స్నేహచిత్రం పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణమూర్తి దర్శక నిర్మాతగా రూపొందిన చిత్రం దండకారణ్యం. ఆర్.నారాయణమూర్తి, త్రినాథ్, విక్రమ్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్ర ఆడియో ఫిభ్రవరి 20న, సినిమా మార్చి 4న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘’త్రేతాయుగంలో సీతారాములు, ద్వాపర యుగంలో పాండవులకు అవాస యోగ్యంగా ఉన్న దండకారణ్యం ఇప్పుడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ప్రభుత్వం చేపట్టే బాక్సైట్ తవ్వకాల వల్ల అక్కడ ఆదివాసీలకు మనుగడ లేకుండా పోతుంది. ఆదివాసీల హక్కల గురించి తెలియజేసే చిత్రమే దండకారణ్యం. దండకారణ్యం మన సంపద, కానీ దీన్ని విదేశీ కార్పొరేట్ కంపెనీలు కొల్లగొడుతున్నాయి. ప్రభుత్వం, నక్సలైట్స్ గొడవలు పడకుండా ఆదివాసీలకు న్యాయం చేయాలని ఈ సినిమా ద్వారా చెబుతున్నాం. సినిమాలో ఏడు పాటలున్నాయి. అందులో మూడు పాటలను గద్దర్ రాశారు, ఒక పాటలో యాక్ట్ చేశారు. నాలుగు పాటలను వందేమాతరం శ్రీనివాస్ పాడారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఆడియో కార్యక్రమాన్ని ఫిభ్రవరి 20న విడుదల చేసి, సినిమాను మార్చి 4న విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, కథ, చిత్రానువాదం, మాటలు, ఎడిటింగ్, కొరియోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్.నారాయణమూర్తి.