ఇంత వరకు మనం మూకీ సినిమాలు చూశాం. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రాకేష్ రెడ్డి మూకీతో పాటు స్లోమోషన్ లో `కాలాయా తస్మై నమః` చిత్రానికి దర్శకత్వం వహించారు.పూర్తి సినిమాను స్లోమోషన్ లో చేయడం ఇప్పటి వరకు, ఏ భాషలో ఎవరూ చేయని ప్రయత్నమే కాదు..వరల్డ్ రికార్డ్ గా భావించవచ్చు. ఆర్ .కె. గురు ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శ్రీనివాస్.బి, విజయ్ కార్తీక్, వినయ్ కృష్ణ, శ్రీనివాస్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్ నాయుడు, రేఖ బోజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనులు జరుపుకుంటోంది. జూలై లో సినిమాను గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ...``నేను గతంలో లవ్ ఇన్ వైజాగ్, డర్టీ పిక్చర్, అనే షార్ట్ ఫిలింస్ డైరక్ట్ చేశాను. వీటికి దర్శకుడుగా నాకు మంచి పేరు వచ్చింది. ఆ ఉత్సాహంతో, అనుభవంతో తొలిసారిగా `కాలాయా తస్మై నమః` చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇక ఈ చిత్ర కథ విషయానికొస్తే...ఇది 1980లో గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ. మనం ఏం కావాలి? అనేది కాలమే నిర్ణయిస్తుందన్న అంశంతో సినిమా ఆద్యంతం ఉంటుంది ( టైమ్ ఈజ్ డిస్టనీ). అందుకే `కాలాయా తస్మై నమః` అనే టైటిల్ నిర్ణయించాము. టైటిల్ కొత్తగా ఉందంటున్నారు. నా నిజ జీవితంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ కూడా ఈ చిత్రంలో పొందుపరచడం జరిగింది. ఇక మా సినిమా యొక్క ప్రత్యేకతల గురించి చెప్పాలంటే...ప్రపంచంలోనే ఇంత వరకు ఎవరూ చేయని విధంగా మూకీ తో పాటు స్లోమోషన్ లో దాదాపు గంటన్నర సినిమా తెరకెక్కించాం. కథ కి యాప్ట్ అవుంతుంది కాబట్టి ఈ ప్రయోగం చేశాము తప్ప...ఏదో రికార్డ్ ల కోసం ఈ ప్రయోగం చేయలేదు. సినిమా చూశాక అందరూ యాక్సెప్ట్ చేస్తారన్న ప్రగాఢమైన విశ్వాసం ఉంది. మా సినిమాకు మరో స్పెషాలిటీ ఉంది. అదేమిటంటే...ఈ సినిమా కోసం మొదటి సారిగా అందరూ షార్ట్ ఫిలింస్ కి వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూ వర్క్ చేశారు. ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే..ఇదొక కొత్త కాన్సె ప్ట్ ...ఆడియన్స్ కి కనెక్టయిందంటే మాత్రం ప్రేమిస్తే, ప్రస్థానం, బిచ్చగాడు చిత్రాల్లాగా సంచలనం సృష్టించడం ఖాయం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు జరుగుతున్నాయి. జూలై లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని` అన్నారు.