిత్ర, స్రిలక్ష్మి, జ్యోతి, మొదలైన నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సహకారం : కొమురం సోనేరావు, శిడాం అర్జు, కెమెరా : గోపి, తిరుపతి రెడ్డి, కన్నా, పాటలు : సుద్దాల అశొక్ తేజ, తోటపల్లి భూమన్న, సంగీతం : నాగరాజు, గ్రాఫిక్స్ : మోహన్ రాజు, సుధాకర్ కె నాయుడు, మేకప్ : వాసు, అర్ట్ : రాజేష్, కాస్ట్యూంస్ : తిరుమల, ఎడిటర్స్ : ఎల్దండి రాజు, సాయి శశాంక్, అసోసియేట్ డైరెక్టర్ : ఆదిత్య, క్రియేటివ్ హెడ్ : మానస్ దండనాయక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ : ఎస్ ఎస్ రమశంకర్, కో-డైరెక్టర్స్ : ఎం ఎస్ చౌదరి, పల్నాటి పాంచజన్యం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : శ్రీమతి డి.లలిత, శైలేష్ కుమార్, నిర్మాణ పర్యవేక్షణ : వై.సంపత్ కుమార్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : నాగబాల సురేష్ కుమార్.
'కొమరం భీమ్' చిత్ర ఇతి వృతం
ఆదిలాబాద్ జిల్ల అంటే అడవుల జిల్లా. ఆకుపచ్చ చీర కట్టుకున్న అందమైన అడవితల్లి. ఎటు చూసినా ఎత్తయిన కొండలు, గల గల పారే సెలయేర్లు... జుమ్మని నాదం చెసే జలపాతాలు, కోకిలమ్మ పాటలు, నెమలి తల్లి ఆటలు... కాలుష్యం లేని కోనల్లొ గిరి పుత్రులు. తమ ఆచార వ్యవహారలు, కట్టుబాట్లు తప్ప ఆధునిక ప్రపంచం తెలియని గిరిజనులు. తర తరాలుగా అడవితల్లినే సేవిస్తూ బతికే అమాయక అడవి జీవులు. అలాంటి గిరిజనుల జీవితాల్లో ఒక్కసారిగా అలజడి, ఆందోలన. అందుకు కారనం ? అణచివేత, గిరిజనుల బతుకులపై అటు నిజాం అధికారులు, ఇటు పెత్తందార్ల ఉక్కుపాదం. ఆకులో ఆకుగా, చెట్టులో చెట్టుగా, గుట్టలో గుట్టగా కలిసిపోయి , మురిసిపోయి బతుకుతున్న అడవిబిడ్డల జీవితాల్లొ ఎడ తెగని విషాదం. ఆ విషాదాన్ని విప్లవ నినాదంతో తుడిచివేయాలని , గిరిజన గూడాల్లో మళ్ళీ సంతోష సంబరాలు నిండుకోవడనికి నడుం కట్టిన గోండు వీరుడు "కొమురం భీం". ఆ వీరుని ధీరగాధే ఈ "కొమురం భీం" చిత్రం.
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లొ వుంది. ఈ జిల్లాల్లోని అడవిని నమ్ముకొని బతికే ఆదివాసులు ఎందరో. ఆదిలాబాద్ జిల్లలొ క్రమక్రమంగా పలు పరిశ్రమలు నెలకొంటున్న తరుణంలో ముడి సరుకుల కోసం పెట్టుబడిదారుల కన్ను అడవిమీద పడింది. అడవినుండి గిరిజనులను దూరం చేసే ప్రయత్నం జరిగింది. తల్లినుండి విడిపోతున్న బిడ్డల్లా గిరిజనులు తల్లిడిల్లిపోయారు. అవమానలు భరించారు. చిత్రహింసలు అనుభవించారు, మానభంగాలు సహించారు. కానీ అడవి తమది కాదంటే తట్టుకోలేక పోయారు. ఇదే క్రమంలొ జంగ్లాత్ (అటవీశాఖ) ప్రవేశం జరిగింది. గిరిజనులను అడవి నుండి తరిమేయడానికి ప్రత్యేకంగా అటవీ చట్టాలను తీసుకొచ్చారు. చెట్టు, పుట్టలపై గిరిజనులకు హక్కులేదన్నారు. కట్టెలు కొట్టకూడదని , భూమి దున్నకూడదని ఆంక్షలు విధించారు. పశువుల మేతకు పన్ను, గుడిసె కడితే పన్ను, దుక్కి దున్నితే పన్ను, పంట పండితే పన్ను, పండిన పంటను అమ్ముకోవాలంటే పన్ను, గోండు ఇంట్లో పెళ్ళి జరిగితే పన్ను, బారసాల జరిగినా పన్నే. చివరికి చావుకైనా పన్నే.... పన్నుల రూపంలో గిరిజనుల రక్తమాంసాల్ని పీల్చి పిప్పి చెసే అధికారుల ఆగడాలకు అంతులేకుండా పొయింది. వారి ఆరాచకలతో గోండు గ్రామాలు తల్లడిల్లిపోయాయి. వారి దమనకాండలకు ఎంతోమంది అమాయక గోండుల ప్రాణాలు హరించుకుపోయాయి.
