స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా అల్లు రామలింగయ్య సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం సరైనోడు. రకుల్ ప్రీత్ సింగ్, క్యాథిరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో సెలబ్రేషన్స్ వైజాగ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో టి.సుబ్బరామిరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, గంటా శ్రీనివాసరావు, అల్లుఅరవింద్, శ్రీకాంత్, బోయపాటిశ్రీను, రకుల్ ప్రీత్ సింగ్, ఆదిపినిశెట్టి, అల్లు శిరీష్, హరీష్ శంకర్.ఎస్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘’రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయాలి. సినిమా అభివృద్ధికి ప్రభుత్వం ముందుకు వస్తే ఇండస్ట్రీ ఇక్కడకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా సినిమా పరిశ్రమ స్థిరపడాలని కోరుకుంటున్నాను. నాకు సినిమాల పరంగా, రాజకీయాల పరంగా మంచి అనుబంధం ఉన్న నగరం వైజాగ్. చాలెంజ్, అభిలాష, చంటబ్బాయ్, ఘరానా మొగుడు సహా చాలా సినిమాలు వైజాగ్ లోనే చేశాను. నేను నా రిటైర్మెంట్ ఏజ్ ను గడపాల్సి వస్తే వైజాగ్ లోనే గడపాలనుకుంటున్నాను. గీతాఆర్ట్స్ బ్యానర్ కు అరవింద్ వెన్నెముకలా నిలబడ్డారు. తనని తాను అప్ డేట్ చేసుకుంటూ సక్సెస్ ఫుల్ సినిమాలు చేశారు. మేమందరం గర్వపడేలా కష్టపడుతున్నాడు. డాడీ సినిమాలో చిన్న పాత్ర చేసిన బన్ని, తర్వాత గంగోత్రి సినిమాలో హీరోగా చేయడానికి కూడా తన పేరుని రాఘవేంద్రరావుకు నేనే సూచించానని చెప్పడానికి సంతోషపడతాను. మా ఫ్యామిలీలో ఏ హీరోనైనా కష్టపడాలని చెబుతూనే ఉంటాను. బన్నిఈరోజుకు కూడా కష్టపడుతుంటాడు. తనకు తెలుగు రాష్ట్రాలోనే కాదు కన్నడ, కేరళలో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. తను పక్కా ప్రొఫెషనల్. వ్యక్తిగా హుందాగా, పరిణితి గల నటుడు. సరైనోడు విజువల్స్ చూస్తుంటే సినిమా ఎలా ఉంటుందో తెలుస్తుంది. నాకు కూడా సినిమా ఎప్పుడూ చూద్దామా అనే ఆసక్తి కలుగుతుంది. నాగబాబు, పవన్ ఎలాగో శ్రీకాంత్ ను మరో తమ్ముడిలా భావిస్తుంటాను. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ మంచి ప్రొఫెషనల్ హీరోయిన్. తనకి నా అభినందనలు. బోయపాటి శ్రీనులో మంచి ఎనర్జీ, పట్టుదల ఉంది. తను అసోసియేట్ గా పనిచేస్తున్నప్పటి నుండి మంచి పరిచయం ఉంది. కన్విక్షన్ ఉన్న వ్యక్తి. మాస్ కు అడ్రస్ అంటే బోయపాటి శ్రీను. ప్రతి సీన్ ను ఎక్కడా పట్టు సడలకుండా తీర్చిదిద్దుతాడు. తెలుగు సినిమాకు మాస్ డైరెక్టర్ గా ఉండి సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళుతున్నందుకు తనని అభినందిస్తున్నాను. తను చేసిన సింహా, లెజెండ్ చిత్రాల కథలు కూడా నాకు వినిపించేవాడు. అలాగే సరైనోడు సినిమా తనని నెక్ట్స్ లెవల్ తీసుకెళ్లే సినిమా అవుతుంది. అరవింద్ గారు నా 150 వ సినిమా తర్వాత బోయపాటిగారి దగ్గర ఓ లైన్ ఉందని చెప్పారు. నేను కూడా చేయడానికి సిద్ధమే. ఆది పినిశెట్టి తమిళంలో హీరోగా రాణిస్తున్నాడు. నేను సినిమా కెరీర్ స్టార్టింగ్ లో మోసగాడు సినిమాలో ఓ నెగటివ్ రోల్ చేశాను. అలాగే ఆది పినిశెట్టి కూడా ఇలాంటి క్యారెక్టర్ చేసినందుకు తనని అభినందిస్తున్నాను. థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అణిముత్యంలాంటి పాటలిచ్చాడు. పాటలు వింటుంటే హుషారు ఆగడం లేదు. సినిమా ఏప్రిల్ 