1956లో హైద్రాబాద్ లో మహానగరంలో స్థాపించబడిన మొట్టమొదటి స్టూడియోగా చరిత్ర పుటల్లో నిలిచిన "సారథి స్టూడియోస్" అప్పట్నుంచి చిత్ర పరిశ్రమకు అంకితమై కొన్ని వందల చిత్రాల చిత్రీకరణకు నెలవైంది. తదనంతరం కారణాంతరాల వలన స్టూడియో విభాగంలో వెనుకబడిన "సారధి" సంస్థ.. సరిగ్గా 60 సంవత్సరాల తర్వాత "సారధి స్టూడియోను" నేటి చిత్రీకరణ పద్ధతులకు అనుగుణంగా తీర్చిదిద్ది.. తెలుగు చిత్ర పరిశ్రమకు మరోమారు పునరంకితం చేసింది. మార్చి 11 (శుక్రవారం) అమీర్ పేటలోని సారధి స్టూడియోస్ లో ఈ పునరింకిత కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కళాతపశ్వి శ్రీ కె.విశ్వనాధ్ గారు, దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు, దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారు విచ్చేయగా.. సీనియర్ దర్శకులు రేలంగి నర్సింహారావు, సానాయాది రెడ్డి, వీరశంకర్, అల్లాణి శ్రీధర్ లు ఆత్మీయ అతిధులుగా హాజరయ్యారు.
"సారధి సంస్థ" ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్, డైరెక్టర్ కె.వి.రావులు పుష్పగుచ్చాలతో అతిధులకు స్వాగతం పలికారు.
దర్శకేంద్రులు శ్రీ కె.రాఘవేంద్రరావుగారు డబ్బింగ్ మరియు ఎడిటింగ్ విభాగాలను ప్రారంభించగా.. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు సంయుక్తంగా "సారధి స్టూడియో ప్రివ్యూ థియేటర్"ను ఆరంభించారు.
ఈ సందర్భంగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారు మాట్లాడుతూ.. "తెలుగు సినిమా అనే పదానికి ఉపమానం లాంటి "సారధి స్టూడియో" మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత సరికొత్త శోభలను అద్దుకొని చిత్రసీమకు పునరింకితమవ్వడం చాలా ఆనందంగా ఉంది. స్టూడియో స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకొని లాభాలు ఆర్జిస్తున్న ఈరోజుల్లో అత్యంత విలువైన ఈ స్థలాన్ని ఎటువంటి లాభం ఆశించకుండా.. కేవలం చిత్ర పరిశ్రమపై అభిమానంతో "సారధి స్టూడియో"ను పునరంకితం చేయడం అభినందనీయం. ఈ ప్రివ్యూ థియేటర్ చూస్తుంటే నాకు పాతరోజులు గుర్తొస్తున్నాయి. నా కెరీర్ లో దాదాపు 25-30 సినిమాలు నేను సారధి స్టూడియోస్ లోనే రూపొందించాను. దాదాపు రెండున్నరేళ్లు నేను ఈ స్టూడియోలోనే నివసించేవాడ్ని. ఈ సారధి సంస్థ ఇదే విధంగా కొనసాగుతూ మరిన్ని మైలురాయిలు చేరుకోవాలని కోరుకొంటున్నాను" అన్నారు.
సారధి సంస్థ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్ మాట్లాడుతూ.. "మా చిన్నప్పట్నుంచి "సారధి స్టూడియోస్" సంస్థ గురించి వింటూ వచ్చాం. 2006లో సారధి సంస్థను టేకోవర్ చేశాం. అయితే.. నేటి సినిమా అవసరాలకు అనుగుణంగా స్టూడియోలో వసతులు లేవని గ్రహించి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అధునాతన పద్ధతులతో తీర్చిదిదిద్దాం. ఇకపై చిత్రపరిశ్రమకు "సారధి స్టూడియోస్"ను పునరంకితం చేస్తున్నాం" అన్నారు.
సారధి సంస్థ డైరెక్టర్ కె.వి.రావు మాట్లాడుతూ.. "మా "సారధి స్టూడియోస్" పునరంకిత కార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరికీ పేరుపేరునా కృతజ్ణతలు తెలియజేస్తున్నాను. ఇకనుంచి "సారధి సంస్థ" చిత్ర పరిశ్రమతో మమేకమై ముందుకు సాగుతుంది" అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులందరూ "సారధి స్టూడియోస్" చిత్ర పరిశ్రమకు పునరంకితమవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేయడంతోపాటు.. సంస్థ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్ మరియు డైరెక్టర్ కె.వి.రావు గార్లకు శుభాకాంక్షలు తెలిపారు!