శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పిస్తున్న సినిమా ఆదిత్య. సంతోష్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందింది. భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలోనిర్మించారు. ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది.
ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకనిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ``రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ మా సినిమాను చూసి ట్యాక్స్ ఫ్రీ చేశాయి. అబ్దుల్ కలామ్ స్ఫూర్తితో తెరకెక్కించిన సినిమా ఇది. వ్యాపార దృష్టితో చేయలేదు. సినిమా చూసిన వారిలో అవగాహన కలిగితే చాలు`` అని చెప్పారు.
ఎఫ్ డీసీ సుభాష్ మాట్లాడుతూ ``ఈ సినిమా చూశాను. చాలా బావుంది. సబ్సీడీ గురించి ఇప్పుడు సరైన గైడ్ లైన్స్ లేవు. ఓ కమిటీ ఫార్మ్ కావాలి. తమ్మారెడ్డిలాంటివారు దానికి సలహా ఇవ్వాలి`` అని తెలిపారు.
టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ``బాలరామాయణం, బాలభారతం సినిమాలను మనం చూశాం. కానీ ఇప్పుడు అలాంటి సినిమాలు రావడం లేదు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కారణమైతే, పరిశ్రమ మరికొంత కారణమవుతోంది. ఇప్పుడున్న పిల్లలను రాముడెవరు? సీత ఎవరు? అని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పే పరిస్థితిలో లేరు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించకపోతే బూతు సినిమాలు, బట్టల్లేని సినిమాలు తీసుకుంటే మంచి డబ్బులొస్తాయని అనుకునే పరిస్థితికి నిర్మాత చేరుతాడు. దయ చేసి అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇలాంటి చిన్న సినిమాలకు చాలా సార్లు తమ సపోర్ట్ ఇచ్చారు`` అని అన్నారు.
బీసీ కృష్ణమోహన్ మాట్లాడుతూ ``నేటి సినిమా క్రైమ్ వైపు పరుగులు తీస్తోంది. మన సంస్కృతి దాని ద్వారా విచ్ఛిన్నమవుతోంది. వాటిని గుర్తించాలి. మంచి వైపు నడిపించాలి. అందుకు ఇలాంటి సినిమాలు ఉపయోగపడతాయి. ఇలాంటి సినిమాకు సమాజం ఆదరణ కావాలి`` అని చెప్పారు.
ప్రేమ్ బాబు మాట్లాడుతూ ``ఈ నెల 14 నుంచి హైదరాబాద్‌లో జరిగే బాలల చలనచిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ఈ నెల 6న విడుదలవుతున్న ఈ సినిమాను చూసి అందరూ అభినందించాలి. ఇందులో నేను టైటిల్ రోల్ చేశాను`` అని అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ``అనాథ అనేదే పెద్ద సబ్జెక్ట్. వారికి కులం, మతంతో సంబంధం ఉండదు. అసలు స్ట్రీట్ చిల్డ్రన్‌ను తీసుకొచ్చి చదువులు చెప్పించాలనే ఓ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశాం. దాని గురించి ఇరు తెలుగు రాష్ట్ర ముఖ్య మంత్రులతో మాట్లాడాలి. త్వరలోనే వారితో మాట్లాడుతాం. ఇలాంటి సినిమాలకు థియేటర్లు కావాలి. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్‌లో మోడల్ థియేటర్ మొదలైంది. మరి వాటిని చిన్న సినిమాలకే పరిమితం చేస్తారా? పెద్ద వాటికి కూడా ఇస్తారా? అనేది చూడాలి. నేను ఇంతకు ముందు బాలల సినిమాలను తీసే మగాళ్లేరి? అని ప్రశ్నించాను. ఇప్పుడు ఈ రూపకర్త ముందుకొచ్చారు. ఇప్పుడు చూసే మగాళ్ళున్నారా? అన్నదే నా ప్రశ్న. బూతులు తి్టుకుంటేనే చూస్తాం అనే స్థాయి నుంచి ప్రేక్షకుడు కూడా ఎదగాలి. నీతులు చెప్పడమంటే ఫేస్‌బుక్కుల్లోనూ, ట్విట్టర్‌లోనూ నాలుగు మాటలను చెప్పడం కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి`` అని అన్నారు.