రాత్రి 7 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు పూర్తిగా ఒకే రాత్రిలో జరిగే ఆసక్తికర కథతో తెరకెక్కిన సినిమాయే '7 టు 4'. విజయ్ శేఖర్ సంక్రాంతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంద్ బచ్చు, రాజ్ బాలా, రాధికా, లౌక్య, పప్పు శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి అన్నిచోట్లా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని, ఏప్రిల్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలియజేస్తూ మూవీ టీమ్ హైద్రాబాద్‌లో ఈ సాయంత్రం ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత విజయ్ శేఖర్ సంక్రాంతి మాట్లాడుతూ.. "ఒకే ఒక్క రాత్రిలో జరిగే పలు ఆసక్తికర సంఘటనలతో, థ్రిల్లింగ్ నెరేషన్‌తో సాగే ఈ సినిమాకు ట్రైలర్, ఆడియో రిలీజ్ తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ట్రైలర్ చూసి సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఏప్రిల్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకులు సినిమాను అదరిస్తారని కోరుకుంటున్నా" అన్నారు.
ఇక సంగీత దర్శకురాలు శ్రీమతి స్నేహలత మాట్లాడుతూ.. '7 టు 4' పేరుతో తెరకెక్కిన ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలో మంచి సోషల్ మెసేజ్ కూడా ఉండడం, ఆ సినిమాకు తాను పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇక ఇదే సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ.. దర్శకుడి కష్టం, ఈ సినిమా అని పేర్కొంటూ తమకు అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రస్తుతం హర్రర్, థ్రిల్లర్ కథాంశాలకు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ట్రైలర్‌ను చూసి, ఈ సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నామని '7 టు 4' సినిమాను పలు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న డిస్ట్రిబ్యూటర్స్ ఈ సందర్భంగా తెలిపారు.
శ్రీకాంత్, ప్రవీణ్, నివాస్, భరత్, కిరణ్, నితేష్, కార్తిక్, అనుష్, వెన్నెల, దివ్య, చిన్ననేత తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు.. డిజైనింగ్: గణేష్ రత్నం, కో-డైరెక్టర్: గిరీష్, పోస్ట్ ప్రొడక్షన్ చీఫ్: వి.ఉపేంద్ర, రచనాసహకారం: శ్రీకాంత్-రాజేష్-చంద్రశేఖర్, సాహిత్యం: శ్రీమతి ద్విభాష్యం శ్రీలక్ష్మీ వందన, సంగీతం: శ్రీమతి స్నేహలతామురళి, కెమెరామెన్: ఇ. కె. ప్రభాత్-చిరంజీవి, ఎడిటర్: సత్య గిడుతూరి, సహ నిర్మాతలు: ఇ. బాలు నాయక్-కె.రమేష్, కథ-స్క్రీన్ ప్లే-సంభాషణలు-నిర్మాణం-దర్శకత్వం: విజయ్ శేఖర్ సంక్రాంతి!!