విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా నటించిన తమిళ చిత్రం `పిచ్చైకారన్`. శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫాతిమా ఆంటోని నిర్మించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సంస్థ తెలుగులో అనువదించింది. చదలవాడ పద్మావతి అనువదించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న
విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ ``నేను తమిళంలో పిచ్చైకారన్ అని ఈ సినిమాకు టైటిల్ పెట్టినప్పుడు నెగటివ్ ఇంపాక్ట్ వస్తుందని అందరూ అన్నారు. కానీ అటు తమిళంలోగానీ, ఇటు తెలుగులో గానీ ఇవాళ టైటిలే ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో, అంతకు మించి తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. రోజురోజుకీ థియేటర్ల సంఖ్య పెరుగుతుంటే ఆనందంగా ఉంది. స్క్రిప్ట్ ను నమ్మి తెలుగులో రిలీజ్ చేశారు చదలవాడ శ్రీనివాస్‌గారు. ఆయనకు ధన్యవాదాలు. నా నెక్స్ట్ మూవీస్ అన్నిటి చిత్రీకరణను 50 శాతం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేయాలని భావిస్తున్నాను`` అని చెప్పారు.
శశి మాట్లాడుతూ ``మానవతా విలువలున్న చిత్రమిది. భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా చేశాను. కథను నమ్మి చేసిన చిత్రమిది. తెలుగుకు సరిపోతుందా? తమిళానికి సరిపోతుందా? వంటి లెక్కలేవీ వేసుకోలేదు. తెలుగులో పెద్ద మాసివ్ హిట్‌గా నిలిచింది`` అని తెలిపారు.
చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ``30 ఏళ్ల తర్వాత ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించామని చాలా ఆనందంగా ఉంది. తమిళం కన్నా ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. విజయవాడ, హైదరాబాద్‌లో రేపటి నుంచి థియేటర్లను పెంచనున్నాం`` అని అన్నారు.
చక్కటి చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని లక్ష్మణ్, సాత్న, భాషశ్రీ తదితరులు తెలిపారు.