పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా ఆడియో వేడుక మార్చి 20న జరగనుంది. ఈ సందర్భంగా శనివారం పవన్ కళ్యాణ్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘’పాసులు లేని అభిమానులు ఆడియో ఫంక్షన్ కు రావద్దు. పాసులున్న వారు మాత్రమే రావాలి. లేనివారు టీవీల్లో చూడాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కువగా అభిమానులు వచ్చి గుమిగూడితే అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని పోలీసు వారు హెచ్చరించారు. గోపాల గోపాల సమయంలో కూడా ఒక ఇన్ సిడెంట్ జరిగింది. అది నన్నెంతో బాధించింది. ఇంత సెక్యూరిటీ సమస్యలుంటే ఫంక్షన్ ను క్యాన్సిల్ చేసేయమని చెప్పాను. ప్రెస్ మీట్ లోఆడియో రిలీజ్ చేసేద్దామని అనుకున్నాను. సెక్యూరిటితో ఫంక్షన్ కు అనుమతిచ్చిన డిజిపి అనురాగ్ శర్మగారు, కమీషనర్ సివి ఆనంద్ గారికి, డిసిసి కార్తికేయగారు సహా తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా కేసీఆర్ గారికి, హరీష్ రావుగారికి థాంక్స్.
ఆడియో కోసం ఆడిషనల్ పోలీస్ ఫోర్స్ ను కూడా రప్పిస్తున్నాం. పోలీసు వారు దృష్టిలో హోటల్ లో ఫారిన్ డేలిగేట్స్ చాలా మంది ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిజానికి ముందు ఆడియో వేడుకను నిజాం గ్రౌండ్స్ లో చేద్దామని అనుకున్నాం అయితే అక్కడ కూడా కొన్ని కన్ సర్న్ ఉందని అనడంతో వద్దనుకున్నాం. వ్యక్తిగతంగా నాకు ఆడియో వేడుక జరుపుకోవడం ఇష్టం లేకపోయినా ట్రేడ్ విధానంలో వేడుక చేద్దామని అనుకున్నాం. చిరంజీవిగారిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాం. గబ్బర్ సింగ్ ఆడియో ఆయనే విడుదల చేశారు. అలాగే జానీ తర్వాత నేను ఫుల్ ప్లెజ్డ్ స్క్రిప్ రాసిన సినిమా ఇదే కావడంతో ఆయన్ను పిలిచాను. కథ ఈరోస్ వాళ్ళు డబ్ చేసి విడుదల చేద్దామని అన్నారు. బాబీ మంచి కెపబుల్ డైరెక్టర్ బాగా చేశాడు. నేను దర్శకత్వం చేయడం లేదు. సినిమాను సినిమాగానే చేశాం. రాజకీయంగా ఎక్కడా ఆలోచించలేదు. డైరెక్షన్ చేయకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. నేను కొంత విజన్ తో పుష్ చేసే సమయంలో అందరికీ నాపై కోపం వచ్చేస్తుంది అందుకని డైరెక్షన్ చేయడం లేదు. ఖుషి తర్వాత నాలుగైదు హిట్స్ ఉంటే సినిమాలు వదిలేసేవాడిని. ఎందుకంటే నాకు సినిమాలు చేయాలంటే అలసటగా ఉంటుంది.
వేరే సినిమాతో పోటీ పడాలని నేను అనుకోను. సినిమా కెపాసిటీ ఎంతో అంతే ఆడుతుంది. అన్నయ్య ఇంటి దగ్గర సెట్ ఉండటంతో వచ్చి చూశారు. బావుంది, రియలిస్టిక్ గా ఉందని మెచ్చుకున్నారు. అన్నయ్యతో యాక్ట్ చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. రీసెంట్ గా కలిసినప్పుడు నేను ఆయన్ను సినిమాల పరంగానే కలిశాను’’ అన్నారు.