`మా` ఆర్టిస్టుల ఉపాధి కల్పనకు నిరంతరాయంగా అవకాశాలిప్పేంచేందుకు మా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వెల్‌ఫేర్ కమిటి- జాబ్ విభాగం ప్రారంభమైంది. మా సభ్యుల్లో నైపుణ్యం, అనుభవం ఉండీ అవకాశాల్లేక ఆర్థికంగా, మానసికంగా కుంగుతున్న వారికి మన దర్శకనిర్మాతలంతా అవకాశాలిచ్చి ఉపాధి కోల్పోకుండా కాపాడాలని `మా` అధ్యక్షకార్యవర్గం ఈ సందర్భంగా కోరింది. `మా` వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సీనియర్ నరేష్, `మా` ప్రధాన కార్యదర్శి శివాజీరాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహజనటి జయసుధ, నిర్మాత సి.కళ్యాణ్, హీరో శ్రీకాంత్, `రోషిణి` స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, రంగారెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ వై.వెంకయ్య, `వందేమాతరం` ఫౌండేషన్ వికాస్, ఏడిద శ్రీరామ్, సురేష్ కొండేటి, హేమ, గంగాధర్ పాండే, దేవేందర్, గౌతంరాజు, లత తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో `మా` జాబ్ విభాగం మెంబర్స్, మా అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. `మా` జాబ్ విభాగం బ్రోచర్ ని సహజనటి జయసుధ ఆవిష్కరించారు. హీరో శ్రీకాంత్, సి. కళ్యాణ్‌లు బ్రోచర్‌లను అందుకున్నారు. అలాగే 350 మంది `మా` మెంబర్లకు సంబంధించిన ఎస్‌బిఐ ఇన్సూరెన్స్ పత్రాల్ని జయసుధకు శివాజీ రాజా అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధులను, మా సభ్యుల్ని సాలువాలతో సత్కరించారు. ఇదే వేదికపై నటి `బొమ్మరిల్లు` సారిక పుట్టినరోజు వేడుకలు మా సభ్యలు జరిపించారు.
అనంతరం `మా` వెల్ఫేర్ కమిటీ చైర్మన్, సీనియర్ నరేష్ మాట్లాడుతూ -``ఉద్యోగులు, డాక్టర్లు, లాయర్లకు ఉన్న గ్యారెంటీ ఉపాధి ఆర్టిస్టులకు ఉండదు. ఓసారి అవకాశాలు పోతే మళ్లీ అంత తేలిగ్గా రావు. అందుకే మా మెంబర్లు, ఆర్టిస్టులందరికీ అవకాశాలు కల్పించేలా దర్శకనిర్మాతల్ని కోరతాం. గౌతంరాజు ఇన్‌ఛార్జ్‌గా సబ్ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ టీమ్ నిర్మాతలు, దర్శకులు, కోడైరెక్టర్, రైటర్లను కలుస్తుంది. పాత్రల్ని క్రియేట్ చేయమని కోరుతుంది. తెలుగు నటులకు తెలుగువారే అవకాశాలివ్వాలని అభ్యర్థిస్తుంది. మా మెంబర్లకు ప్రభుత్వం తరపున ఇళ్ల పథకాలు, ఇతరత్రా పథకాలు అందజేసేలా కృషి చేస్తున్నాం. పలు స్వచ్ఛంద సంస్థలు మానసికంగా గైడ్ చేసేందుకు ముందుకొచ్చాయి. ఇదో కొత్త ఎటెంప్ట్. ఏడాదిన్నరలో మా చేస్తున్న అద్భుతాలెన్నో. భవిష్యత్ తరాలకు నేటి మా కార్యకలాపాలు పదే పదే గుర్తొచ్చేలా చేస్తాం`` అన్నారు.
`మా` ప్రధాన కార్యదర్శి శివాజీ రాజా మాట్లాడుతూ -``13ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయినప్పుడు ఇక నటించలేనని అనుకున్నా. అప్పుడు మా సభ్యులే సపోర్టుగా నిలిచారు. అందుకే `మా`కే అంకితమై ఈ మంచి పనులు చేస్తున్నా. మా సభ్యులకు ఏ కష్టం వచ్చినా వచ్చి నాతో చెప్పుకుంటారు. నరేష్, `మా` ఈసీ మెంబర్లు నా వెంట ఉండడంతోనే ఈ పనులన్నీ చేయగలుగుతున్నా. నా కెరీర్ ఆరంభం ఆటోలు, బస్సుల్లో తిరిగాను. ఆ కష్టం ఎలాంటిదో నాకు అనుభవమే. అందుకే మా సభ్యుల్లో 10 మందికి కనీసం బైకులు కూడా లేవ్. వారికి బైక్ లోన్స్ ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం. బ్యాంకుల అండదండలున్నాయ్. `మా` మెంబర్లు 350 మందికి ఉచిత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశాం. 2లక్షల వరకూ ఎస్‌బిఐ కవరేజీ ఉంటుంది. సభ్యుల ఆరోగ్యం కోసం అపోలో ఆస్పత్రి వర్గాలతో సంప్రదింపులు జరిపాం. వారి సాయం మాకు ఉంది. ఇలాంటి మేలు చేసే పనులెన్నో మునుముందూ విజయవంతంగా చేయనున్నాం. ఆర్టిస్టులకు అవకాశాల్ని ఇప్పించేందుకు జాబ్ విభాగం మొదలుపెట్టాం`` అని తెలిపారు. హైదరాబాద్‌లో ఫిలింఇనిస్టిట్యూట్ ఉంటే బావుంటుందని ప్రభుత్వాన్ని కోరితే వెంటనే 100 ఎకరాల్లో ఫిలింఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా శివాజీరాజా గుర్తు చేశారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ -``సాటి మెంబర్లకు ఉపయోగపడే మంచి పనులు చేయడం `మా`లోనే చూశాను. ఇంతకుముందు కడుపునిండినోళ్లకు ఈ సమస్యలేవీ తెలియలేదు. కొత్త కార్యవర్గం, శివాజీరాజా ఆధ్వర్యంలో ఇప్పుడు మంచిపనులెన్నో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నాయి. ఈరోజుల్లో వేషాలు ఎవరికిస్తున్నారో నిర్మాతలకు తెలీనేతెలీవు. కానీ నిర్మాతకు తప్పక తెలియాలి. మా - జాబ్ విభాగం బ్రోచర్‌లోని మెంబర్లకు అందరూ తప్పక అవకాశాలివ్వాలి. నా వంతుగా వారికి అవకాశాలిస్తాను. వేరొకరిని ఇవ్వమని నేను కూడా అడుగుతాను`` అన్నారు.
జయసుధ మాట్లాడుతూ -``నరేష్, శివాజీరాజా ఏ పని అనుకున్నా పూర్తి చేయనిదే వదిలిపెట్టరు. శివాజీ `మా` ప్రధానకార్యదర్శిగా ఎంతో ప్యాషన్‌తో పనిచేస్తున్నారు. తనలా ఆలోచించేవాళ్లంతా కలిసి మంచి పనులెన్నో చేస్తున్నారు. నిర్మాత, డైరెక్టర్, కోడైరెక్టర్ వద్ద ఈ బ్రోచర్ ఉండాలి. ఆర్టిస్టుల గౌరవం తగ్గకుండా అవకాశాలివ్వాలి. వేరే భాషల నటులు మన సినిమాల్లో నటించడం తప్పేం కాదు. అయితే తెలుగు నటీనటులకు ఛాన్సులిచ్చి బతకనివ్వాలి`` అన్నారు.