విజయ్ దేవరకొండ హీరోగా కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మిస్తోన్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి నార్సింగిలో విజయ్ అభిమానుల కోలాహలం మధ్య అట్టహాసంగా జరిగింది.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ, "అప్పట్లో చిరంజీవితో ఎన్ని సూపర్ హిట్స్ నాన్-స్టాప్ గా ఇచ్చారో మళ్లీ అంతకు మించిన హిట్స్ ఈ సినిమా నుంచి రామారావు గారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంతోమంది లవర్స్ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ ఫేమస్ లవర్. ఈ సినిమాతో నిజంగానే అతను వరల్డ్ ఫేమస్ లవర్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలోని హీరోయిన్లందరూ అతనితో, మిగతా హీరోలతో మరిన్ని సినిమాలు చెయ్యాలని ఆశిస్తున్నా. క్రియేటివ్ డైరెక్టర్ అయిన క్రాంతిమాధవ్ ఈ సినిమా నుంచి వండర్ఫుల్ సక్సెస్ లు చూడాలని కోరుకుంటున్నా" అన్నారు.
అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ, "వరల్డ్ వైడ్ గా 'వరల్డ్ ఫేమస్ లవర్' సూపర్ హిట్ కావాలనీ, కేఎస్ రామారావు గారి బ్యానర్ కు ఈ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ రావాలనీ కోరుకుంటున్నా" అన్నారు.
సీనియర్ ప్రొడ్యూసర్ సి. అశ్వినీదత్ మాట్లాడుతూ, "నేనూ, కేఎస్ రామారావు విజయవాడ నుంచి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ఈ 46 సంవత్సరాల జర్నీలో రామారావు ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించారు. ఒక నిర్మాతగా ఆయనతో పోటీపడేవాడ్ని. విజయ్ దేవరకొండ మా సంస్థ నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం. ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ, "విజయ్ తో నావి రెండు సినిమాలు అయ్యాయి. మూడో సినిమాకి సిద్ధంగా ఉన్నాం. రాత్రే నాకు మూడో సినిమా చెయ్యవా? అనడిగాను. మీరు ఎప్పుడు చెయ్యమంటే అప్పుడు వచ్చి చేస్తానని చెప్పాడు. ఇంతదాకా విజయ్ జర్నీ ఎలా సాగిందో చూస్తూ వచ్చాను. చాలామంది దగ్గర తెలివితేటలు, టాలెంట్ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన టాలెంట్, మంచితనం, తెలివితేటలు కలిపి ఉన్న అరుదైన మనిషి విజయ్. అతను నిగర్వి. అతని జర్నీ ప్రారంభ దశలోనే ఉంది. ఫ్యూచర్ లో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని ఆశిస్తున్నా. కేఎస్ రామారావు ఒకనాడు నేను ఈర్ష్యపడేంత ప్రొడ్యూసర్. ఈ మనిషికి ఇంత తపనేంటి అని అప్పుడు ఆశ్చర్యపోయేవాడ్ని. ఎన్ని సినిమాలైనా ఇప్పటికీ ఆయనలో అదే ప్యాషన్ కనిపిస్తోంది. సినిమాని ఆయన ప్రేమించినంతగా నేను ప్రేమిస్తానా? అని నాకే ఒక్కోసారి సందేహం వస్తుంటుంది. సినిమాని అంతగా ప్రేమించేవాళ్లకి తప్పకుండా విజయం వరిస్తుంది. ట్రైలర్ చూస్తే డైరెక్టర్లో చాలా విషయం ఉందనే ఫీలింగ్ కలిగింది. సినిమా కూడా అంత బాగుంటుందని ఆశిస్తున్నా. రౌడీ బాయ్స్ ఈ సినిమాని పెద్ద హిట్ చేయిస్తారని అనుకుంటున్నా" అని చెప్పారు.
హీరోయిన్ ఇజాబెల్లా మాట్లాడుతూ, "ఈ సినిమాలో విజయ్ సరసన నటించడం గౌరవంగా భావిస్తున్నా. క్రాంతిమాధవ్ చాలా బాగా సినిమా తీశారు" అన్నారు.