22న విడుదలవుతుంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ‘’అల్లుఅరవింద్ మంచి ఆర్గనైజర్. బన్ని తన మావయ్యలా కావాలని కష్టపడ్డాడు. కసితో హీరోగా మారాడు. బోయపాటి శ్రీను చూడటానికి సాధారణంగానే ఉంటాడు, కానీ ఘటికుడు. థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు’’ అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘’మా బ్యానర్ పై, మా అసోసియేట్స్ తో కలిసి 54 సినిమాలు చేశాను. ఈ సి నిమాను చూశాను, చాలా హ్యపీగా అనిపించింది. అయితే ప్రతి సినిమాకు పడే టెన్షన్ ఈ సినిమాకు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైజాగ్ లో జరిగే పెద్ద ఫంక్షన్ ఇదే. ఈ ఫంక్షన్ ఇక్కడ గ్రాండ్ గా జరగడానికి కారణం గంటా శ్రీనివాసరావుగారే కారణం. ఆనాడు సుదీర్ఘ ప్రయాణం స్టార్ట్ చేసిన చిరంజీవిగారు పాతికేళ్ల కష్టపడి ఏర్పాటు చేసిన ప్లాట్ ఫాంపై మెగా హీరోలు అందరూ నిలబడి ఉన్నారు. అందుకు ఆయనకు థాంక్స్. బోయపాటిశ్రీను మామూలోడు కాడు, సరైనోడు. ఈ సినిమాను ఎక్సలెంట్ గా తీశాడు. ప్రేక్షకులు సినిమాను చూసి థ్రిల్ ఫీలవుతారు. థమన్ మంచి మ్యూజిక్ అందించాడు’’ అన్నారు.
గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘’బన్ని తనను తాను మలుచుకుని వెర్సటైల్ ఆర్టిస్ట్ గా మారాడు. బోయపాటిగారి నుండి చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలి’’ అన్నారు.
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మాట్లాడుతూ ‘’థమన్ సరైనోడుకి సాలిడ్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా చేయాలనుకోగానే థమన్ అయితేనే సరైనోడని అనుకున్నాం. ఈ సినిమా ఆడియో వేడుకను వైజాగ్ లో చేయాలని ముందుగానే అనుకున్నాం. ఇక్కడ ఆడియో వేడుక జరగడం గర్వంగా ఉంది. ఆదిపినిశెట్టి నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్, తమిళంలో పెద్ద హీరో. చిన్నప్పటి నుండి మేం కలిసి పెరిగాం. తను విలన్ క్యారెక్టర్ కు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ప్రాణం పోశాడు. అలాగే సాయికుమార్ గారు, శ్రీకాంత్ అన్నయ్య, బ్రహ్మానందంగారు సహా చాలా మంది యాక్ట్ చేశారు. రకుల్ అందగత్తె, తెలివైనది వీటన్నింటి కంటే మంచిది. బోయపాటి శ్రీనుగారు మాస్ డైరెక్టర్ గానే కాదు, ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంటాడు. మాస్, ఊర మాస్ లా ఉండే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మా నాన్నగారి బ్యానర్. మా బ్యానర్ లో చేస్తున్న మూడో సినిమా. నాతో మంచి సినిమా తీయాలనుకునే నాన్నగారికి థాంక్స్. మంచి టీంతో పనిచేశాను. ఈ ప్లాట్ ఫాంపై ఎవరూ నిల్చున్న చిరంజీవిగారే రోడ్డు వేశారు, ఆయనే గొప్పవారు’’ అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘’ఎదిగే ప్రతి వ్యక్తి చిరంజీవిగారు స్ఫూర్తి. గీతాఆర్ట్స్ సంస్థలో అన్నయ్య సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాను. అదే సంస్థలో డైరెక్టర్ గా పనిచేయడం గర్వంగా ఫీలవుతున్నాను. అదే బ్యానర్ లో చేస్తున్న ఈ చిత్రం ఇప్పుడు సెకండాఫ్ మిక్సింగ్ లో ఉన్నాం. థమన్ మంచి మ్యూజిక్ తో పాటు రీరికార్డింగ్ కూడా ఇచ్చాడు. మంచి సినిమా చేశామని చెప్పగలను. న్యాయం నాలుగు కాళ్లపై నిలబడాలి. అన్యాయానికి అసలు కాళ్లే ఉండకూడదనుకునే కుర్రాడి కథే ఈ సినిమా. అన్నీ రంగాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి