10 September 2015
Hyderabad
`హోరాహోరీ` ప్లాటినమ్ వేడుక
దిలీప్, దక్ష నాయకానాయికలుగా పరిచయమవుతున్న సినిమా హోరాహోరీ. శుక్రవారం విడుదల కానుంది. తేజ దర్శకత్వం వహించారు. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై దామోదరప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ప్లాటినమ్ వేడుక హైదరాబాద్‌లో గురువారం జరిగింది. భీమినేని శ్రీనివాసరావు చిత్రయూనిట్‌కు ప్లాటినమ్ డిస్కులను అందించారు.
తేజ మాట్లాడుతూ ``ఇప్పుడు ఎక్కడా ప్లాటినమ్ డిస్కులు లేవు. అన్ని అమ్మకాలు లేవు. ప్లాటినమ్ డౌన్‌లోడ్స్ అనే అనాలి. హోరాహోరీ పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. చిత్రం మూవీస్ పతాకంపై నేను చేసిన సినిమాల్లో ఎక్కడో జడ్జిమెంట్ తప్పింది. దాంతో దామూగారిని కలిసి ఆయనతో సినిమాను చేస్తున్నాను. జగన్‌మోహన్ రెడ్డి, వివేక్ మంచి ప్లానింగ్‌తో బడ్జెట్‌ను సిద్ధం చేశారు. ఈ సంస్థలో ఇంతకు ముందు రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఆ వరసలో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆకాంక్షిస్తున్నాను`` అని అన్నారు.
కల్యాణ్ కోడూరి మాట్లాడుతూ ``తేజతో 86 నుంచి పరిచయం ఉంది. నేను, రాజమౌళి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కల్యాణ్ మా ఇంటికి టీవీఎస్50 మీద వచ్చేవాడు.
తేజతో సినిమా చేస్తే సంగీత దర్శకులకు మరో మెట్టు ఎక్కినట్టే. అందుకే ఆయనతో సినిమా చేయాలనుకున్నా. ఇప్పటికి కుదిరింది. సినిమా విడుదల కాకముందు నుంచే నాకు మంచి పేరు వస్తోంది. తేజ ఇంట్లో నెల రోజులు పనిమనిషిగా ఉండి ఆయన రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను. పెద్దాడమూర్తి మంచి పాటలిచ్చారు`` అని తెలిపారు.
పెద్దాడమూర్తి మాట్లాడుతూ ``తేజ సినిమాల్లో పాటలన్నీ సందర్భోచితంగా ఉంటాయి. ఈ సినిమాలో వైవిధ్యమైన పాటలను రాసే స్కోప్ వచ్చింది. ఒకే సినిమాలో ఇన్ని వైవిధ్యమైన పాటలు రాసే అవకాశం రావడం నా అదృష్టం`` అని చెప్పారు.
భీమినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ``హోరాహోరీ పాటలు బావున్నాయని, సినిమా బావుంటుందని కొంతమంది దర్శకులు నాతో చెప్పారు. సినిమా కూడా ఇంతే పాజిటివ్‌గా ఉన్నందుకు ఆనందంగా ఉంది. మంచి సక్సెస్ కావాలి`` అని అన్నారు.
నందినిరెడ్డి మాట్లాడుతూ ``లక్ష్మీ కల్యాణం సినిమా సమయంలో వరల్డ్ స్సేస్ రేడియో కోసం నేను తేజగారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన మాట్లాడుతుంటే చాలా ముచ్చటేసేది. ఆయన ఇప్పటికీ నాకుస్పూర్తినిస్తుంటారు`` అని తెలిపారు.
దామోదరప్రసాద్ మాట్లాడుతూ ``హోరాహోరీ సినిమా పాటలు నాకు బాగా నచ్చాయి. నేను తీసిన సినిమా అయినా 15 రోజులకు మించి నా కారులో పాటలను ప్లే చేయను. అలాంటిది హోరాహోరీ పాటలు గత 3-4 నెలలుగా నా కారులో ప్లే అవుతున్నాయి. మంచి లిరికల్ వేల్యూ ఉన్న పాటలను రాశారు పెద్దాడమూర్తి. తేజ, నేను కలిసి సినిమా చేస్తున్నామంటే చాలా మంది భయపడ్డారు. కొంతమంది ఎందుకనీ అడిగారు. కానీ తేజకు ఓ ఇమేజ్ ఉంది. తనకంటూ ఆడియన్స్ ఉన్నారు. అయినా తను చెప్పిన స్క్రిప్ట్ లో మేం అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానమిచ్చి స్క్రిప్ట్ ని లాక్ చేసి ముందుకెళ్లారాయన. మాకు బంధువు కూడా అవుతారు`` అని అన్నారు.
దిలీప్ మాట్లాడుతూ ``నా తొలి సినిమాను తేజగారితో చేయడానికి చాలా ఆనందంగా ఉంది. మంచి పాటలిచ్చిన కల్యాణ్ కోడూరిగారికి ధన్యవాదాలు`` అని చెప్పారు.
దక్ష మాట్లాడుతూ ``ఇంత మంచి ప్రెస్టీజియస్ సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది`` అని తెలిపారు.
మధుర శ్రీధర్ మాట్లాడుతూ ``సెంటిమెంట్‌గా ఈ సినిమా హిట్ అవుతుందనిపిస్తోంది. నేను ఫస్ట్ విన్నప్పుడే మూడు పాటలు చాలా బావున్నాయని అన్నాను. అలాగే ఆ పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి`` అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డిఎస్‌రావు, జునైద్, చెస్వా, వివేక్‌కూచిభొట్ల, జగన్‌మోహనరెడ్డి, గౌరి, వేణు తదితరులు పాల్గొన్నారు.