21 January 2015
Hyderabad
''ప్రేమన్నది యూనివర్సెల్. కానీ ప్రేమలో ఉన్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్న విషయాన్ని కూడ అర్ధం చేసుకోకుండా నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుపోతున్నారు. దీని వల్ల మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని తన వల్ల జరిగిన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు? తన జీవితాన్ని అందంగా ఎలా మలుచుకున్నాడు అన్నది తెరపైనే చూడాలంటున్నారు'' నిర్మాత కమల్‌కుమార్ పెండెం. సంజయ్, చేతన ఉత్తేజ్, కారుణ్య నటీనటులుగా శ్రీవత్స క్రియేషన్స్ పతాకంపై ఆయన ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.శశిభూషణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మచిలీపట్నంలో కృష్ణాజిల్లా టి.డి.పి అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, బీసీ, ఎక్సైజ్, చేనేతశాఖ మాత్యులు కొల్లు రవీంద్ర(ఎ.పి), మున్సిపల్ ఛైర్మన్ మోదమర్రి బాబాప్రసాద్ సమక్షంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు.
నిర్మాత మాట్లాడుతూ ''చక్కని ప్రేమకథలో రూపొందుతున్న చిత్రమిది. ఎటువంటి వల్గారిటీ లేకుండా కుటుంబం మొత్తం చూసేలా ఉంటుంది. ఇందులో నాగబాబుగారు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలి షెడ్యూల్ మచిలీపట్నంలో ప్రారంభించాం. రాజమండ్రి, అమలాపురంలో అందమైన ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. మొదటి షెడ్యూల్‌లో టాకీ పూర్తి చేసి, కేరళ, కూర్గ్ ప్రాంతాల్లో పాటల్ని తెరకెక్కిస్తాం. సమ్మర్‌లో సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరా: వెంకట హనుమ, సంగీతం: రాం నారాయణ, ఆర్ట్: రమేష్, ప్రొడక్షన్ డిజైనర్: పుచ్చా రామకృష్ణ.