07 May 2015
Hyderabad
'గబ్బర్ 3డి' గేమ్ లాంఛ్ విశేషాలు
అక్షయ్ కుమార్, శృతిహాసన్ జంటగా క్రిష్ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ, వయాకామ్ 18మోషన్ పిక్చర్స్, సబీనా ఖాన్ సంయుక్తంగా నిర్మించిన హిందీ చిత్రం 'గబ్బర్ ఈజ్ బ్యాక్'. ఇది తమిళ చిత్రం 'రమణ'కి రీమేక్. తెలుగులో 'ఠాగూర్'గా రీమేక్ అయ్యింది. మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తూ విజయవంతంగా ముందుకు దూసుకెళుతోంది. ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి 'గబ్బర్ 3డి' గేమ్ ఆవిష్కరణ కార్యక్రమం నిన్న (6.5.2015) రామోజీ ఫిలిం సిటీలో జరిగింది.
హీరోయిన్ శృతిహాసన్ ఈ గేమ్ ని విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ - ''ఈ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా మంచి విజయం సాధించింది. అక్షయ్ కుమార్ చక్కటి కో-స్టార్. ఆయన దగ్గర్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి 'గేమ్' లాంఛ్ చేస్తున్నాము. ఇది 3డి బెస్డ్ గేమ్. ఈ గేమ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నాకు వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయం దొరికితే వీడియో గేమ్స్ ఆడుతుంటాను. సినిమాలానే గేమ్ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని తెలిపారు.
స్కై టాయ్ ఫౌండర్ శివ మాట్లాడుతూ - ''2015లో పెద్ద హిట్ చిత్రంగా 'గబ్బర్ ఈజ్ బ్యాక్' నిలుస్తుంది. అలాంటి సినిమా గేమ్ ని లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. వయాకామ్ తో వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గేమ్ చాలా ఆసక్తిగా ఉంటుంది. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను'' అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆలెన్ (సి.ఈ.ఓ ఆఫ్ ఏరస్ గేమ్ స్టూడియోస్) పాల్గొని ఈ గేమ్ లాంఛ్ చేస్తున్నందుకు తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.