హీరోఇన్ క్యాథరిన్ ట్రెసా మాట్లాడుతూ, "ఈ సినిమాలో చేసే అవకాశం ఇచ్చిన క్రాంతికి థాంక్స్. తెలుగులో చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. విజయ్ ఈ సినిమాకు వెన్నెముకగా నిల్చున్నారు. అతనితో కలిసి నటించడం గ్రేట్ ఎక్స్ పీరియెన్స్. ఆయనెప్పుడూ క్యారెక్టర్లోనే ఉండటం నాకు చాలా నచ్చింది. ఆ మంచి గుణం ఉండటం వల్లే ఆయన రోరోజుకూ ఎదుగుతున్నారు" అని చెప్పారు.
రాశీ ఖన్నా మాట్లాడుతూ, "ఇప్పుడు నన్ను చాలామంది యామినీ అని పిలుస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. 'వరల్డ్ ఫేమస్ లవర్' అనేది ప్రేమలో ఉన్నవాళ్ల కోసమూ, ప్రేమొలో లేనివాళ్ల కోసమూ కూడా. ప్రేమ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్. కథల్లో, సినిమాల్లో, పద్యాల్లో ఈ ఎమోషన్ గురించి వర్ణించారు. ఎన్నిసార్లు వర్ణించినా తక్కువే అనిపిస్తుంది. నాకు లవ్ స్టోరీస్ చాలా చాలా ఇష్టం. మన తరానికి చాలా ఇష్టం. ఈ సినిమా మిమ్మల్ని అసంతృప్తికి గురిచెయ్యదు. గౌతమ్ తో, యామినితో రిలేట్ అవుతారు. ఈ సినిమాతో కచ్చితంగా ప్రేమలో పడతారు. నేను ప్రేమను ప్రేమిస్తాను. ఇక లవ్ స్టోరీస్ చెయ్యనని విజయ్ చెప్పినప్పుడు నేను కూడా హర్ట్ అయ్యాను. అతన్ని లవ్ స్టోరీల్లో చూడ్డం నాకిష్టం. అతను లవర్ పోస్టర్ బాయ్. తన ఫ్యాన్స్ ను అతను హర్ట్ చేశాడు. నాకు అవకాశం వస్తే మళ్లీ మళ్లీ లవ్ స్టోరీస్ చేస్తాను. విజయ్ ను ఈ సినిమాలో ఒక కొత్త అవతారంలో చూస్తారు. ఈ తరానికి అతను ఇన్స్పిరేషన్. అతనితో మళ్లీ కలిసి నటించాలని కోరుకుంటున్నా. క్రాంతిమాధవ్ మంచి స్క్రిప్ట్, మంచి డైలాగ్స్ రాశారు. ఈ సినిమాతో ఆయన మంచి పేరు తెచ్చుకుంటారు. కేఎస్ రామారావు గారు మమ్మల్ని అందరినీ తన కుటుంబంలా చూసుకున్నారు" అని చెప్పారు.
ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ, "ఇది తెలుగులో నేను సంతకం చేసిన మొదటి సినిమా. నేను మొదట్ చూసిన విజయ్ సినిమా 'ఎవడే సుబ్రమణ్యం'. ఆయన్ను చూడగానే చార్మింగ్ గా, స్పార్క్ గా ఉన్నాడనుకున్నా. పెద్ద స్టార్ అవుతాడనీ, జనం అతని గురించి మాట్లాడుకుంటారనీ అనుకున్నా. ఆయన గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆయనతో కలిసి పనిచెయ్యడం గొప్ప అనుభవం. కేఎస్ రామారావు గారితో ఇది నాకు రెండో సినిమా. క్రాంతిమాధవ్ నాకు సువర్ణ అనే ఫెంటాస్టిక్ రోల్ ఇచ్చారు. నాది డీగ్లామర్ గా, చాలా డిఫరెంట్ గా ఉంది చాలామంది చెప్పారు. కానీ సువర్ణతో ప్రేక్షకులు ప్రేమలో పడతారు. ఈ సినిమాలోని అన్ని పాత్రల్నీ ప్రేమిస్తారు" అన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, "నువ్వు లక్కియెస్ట్ బ్రదర్ ఇన్ ద వరల్డ్ అని నాకు చాలామంది మెసేజ్ చేస్తుంటారు. నేను కూడా అలాగే ఫీలవుతుంటా. ఇప్పటికే సినిమా చూసినా. ఫుల్ గా ఎంజాయ్ చేశా. మనోడు 'వరల్డ్ ఫేమస్ లవర్' అయితుండు. అందరూ ఫిబ్రవరి 14న థియేటర్లలోకు వెళ్లి ఎంజాయ్ చెయ్యాల్ని కోరుకుంటున్నా" అన్నారు.
నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ, "కేఎస్ రామారావు గారు కాలానికి తగ్గట్లుగా కథలను ఎంచుకొని తీయడం చాలా బాగుంది. నేను చూసిన కొన్ని సన్నివేశాల్లో రాశీ, ఐశ్వర్య, క్యాథరిన్, ఇజాబెల్లా గొప్ప నటన చూసి అమేజింగ్ అనిపించింది" అన్నారు.
'పెళ్ళిచూపులు' డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, "అందరికీ విజయ్ ఒక ఇన్ స్పిరేషన్ అయ్యాడు. అతను ఒక్కొక్క మెట్టే ఎక్కుతుంటే హ్యాపీగా ఉంది. అతనొక విప్లవం సృష్టించాడు. విజయ్ ఇప్పుడొక సూపర్ స్టార్. ట్రైలర్ చాలా బాగుంది. నలుగురు హీరోయిన్లతో అతను ఎలా చేశాడో చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా" అన్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు మాట్లాడుతూ, "వేలంటైన్స్ డేకి ఎవరైనా ఒక అమ్మాయినే తీసుకెళతారు. ఇక్కడ విజయ్ నలుగురు అమ్మాయిల్ని తీసుకెళ్తున్నాడు. ఒక్క విజయ్ మాత్రమే నలుగురు అమ్మాయిల్ని హ్యాండిల్ చెయ్యగలుగుతాడనుకుంటున్నా. ఈ సినిమాతో విజయ్ మరోసారి అందర్నీ అలరిస్తాడని ఆశిస్తున్నా. కేఎస్ రామారావు గారికి బిగ్ హిట్ రావాలని కోరుకుంటున్నా" అన్నారు.
దర్శకుడు క్రాంతిమాధవ్ మాట్లాడుతూ, "విజయ్ దేవరకొండ ఎనిమిది సినిమాలు చేసిండు. నాది తొమ్మిదోది. ఎనిమిది సినిమాలు ఒకదానికొకటి పోలిక ఉండదు. విజయ్ ని తరుణ్ భాస్కర్ 'పెళ్ళిచూపులు'తో హీరోగా పరిచయం చేసిండు. తర్వాత 'అర్జున్ రెడ్డి'తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిండు. దాంతో 'అర్జున్ రెడ్డి'కి ముందు, 'అర్జున్ రెడ్డి'కి తర్వాత అనేవిధంగా విజయ్ కెరీర్ నడుస్తోంది. అతనెప్పుడూ ఓ కొత్తదనాన్ని ఎంచుకుంటూ ఉంటాడు. తన ఫ్యాన్స్, ఆడిటోరియంకు వచ్చిన వాళ్లకు వినోదం కావాలని కోరుకుంటాడు. దాన్ని మైండ్ లో పెట్టుకొని 'వరల్డ్ ఫేమస్ లవర్' కథ రాసినం. వేలంటైన్స్ డేకి రిలీజ్ అవుతోంది. నలుగురు హీరోయిన్లున్నారు, ఈ కథ ఏం రాసినవ్? అని నన్ను అడుగుతూ ఉన్నారు. ఒక్క అమ్మాయితో చేయడానికే కష్టపడతారు, నలుగురు అమ్మాయిలతో చెయ్యడం మజాక్ కాదు. విజయ్ చాలా కష్టపడ్డాడు. ఈ ప్రపంచంలో ఒక శిశువు జన్మించింది అంటే నేను ఒక కొత్త ప్రపంచం పుట్టింది అంటాను. ఆ ప్రపంచం ఎదిగి ఒక పెద్ద ప్రపంచం అయ్యాక, తనలాంటి ఇంకో ప్రపంచం కొరకు వెతుకుతుంది. ఆ ప్రపంచం ఎదురైనప్పుడు అందులో ఏకమవ్వాలనీ, మమేకమవ్వాలనీ శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. రెండు వేర్వేరు ప్రపంచాలు ఏకమవ్వాలనుకున్నప్పుడు అలజడి సృష్టింపబడుతుంది. ఈ అలజడినే నేను ప్రేమ అంటాను. 'వరల్డ్ ఫేమస్ లవర్'లో ఆ ప్రేమను ఎలా చూపించామో ఫిబ్రవరి 14న మీరు చూస్తారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో ఇది నా రెండో సినిమా"అని చెప్పారు.
