స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన `దండకారణ్యం` ఈ నెల 18న విడుదల కానుంది. ఆర్.నారాయణమూర్తి, విక్రమ్, ప్రసాద్ రెడ్డి, త్రినాథ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా గురించి ఆర్.నారాయణమూర్తి మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ``పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. గద్ధర్, వందేమాతరం వంటి గొప్ప వారు పాడారు. భారతదేశంలో దాదాపు 12.13 రాష్ట్రాలను ఆనుకుని ఉన్న ఓ ప్రదేశం దండకారణ్యం. అక్కడ ఎక్కువగా గిరిజనులు ఉంటారు. అయితే ఇవాళ ఈ ప్రదేశం అగ్నిగుండంగా మారుతోంది. ఆదివాసీల ప్రాణాలు పోతున్నాయి. రాజ్యాంగం షెడ్యూల్ 5, 5డి, 6లను ఇంప్లిమెంట్ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు వారికి ఖనిజ సంపదను దారాదత్తం చేస్తున్నందుకు పలు చోట్ల పోరాటాలు జరుగుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడమని వాళ్ళు అర్థిస్తున్నారు. ఈ మధ్య ఢిల్లీలో ఓ ఘటన జరిగితే దాని తాలుకూ చర్చలు పార్లమెంట్‌లో జరుగుతున్నాయి. అలాంటప్పుడు దండకారణ్యం గురించి కూడా పార్లమెంట్‌లో చర్చలు జరగాలి. దండకారణ్యంలో చావులు ఎవరికోసం? అనే విషయం ఆలోచించాలి`` అని చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, కథ, చిత్రానువాదం, మాటలు, ఎడిటింగ్, కొరియోగ్రఫీ, కెమెరా; సంగీతం, నిర్మాత: ఆర్.నారాయణమూర్తి.