24 January 2015
Hyderabad
అలాంటి సినిమాలను చేయాలని నా కోరిక
- బెక్కం వేణుగోపాల్
లక్కీ మీడియా సంస్థ మొదలై దశాబ్దమైంది. మంచి కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించారు బెక్కం వేణుగోపాల్. జనవరి 25కి ఈ సంస్థ పురుడు పోసుకుని పదేళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బెక్కం వేణుగోపాల్ మీడియాతో ఆదివారం ఉదయం మాట్లాడారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ``నేను మీడియాలో పనిచేసేవాడిని. నేను, శివాజీ అప్పటి నుంచే మిత్రులం. ఇద్దరికీ జీవితంలో ఓ స్టెప్‌ముందుకు వేయాలని ఉండేది. నేనేమో నగేష్ కుకునూర్ తరహా సినిమాలు చేయాలని అనుకునేవాడిని. కల్ట్ మూవీస్‌ని ఎక్కువగా ఇష్టపడేవాడిని. కానీ శివాజీ మాత్రం కమర్షియల్ స్టాండ్‌లో వెళ్దామని చెప్పేవాడు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీయాలని అప్పుడే నిర్ణయించుకున్నాం. లక్కీగా లక్కీ మీడియా అనే పేరు పెట్టుకున్నాం. శ్రీనివాసరెడ్డితో `టాటా బిర్లా మధ్యలో లైలా` అనే సినిమాను చేశాం. జనవరి 25న సంఘీ టెంపుల్‌లోని వెంకటేశ్వరస్వామిపై తొలి షాట్‌ను చేశాం. తిరుమల వాసా అని లయతో ఓ పాట కూడా చిత్రీకరించాం. ఇప్పటికీ నా బ్యానర్ లోగో ఆ వెంకటేశ్వరస్వామి ఫోటోనే ఉంటుంది. ఆ సినిమాను అక్టోబర్ 12న విడుదల చేశాం. ఆ తర్వాత భూమికతో `సత్యభామ`ను చేశా. `మా ఆయన చంటిపిల్లాడు`కు మంచి స్పందన వచ్చింది. 2009లో పూర్తిగా `తకిట తకిట` సినిమా మీదే ధ్యాస పెట్టాను. ఆ సినిమాను మొత్తం చేసిపెట్టింది నేనే. చిన్న బడ్జెట్‌లో మంచి సినిమా చేయవచ్చని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన సినిమా `ప్రేమ ఇష్క్ కాదల్`. ఆ తర్వాత `మేం వయసుకు వచ్చాం` అని పూర్తిగా ప్రేమ కథా చిత్రాన్ని చేశాం.
ఇటీవల `సినిమా చూపిస్త మావ` చేశాం. నా తొలి సినిమా నుంచి వరుసగా సినిమాలు చేయడం, ప్రమోట్ చేయడం, మరలా సినిమాలు చేయడం ఇలా సర్కిల్‌గా వెళ్తూ ఉన్నా. ఈ ఏడాది రెండు కథలను ఇప్పటికే సెలక్ట్ చేసి పెట్టా. ఆ రెండు సినిమాలను తెరకెక్కిస్తా. ఇంకో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్తా. ఏప్రిల్ నుంచి మా సంస్థలో సినిమా మొదలవుతుంది. ఒకటి కొత్త దర్శకుడితో, మరొకటి త్రినాథరావు నక్కినతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. `బొమ్మరిల్లు`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`లాంటి సినిమాలు చేయాలని నా కోరిక. అలాంటి కథలను సిద్ధం చేయిస్తున్నా. నేను సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లకముందే డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడతా. నేననుకుంటున్న సినిమా ఎంత వరకు ప్రేక్షకులకు రీచ్ అవుతుందో తెలుసుకుంటా. దానికి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు కూడా చేసుకుంటా. సినిమా మొత్తం తీసిన తర్వాత అవసరమైతే రీషూట్‌లుచేయడానికి కూడా వెనకాడను. ఎందుకంటే ప్రేక్షకుడికి సినిమా నచ్చితే మనం ఎంత బడ్జెట్‌లో తీశాం? ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నాం? వంటి విషయాలను గురించి ఆలోచించడు. సినిమాను హిట్ చేస్తాడు. అలాగే శాటిలైట్ బిజినెస్‌ని నమ్మి నేనెప్పుడూ సినిమాలు చేయలేదు. ప్రేక్షకుడికి రీచ్ కావాలనే ఉద్దేశంతో ఏ సినిమా తీసినా శాటిలైట్ దానంతట అదే వస్తుంది. నా టార్గెట్ ఎప్పుడూ ప్రేక్షకుడే. అలాగే కొన్ని సినిమాలకు బాగా డబ్బులు వచ్చాయి. కొన్నిటికి రాలేదు. అయినా నాకు ఈ పదేళ్ల జర్నీ అనుభవాన్ని నేర్పింది. పలువురితో కలిసి మాట్లాడి పలు విషయాలను నేర్చుకోవడానికి దోహదపడింది. అందుకే నేనెప్పుడూ అనుభవమే ఆస్తి అని అనుకుంటాను. మంచి సినిమాలు తీయాలేగానీ భీభత్సమైన డబ్బులు ఈ పరిశ్రమలో ఉన్నాయని నమ్ముతాను. ఒళ్లు దగ్గరపెట్టుకుని కష్టపడితే ఇక్కడ సక్సెస్ సాధించగలం అనే నమ్మకంతో ముందుకు సాగుతున్నాను. ఈ పదేళ్ళలో మా సంస్థ తెచ్చకున్న గుర్తింపు అదే. లక్కీ మీడియా మంచి సినిమాలను నిర్మిస్తుందనే భావనను ప్రేక్షకుల్లో కలిగించగలిగినందుకు ఆనందంగా ఉంది`` అని చెప్పారు.