చిత్ర సమర్పకులు కె.ఎస్. రామారావు మాట్లాడుతూ, "ఈ సినిమా నేను మొదలుపెట్టానికి ప్రేరణ ఇచ్చింది క్రాంతిమాధవ్ చెప్పిన కథ. విజయ్ కూడా కథ విన్నాక ఇది చాలా గొప్ప సినిమా అవుతుందని చెయ్యడానికి ముందుకు వచ్చాడు. దానినే నమ్మి మాకు ఆద్యంతం సపోర్ట్ చేసిన వ్యక్తి గోవర్ధన్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' తర్వాత అంత గొప్ప సినిమా అవుతుందని ఆయన అన్నారు. అయితే మా అందరి కంటే ఈ సినిమాలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యింది విజయ్. ఎడిటింగ్ రూములో ఉండి ఈ సినిమా 100 శాతం పర్ఫెక్టుగా వచ్చిందా, లేదా అని చూసుకున్న వ్యక్తి విజయ్. ప్రతి సీన్ అసాధారణంగా ఉండేలా ఆయన నటించి, నలుగురు హీరోయిన్ల పాత్రలూ బాగా వచ్చేలా చూసుకొన్నారు. ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. విజయ్, రాశీ ఎంత పోటాపోటీగా నటించారో చూసి అంతా ఆశ్చర్యపోతారు. నేను చూసిన అన్ని భాషల సినిమాల్లో ఒక హీరో, ఒక హీరోయిన్ ఇంత పోటాపోటీగా నటించిన గొప్ప సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. చూస్తున్నంతసేపూ ఎమోషనల్ గా ఫీలవుతారు. చూశాక కూడా వెంటాడే సినిమా. ఈ సినిమాని ఒక మంచి నవల లాగా తయారుచేసిన క్రాంతిమాధవ్ కు థాంక్స్. తనలోని భావుకతను సినిమాల్లో చూపించగలుగుతాడు" అన్నారు.
