31 May 2016
Hyderabad
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సంధర్భంగా ఓ ప్రముఖ టీవీ చానెల్ సమర్పణలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వరావు నిర్మాణ సారధ్యంలో పూర్ణ చందర్ దర్శకత్వంలో మిట్టపల్లి సురేందర్ సంగీత, సాహిత్యం సమకూర్చిన 'మునుము' అనే ప్రత్యేక గీతాన్ని మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ సంధర్భంగా..
తెలంగాణ సాంస్కృతిక శాఖ ఛైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ''యాభై సంవత్సరాల ఆకాంక్షకు మునుము పెట్టి ఎందరో త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సురేందర్ తో నా పరిచయం ఒక పాటతో మొదలైంది. అదొక త్యాగాల పాట. దాన్ని కాన్సెప్ట్ గా తీసుకొని, 'జై తెలంగాణ' ఆనే చిత్రాన్ని కూడా తెరకెక్కించాను. సురేందర్ విత్తనం లాంటి వాడు. ఈ పాట ద్వారా మంచి సందేశాన్ని అందిస్తున్నాడు. తన నుండి ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ''పాటను చాలా అందంగా చిత్రీకరించారు. ఆత్మీయ అనురాగాలను గుర్తు చేసే విధంగా ఉంది'' అని చెప్పారు.
టిఆర్ఎస్ నాయకుడు వి.ప్రకాష్ మాట్లాడుతూ.. ''తెలంగాణలో ఎన్నో విప్లవ పోరాటాలు, ఉధ్యమాలు జరిగాయి. ఆ ఉధ్యమాలు ఎందరో కవులు, గాయకులు పుట్టేలా చేసింది. సురేందర్ రాసిన ఈ 'మునుము' అనే పాట అధ్బుతంగా ఉంది. ఇలాంటి పాటలు మరిన్ని రావాలి'' అని చెప్పారు.
కల్వకుంట్ల తేజేశ్వరావు మాట్లాడుతూ.. ''తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకునే విషయంలో కెసిఆర్ గారు ఎంతో కృషి చేశారు. ఆ తెలంగాణ ప్రతిభను ఉట్టిపడేలా సురేందర్ రాసిన సాహిత్యం చక్కగా ఉంది'' అని చెప్పారు.
మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. ''నేను చెప్పిన కాన్సెప్ట్ విని, నచ్చి దానికి సహకరించిన క్రాంతి కిరణ్ గారికి, తేజేశ్వరావు గారికి నా కృతజ్ఞతలు. మునుము అంటే వరుస, క్రమం అనే అర్ధాలు వస్తాయి. ఈ పాట నుండి తెలంగాణ చిత్ర తెర వైపు ఒక మునుము పెట్టాలని ఈ టైటిల్ ను పెట్టాను'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రమ్య, భవాని రెడ్డి, అజయ్, రోశన్ బాలు, పూర్ణ చందర్ తదితరులు పాల్గొన్నారు.