స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన `దండకారణ్యం` ఈ నెల 18న విడుదల కానుంది. ఆర్.నారాయణమూర్తి, విక్రమ్, ప్రసాద్ రెడ్డి, త్రినాథ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్లాటినం డిస్క్ వేడుక మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో గద్డర్, సుద్ధాల అశోక్ తేజ, వందేమాతరం శ్రీనివాస్, గోరేటి వెంకన్న,యశ్ పాల్, తిరుపతి, ఆర్.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
గద్ధర్ మాట్లాడుతూ ‘’భూసమస్య, సంపదపై చిత్రీకరించిన సినిమా. ఇలాంటి సినిమాను ప్రేక్షకులు చూసి ఆదరిస్తే మా సామాజిక ప్రయోజనం నేరవేరినట్టుగా భావిస్తాం. ఇప్పటి వరకు సామాజిక సమస్యలపై నారాయణమూర్తి తీసిన సినిమాలను చూస్తే ఇదొక రికార్డ్ గా చెప్పవచ్చు. తనకు అండగా మేం ఎప్పుడూ ఉంటాం. ఆయన ముందుకు సాగాలి. పాలకులు కూడా ప్రస్తుతం జరుగుతున్న సమస్య గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’’ అన్నారు.
సుద్ధాల అశోక్ తేజ మాట్లాడుతూ ‘’నారాయణమూర్తి కాలం లాంటి వాడు. అందుకే తన ఎటు లొంగక,తన ప్రయాణం సాగిస్తుంటాడు. ఈ సినిమా కేవలం సమాజంలో సమస్యలనే కాదు తల్లికి, బిడ్డకు ఉన్న ప్రేమను గురించే చెప్పే చిత్రం’’ అన్నారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ``పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. గద్ధర్, వందేమాతరం వంటి గొప్ప వారు పాడారు. భారతదేశంలో దాదాపు 12.13 రాష్ట్రాలను ఆనుకుని ఉన్న ఓ ప్రదేశం దండకారణ్యం. అక్కడ ఎక్కువగా గిరిజనులు ఉంటారు. అయితే ఇవాళ ఈ ప్రదేశం అగ్నిగుండంగా మారుతోంది. ఆదివాసీల ప్రాణాలు పోతున్నాయి. రాజ్యాంగం షెడ్యూల్ 5, 5డి, 6లను ఇంప్లిమెంట్ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు వారికి ఖనిజ సంపదను దారాదత్తం చేస్తున్నందుకు పలు చోట్ల పోరాటాలు జరుగుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడమని వాళ్ళు అర్థిస్తున్నారు. ఈ మధ్య ఢిల్లీలో ఓ ఘటన జరిగితే దాని తాలుకూ చర్చలు పార్లమెంట్‌లో జరుగుతున్నాయి. అలాంటప్పుడు దండకారణ్యం గురించి కూడా పార్లమెంట్‌లో చర్చలు జరగాలి. దండకారణ్యంలో చావులు ఎవరికోసం? అనే విషయం ఆలోచించాలి`` అని చెప్పారు.
చిత్రయూనిట్ కు సుద్దాల అశోక్ తేజ ప్లాటినం డిస్క్ షీల్డులను అందజేశారు.
ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, కథ, చిత్రానువాదం, మాటలు, ఎడిటింగ్, కొరియోగ్రఫీ, కెమెరా; సంగీతం, నిర్మాత: ఆర్.నారాయణమూర్తి.