అల్లుఅరవింద్ గారితో పనిచేశాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. రకుల్ ప్రీత్ సింగ్ ను మా ఇంట్లో అమ్మాయిగా ఫీలయ్యే క్యారెక్టర్ చేసింది. అలాగే ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసిన క్యాథరిన్ తను మాత్రమే చేయగలను అనేలా యాక్ట్ చేసింది. మంచి టీంతో పనిచేశాను. ఈ సినిమాలో హీరోకు ఢీ అంటే ఢీ అనేలా విలన్ క్యారెక్టర్ చేసిన ఆది పినిశెట్టి ఈ సినిమాతో మంచి గుర్తింపు వస్తుంది. తనకి ముందు 25నిమిషాల కథ విని ఏమాత్రం ఆలోచించకుండా విలన్ గా చేయడానికి ఒప్పుకున్నాడు. గంగోత్రి తర్వాత బన్నికి భద్ర కథ చెప్పాను. ఇంత బలమైన కథ చేయడం కరెక్ట్ కాదనిపించి తనే దిల్ రాజుకు పరిచయం చేసి నేను డైరెక్టర్ కావడానికి కారణమైన వ్యక్తి బన్నియే. కృషి, కసి ఉన్న హీరో బన్ని. గీతాఆర్ట్స్ లో, బన్నితో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. అభిమానులందరూ గుండెలపై చేయి వేసుకుని నిద్రపోయే సినిమా చేశాం’’ అన్నారు.
ఆది పినిశెట్టి మాట్లాడుతూ ‘’సరైనోళ్లందరూ కలిసి చేసిన సినిమా ఇది. ఆడియెన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్స్ లో పి.హెచ్.డి తీసుకునే డైరెక్టర్ బోయపాటిగారు, అల్లు అరవింద్ గారు సహా అందరూ సరైనోళ్లే. బన్ని ఇంత పెద్ద స్టేజ్ కు వచ్చిన తర్వాత ప్రతి షాట్ చేసేటప్పుడు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసేలా తాపత్రయపడుతుంటాడు. థమన్ అన్నీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. సినిమా ఏప్రిల్ 22న విడుదలవుతుంది. సినిమాను కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ‘’బన్నితో సరైనోడు సినిమా చేయడం ఆనందంగా ఉంది. చిరంజీవిగారు ఎంతో కష్టపడి పెద్ద స్టార్ అయ్యారు. ఆయన్ను ఫాలో అవుతూ రాంచరణ్, బన్ని ఎంతో కష్టపడుతున్నారు. వీరిని చూసి సీనియర్స్ అయిన ఎంతో నేర్చుకోవాలి. నెక్ట్స్ జనరేషన్ పవన్, ఎన్టీఆర్, మహేష్, బన్ని, రాంచరణ్ లను ఇన్ స్పిరేషన్ గా తీసుకుంటారు. అన్నయ్యతో డ్యాన్స్ చేసేటప్పుడు ఎంత టెన్షన్ పడ్డానో, బన్నితో చేయడానికి అంతే టెన్షన్ పడ్డాను. ఈవాళ మనకున్న పెద్ద డైరెక్టర్స్ లో బోయపాటి ఒకరు. నేను ఇందులో బన్నికి బాబాయ్ క్యారెక్టర్ చేశాను. బన్ని బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది’’ అన్నారు.
అల్లుశిరీష్ మాట్లాడుతూ ‘’యూనిట్ కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
ఎస్.ఎస్.థమన్ మాట్లాడుతూ ‘’ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా నేను కలలో ఇతనికి మ్యూజిక్ కంపోజ్ చేయాలని కలలు కనే వ్యక్తి బన్ని. నా మ్యూజిక్ ను థియేటర్ లో విజువల్ గా చూపించే వ్యక్తి. ఓ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకు మ్యూజిక్ ఇవ్వడం హ్యపీగా ఉంది. బోయపాటిగారితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఆయన సపోర్ట్ తోనే ఇంత మ్యూజిక్ చేయగలిగాను. రేసుగుర్రం కంటే మంచి ఆల్బమ్ కుదిరింది. నేను సినిమా చూశాను. చాలా ఎగ్జయిట్ మెంట్ తో ఉన్నాను’’ అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ ‘’బన్నితో సినిమా చేయడం హ్యపీగా ఉంది. బన్ని డేడికేషన్ ఉన్నహీరో. బోయపాటి శ్రీను పని రాక్షసుడు. ఆయనలాంటి దర్శకులు ఇండస్ట్రీకి అవసరం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.