ఈ ఆరాచకాలకు, ఆగడాలకు, ధమంకండలకు అంతం లేదా ?
వీరి భారి నుండి గోండులను రక్షించే దిక్కే లేదా...?
గిరిజనులెప్పుడూ నాగరిక ప్రపంచం వైపు తొంగి చూడటానికి కూడా ప్రయత్నించలేదు. నాగరికులే అడవిలోకి ప్రవేశించి గిరిజన జీవితాలను చిన్నాభిన్నం చేసారు. అడవి సంపదకు విలువ పెరుగుతుండడంతో భూ స్వాములూ, పెట్టుబడి దారులూ అడవిలొ మకాం పెట్టారు. వారికి అండగా పోలీసు బలగాలొచ్చాయి. గిరిజనుల ఉనికికే ప్రమాదం ఎర్పడింది. అటవీ చట్టం పేరుతో తహసీల్దార్, గిర్దావర్, జంగ్లాత్ అమీన్ (ఫారెస్ట్ ఎస్సై) గార్డులు రంగంలోకి దిగారు. పర్మిత్లు, పట్టాలు అంతూ పెట్టుబడిదారులు, భూ స్వాములూ గిరిజనుల నెత్తిమీద కళ్ళు పెట్టారు. ఎంతోమంది గిరిజనులు సాగు చేస్తున్న భూమిని వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఈ ఆరాచకాలు, దౌర్జన్యాలు ఇంకానా... ఇకపై సాగవంటూ "కొమురం భీం" నాయకత్వంలో గిరిజనులందరూ ఏకమయ్యారు, తిరగబడ్డారు. పోరాటం చేసారు. ఎన్నో వీరపోరాటాల కథలు విన్న భీం చిన్నతనం నుండే తన జాతి సంక్షేమం గురించి అలోచన మొదలుపెట్టాడు. ఆ ఆలొచనే "బాబేజరీ" పోరాటానికి దారితీసింది. గిరిజనుల కోసం 1930-40 మధ్య ఆసిఫాబాద్ ప్రాంతంలో "కొమురం భీం" జరిపిన బాభే ఝరీ పోరాటం ఒ ప్రత్యేకతను సంతరించుకుంది.
గిరిజన సమస్యల సాధన కోసం "బాబేఝరి, జోడెన్ ఘాట్, మొవ్వడ్, వావుదం" మొదలైన 12 గిరిజన గ్రామాలను ఏకం చేసి సాయుధ విప్లవానికి నాంది పలికిన గిరిజన యోధుడు "కొమరం భీం". పట్వారీలు, పోలీసులు, మాలీపటేల్ లు, జాగీందార్లు, షావుకార్లు, నైజాం ప్రభుత్వ అధికారులు గిరిజనులను సామూహికంగా దోపిడీ చేసారు. దోపిడీకి గురైన అమాయక గిరిజనుల జీవితాల్లో వెలుగులు విరజిమ్మిన తొలి సూర్యుడు "కొమురం భీం". ఈంట్ కు ఈంటోంసే జవాబ్ దేవ్, పత్తర్ కు పత్తరోంసే జవాబ్ దేవ్" అనే నినాదాన్ని అణువణువునా జీర్ణించుకున్న భీం అదే బాటలొ గిరిజనులందర్నీ నడిపించి వారి అభ్యున్నతికి పాటుపడ్డాడు. సమస్త గిరిజనుల ముఖాల్లొ ప్రతిక్షణం ఆనందాన్ని చూడాలనుకున్న "గిరిజన జాతిపిత కొమురం భీం అద్బుత జీవిత చిత్రీకరణే ఈ "కొమరం భీం" చిత్రం.
గోండుల సంక్షేమమే ధ్యేయంగా, వారి సాంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణే ఉచ్చ్వాస నిస్వాసాలుగా, వారి ఆత్మ గౌరవ రక్షణే ఎకైక ధ్యేయంగా, గిరిజన జాతి అభ్యున్నతే ప్రధాన ఆషయంగా నిరంతరం తపించిన వీర గిరిజన యోధుడు "కొమరం భీం" జాతి నవనిర్మాణం కోసం ప్రణాల్ని తృణప్రయంగా త్యజించిన అద్బుత అమరవీరుడి జీవిత చరిత్రకు తెర రూపమే ఈ "కొమురం భీం" చిత్రం