ఓంకార్ దర్శకత్వం వహించిన సినిమా రాజుగారి గది. వారాహి చలనచిత్రం, ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్ సంయుక్తంగా విడుదల చేశాయి. అశ్విన్ బాబు, చేతన్, ధన్య బాలకృష్ణన్, పూర్ణ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో గురువారం ప్రెస్‌మీట్ ను నిర్వహించారు.
ఓంకార్ మాట్లాడుతూ ``ఈ సినిమా ఫస్ట్ వీక్ చాలా తక్కువ థియేటర్లలో విడుదలైంది. థియేటర్ల సంఖ్యను చూసి మా టీమ్‌తో సహా చాలా మంది బాధపడ్డారు. సినిమాను దసరాకు విడుదల చేయడం అంత తేలిక కాదని నాక్కూడా తెలుసు. ఈ నెల 30న ఓవర్సీస్‌లో సినిమాను విడుదల చేస్తున్నాం. సినిమా పైరసీని చూడవద్దు. థియేటర్లో జనాల మధ్య చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. శుక్రవారం వైజాగ్ నుంచి టూర్‌ను మొదలుపెడతాం. సింహాచలంలో దర్శనం చేసుకున్నాక వైజాగ్, అన్నవరం, కాకినాడ, రామచంద్రాపురం, రాజమండ్రి, అమలాపురంలో తిరుగుతాం. ఆ తర్వాత ఏలూరు, విజయవాడ, గుంటూరు, తెనాలిలో పర్యటిస్తాం. ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఒక రోజు, కడప, కర్నూల్, నంద్యాల ఒక రోజు తిరుగుతాం. మిగిలిన ప్రాంతాలకు మరోసారి వెళ్తాం`` అని చెప్పారు.
సాయికార్తిక్ మాట్లాడుతూ ``తెరవెనుక ఉన్న టెక్నీషియన్లను తెర ముందుకు తీసుకుని రావడంలో ఓంకార్ కృషి చాలా గొప్పది`` అని అన్నారు.
అనిల్ సుంకర మాట్లాడుతూ ``దయచేసి పైరసీ సీడీలను చూడవద్దు. ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌లో కసితో తీశారు. ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. ఓంకార్ చాలా రిచ్‌గా తీశారు. 30 నుంచి థియేటర్ల సంఖ్యను డబుల్ చేస్తున్నాం. సినిమా హిట్ అయ్యేసరికి చాలా మంది ఫోన్లు చేసి విష్ చేస్తున్నారు`` అని తెలిపారు.
అశ్విన్ బాబు మాట్లాడుతూ ``ఎంతో అదృష్టం ఉంటే గానీ నా సినిమా దసరాకు విడుదలై ఉండదు. అనిల్ గారికి, సాయిగారికి ధన్యవాదాలు`` అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సాయి కొర్రపాటి కూడా పాల్గొన్నారు.