05 March 2016
Hyderabad
``నా చిన్నప్పటి నుంచి మా ఇంటి గోడలపై `ఓ స్త్రీ రేపు రా` అనే లైన్ రాసి ఉండటాన్ని గమనించాను. దాని అర్థం ఏమిటో అని చాలా మందిని అడిగి తెలుసుకున్నాను. ఇప్పటి జనరేషన్‌కి ఆ విషయాలను చెప్పాలనే `ఓ స్త్రీ రేపు రా` అనే సినిమాను తీశాను`` అని అంటున్నారు అశోక్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన `ఓ స్త్రీ రేపు రా` మార్చి 11న విడుదల కానుంది. ఈ సినిమా గురించి అశోక్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ ``మాది గుంటూరు జిల్లాలోని అంబాపురం గ్రామం. నేను ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదువుకున్నాను. ఆ తర్వాత బెంగుళూరులో ఉద్యోగం చేశాను. అప్పుడే రెండు షాట్ ఫిలిమ్స్ చేశాను. త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ అనేది ఓ షార్ట్ ఫిలిమ్. జైనీ అనేది మరో షార్ట్ ఫిలిమ్. ఆ రెండు సినిమాలతో నాకు ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ బాగా వచ్చింది. హారర్ అయితే సేఫ్ జోన్‌లో ఉంటుందని ఈ జోనర్‌లో సినిమాను చేశాం. నా చిన్న తనంలో మా ఇంటి గోడల మీద `ఓ స్త్రీ రేపు రా` అని రాసి ఉండేది. దాన్ని ఆధారంగా చేసుకుని రీసెర్చ్ చేసి మేం ఈ సినిమాను చేశాం. దెయ్యం చెప్పే కథ ఇది. 1980 బ్యాక్‌డ్రాప్‌లోనూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. హైదరాబాద్ పరిసరాల్లోనూ, హార్స్లీ హిల్స్ లోనూ ఎక్కువ భాగాన్ని చిత్రీకరించాం. ఈ సినిమా షూటింగ్ సమయంలో మా యూనిట్‌లో కొంతమందికి దెయ్యాలు కనిపించాయని చెప్పారు. 70 ప్లస్ థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. గ్రాఫిక్స్ వాడలేదు. ప్రవీణ్ ఈ సినిమాకు చాలా సాయం చేశారు. పిజ్జా సినిమా చూసి స్ఫూర్తి పొంది ఈ సినిమాను చేశాను`` అని తెలిపారు.