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, "నాలుగేళ్ల క్రితం 2016లో 'పెళ్ళిచూపులు' అనే సినిమాతో తొలిసారి ఒక లీడ్ యాక్టర్ గా మీ ముందుకు వచ్చా. ఇప్పటికి ఏడు సినిమాలు రిలీజయ్యాయి. ఇది నా తొమ్మిదో సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్. ఈ నాలుగేళ్లలో హిట్లు కొట్టినం. చేతి నుంచి జారిపోయి మిస్సయిన సినిమాలున్నాయి. ఈ జర్నీలో రెండే రెండు స్థిరమైనవి ఉన్నాయ్. ఒకటి - మీరు (ఫ్యాన్స్). విజయ్ అంటే ఎవ్వడికీ తెల్వదు. అట్లాంటిది 2016 నుంచి ఇప్పుడు 2020 వరకు మీరు నాతోడు వస్తూనే ఉన్నారు. మనం కలిసి ఇంకా చాలా చాలా చెయ్యబోతున్నాం. ఇది జస్ట్ ప్రారంభమే. ఈ సంవత్సరం నుంచి కొత్త దశలోకి ఎంటరవుతున్నాం. రెండోది - నేను సిక్స్ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్, డబుల్ అనేది నాకు ఓపిక లేదు. కొడితే స్టేడియం బయటకు కొట్టాలని బ్యాట్ ఊపుతా. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' చేసిన. తమిళ్ రాకున్నా నేర్చుకొని, 'నోటా' చేసిన. 'డియర్ కామ్రేడ్' సినిమాను ఐదు రాష్ట్రాల్లో రిలీజ్ చెయ్యాలని నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తూ, నేర్చుకున్నాం. ఊరూరూ తిరిగి మ్యూజిక్ కాన్సర్ట్స్ చేశాం. కొన్ని స్టేడియం బయట పడ్డాయి, కొన్ని బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ లు పడ్డాయి. కానీ భయమైతే లేదు. ఎప్పుడు దిగినా సిక్స్ కొట్టాలనే దిగుతా. ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అని మొన్న చెప్పిన. ఎందుకంటే నాకట్లా అనిపిస్తోంది. అంటే మనిషిలా మారుతున్నా. టేస్టులు మారుతున్నయి. సినిమాల్లో ఇంకో దశలోకి వెళ్తున్నా. లాస్ట్ లవ్ స్టోరీ చేసినప్పుడు అన్నీ కవర్ చెయ్యాలని మూడు రకాల మనుషుల్ని ఇందులో ప్లే చేసిన. మూడు రకాల ఆర్థిక స్థోమతలు, మూడు రకాల సిటీలు, నాలుగు రకాల ప్రేయసులు.. ఒక ఊరిలో ఉంటూ పెద్దగా చదువులేని బొగ్గుగనిలో పనిచేస్తూ భార్యాభర్తల ప్రేమకథ ఒకటైతే, దానికి పూర్తి విరుద్ధంగా వరల్డ్ బిగ్గెస్ట్ సిటీ ప్యారిస్ లో ఒక తెల్లపిల్లతో పైలెట్ గా ఇంకో ప్రేమకథ. హైదరాబాద్ లో కాలేజిలో ఒక అమ్మాయితో మరో ప్రేమకథ.. ఇన్ని విచిత్రమైన క్యారెక్టర్లు ఈ సినిమాలో చేసే స్క్రిప్టుతో క్రాంతిమాధవ్ నా దగ్గరకు వచ్చాడు. స్క్రిప్ట్ వినగానే ఇది నా ఫైనల్ లవ్ స్టోరీ అని ఫిక్సయి చేశా. ఇలాంటి క్యారెక్టర్ చేసే ఛాన్స్ నాకు మళ్లీ దొరకదు. ఎందుకంటే, బొగ్గుగనిలో శీనయ్య లాగా నేను ఉండను, అలా మాట్లాడలేను. అందుకే శీనయ్య రోల్ ను మస్తు ఎంజాయ్ చేశా. అలాగే ఒక ఫారిన్ పైలెట్ తో మనం రిలేషన్షిప్ లో ఉండం. అందుకే ప్యారిస్ ఎపిసోడ్ ను పూర్తిగా ఎంజాయ్ చేసిన. గౌతమ్ రోల్ మన లైఫ్ లో కొంచెం చూసినం. కానీ ఈ మూడు రోల్స్ ను ప్లే చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఈ ఫిబ్రవరి 14న ఈ సినిమాకొచ్చి మీరందరూ ప్రేమలో పడతారనుకుంటున్నా. ఈ సినిమాతో మా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారికి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నా. ఇది క్రాంతిమాధవ్ సినిమా. మేమందరం యాక్టర్స్ అంతే. ఈ స్క్రిప్ట్, ఈ ఆత్మ, మొత్తం క్రాంతిది. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాడు. ఆయనకు అతిపెద్ద సక్సెస్ రావాలని ఆకాంక్షిస్తున్నా. గోపీసుందర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ గుమ్మడి చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఇకనుంచీ సిక్సులు కొట్టడానికే చూస్తా. ఫ్యాన్స్ అందరికీ థాంక్స్" అని చెప్పారు.