వెంకటేష్, రితిక సింగ్ ప్రధాన తారాగణంగా వై నాట్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధా కొంగ ప్రసాద్ దర్శకత్వంలో ఎస్.శశికాంత్ నిర్మించిన చిత్రం `గురు`. ఈ చిత్రం మార్చి 31న విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో...
హీరో వెంకటేష్ మాట్లాడుతూ - ``సినిమా ఆదరించిన ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా థాంక్స్ చెబుతున్నాను. సిన్సియర్‌గా, నిజాయితీగా ఒక మంచి సినిమా చేయాలని ప్రయత్నం చేశాను. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ అంతా సినిమా బావుందని అప్రిసియేట్ చేశారు. గురు సినిమా నాకు స్పెషల్ మూవీ. ఈ సినిమా టీం ముందు నుండి ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నించాం. అనుకున్నవిధంగా ప్రేక్షకులు మా సినిమాను రిసీవ్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా ముప్పై ఏళ్ళ కెరీర్లో నేను చేసిన ఛాలెంజింగ్ రోల్ గురు. ఇలాంటి ఒక సబ్జెక్ట్‌ను నాతో సినిమాగా తీసినందుకు డైరెక్టర్ సుధకు థాంక్స్. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు మోనాటనీగా అనిపిస్తున్న తరుణంలో గురు సినిమా చేయడం చాలా కొత్తగా అనిపించింది. సినిమా కోసం చాలా కష్టపడ్డాను. సుధ నా నుండి బెస్ట్ అవుట్‌పుట్‌ను తీసుకుంది. రితిక, ముంతాజ్ సహా అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు`` అన్నారు.
రితిక మాట్లాడుతూ - ``గురు సినిమా చాలా బావుందని సినిమా చూసిన వాళ్లందరూ అంటున్నారు. వార్తలను చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు గురులాంటి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్షన్ చేయడం చాలా కష్టమైన పని. ముఖ్యంగా నాలాంటి ఏమీ తెలియని వారితో సినిమా చేయడం ఇంకా కష్టం. సుధగారు అద్భుతమైన కథతో సినిమాను తెరకెక్కించారు. గురు టీంను నా ఫ్యామిలీగా భావించాను`` అన్నారు.
ముంతాజ్ మాట్లాడుతూ - ``మాది అంతా గురు ఫ్యామిలీగానే భావిస్తున్నాను. ఇందులో పార్ట్ కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను`` అన్నారు.
సుధ కొంగర మాట్లాడుతూ - ``జీవితంలో సులభమైన దారులు, క్లిష్టమైన దారులు అని రెండు ఉంటాయి. క్లిష్టమైన దారుల్లో ఒకటి సినిమాను డైరెక్ట్ చేయడం. ప్రపంచంలో అతి కష్టమైన పనుల్లో సినిమా డైరెక్షన్ చాలా కష్టమైన పని. ఈ సినిమా జర్నీ ప్రారంభంలో నేను నిద్ర మధ్యలో లేచేసేదాన్ని. నేను చేస్తుంది కరెక్టా..కాదా అని ఆలోచించుకునేదాన్ని., ఆ ఛాలెంజెస్, ఒత్తిడులన్నీ ఈ గురుతో తీరిపోయాయి. ఇంత మంచి సినిమా నేను చేయడానికి కారణమైన వ్యక్తుల్లో నిర్మాత శశికాంత్ సపోర్ట్ మరచిపోలేం. ఆయన ఏ డబ్బులు తీసుకోకుండా సినిమాను నిర్మించారు. అలాగే వెంకటేష్‌గారు ఎంతో డేడికేషన్‌తో సినిమాలో భాగమయ్యారు. రితిక, ముంతాజ్ నాలుగేళ్ళుగా నాతో ట్రావెల్ చేస్తున్నారు`` అన్నారు.
నిర్మాత ఎస్.శశికాంత్ మాట్లాడుతూ - ``మూడు భాషల్లో నాలుగేళ్ళ పాటు గురు ప్రయాణం సాగింది. ఈ జర్నీలో భాగమైన అందరికీ థాంక్స్. మా వై నాట్ స్టూడియోస బ్యానర్‌లో మంచి సినిమాలే వస్తాయని గురు చిత్రం మరోసారి నిజం చేసింది. వెంకటేష్ గారు నిర్మాతల హీరో. సెట్‌లో ముందు నిర్మాతలా ఆలోచిస్తారు., తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌లా ఆలోచిస్తారు. తర్వాతే నటుడులా ఆలోచిస్తారు. రిత్విక, ముంతాజ్ సహా ఈ సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్`` అన్నారు.