‘అమ్మా నీకు వందనం', 'ప్రణయ వీధుల్లో' చిత్రాల ద్వారా తనలో డిఫరెంట్ ఫిలిం మేకర్ ఉన్నాడని నిరూపించుకున్నారు ప్రభాకర్ జైని. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ జైని తాజాగా'క్యాంపస్అంపశయ్య' పేరుతో ఓ చిత్రం చేసిన విషయం తెలిసిందే.ఇందులో ప్రభాకర్ జైని కూడా ప్రధాన పాత్ర చేశారు. శ్యామ్ కుమార్, పావని హీరో హీరోయిన్ గా నటించారు. జైనీ క్రియేషన్స్ , ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. 1969లో నవీన్ రాసిన 'అంపశయ్య' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ పాటను సోమవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా...
కె.వి.రమణాచారి మాట్లాడుతూ‘’కళలు, సాహిత్యం అంటే మక్కువ చూపే దర్శకుడు ప్రభాకర్ జైని నా శిష్యుడు. అంపశయ్య నవల ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఇంకా దాని ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. ఆ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.
అంపశయ్య నవీన్ మాట్లాడుతూ‘’అంపశయ్య విద్యార్థుల మానసిక సంఘర్షణతో కూడుకున్న నవల. ఈ నవలను చాలా మంది సినిమాగా చేయాలనుకున్నప్పటికీ ప్రభాకర్ జైనిగారు మాత్రమే ఈ నవలను సినిమాగా చేయగలిగారు’’ అన్నారు.
ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ‘’నవీన్ గారు ఏం అనుకుని నవలను రాశారో ఆ భావనను మిస్ కానీయకుండా ప్రభాకర్ గారు సినిమాగా తీశారు. ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కలిగించిన ప్రభాకర్ గారికి థాంక్స్’’అన్నారు.
చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైని మాట్లాడుతూ‘’ఇది వరకు తెలుగు, తమిళం, మలయాళంలో ఈ సినిమా పాటను విడుదల చేశాం. ఇప్పుడు హిందీలో కూడా విడుదల చేస్తున్నాం. క్యాంపస్ చదివే విద్యార్థులకు దగ్గరగా ఉండే చిత్రమిది. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు.