18 June 2015
Hyderabad
సీనియర్ సినీ కళాకారులకు తెలంగాణ బౌన్సర్స్ అండ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నిత్యవసర వస్తువులు మరియు ఆర్ధిక సహాయం.
సినీ రంగంలో కళాకారుల జీవితం సక్సెస్ ఉన్నంత వరకూ ఇంధ్రధనస్సులా వెలిగిపోతూ ఉంటుంది. కానీ, రోజురోజుకూ పెరిగిపోతున్న కాంపిటేషన్ వల్ల గానీ, వయసు పైబడటం వల్లగానీ కొంత మంది సీనియర్ కళాకారులు నేడు వర్ణనాతీతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. పైకి చెప్పుకోలేక, లోలోన వారు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. అటువంటి వారిని ఆదుకోవడానికి తెలంగాణ బౌన్సర్స్ అండ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో భాగంగా జూన్ 17, బుధవారం నాడు.. అసోసియేషన్ ఫౌండర్ వి. చిన్న శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో వృద్ధకళాకారులను సన్మానించి, వారికి 25 కేజీల బియ్యం, 5 లీటర్ల రిఫండ్ ఆయిల్, 2 కేజీల కందిపప్పు, దినుసులతో పాటు 500 రూపాయల ఆర్ధిక సహాయాన్ని ఎమ్. ఘటోజనం, వెంకటేష్, సింహాచలం, బాలు, కొండలరావులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్‌ఐఎమ్ పార్టీ అధ్యక్షుడు వి. నవీన్‌యాదవ్, వెంకట్ యాదవ్‌లతో పాటు అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగ్ యాదవ్ మరియు కార్యవర్గ సభ్యులు వెంకట్, రామారావు, వినయ్‌కుమార్, మూర్తి, మల్లిఖార్జున్, పవన్, గణేష్, నర్సింహారెడ్డి, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అసోషియేషన్ ఫౌండరైన చిన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ..‘‘ మా తెలంగాణ బౌన్సర్స్ అండ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఏర్పాటైన ఈ అతి తక్కువ కాలంలో మా దృష్టికి వచ్చిన ఈ పేద కళాకారులను ఆదుకునేందుకు మా సంస్ధ సభ్యులందరూ ముందుకు రావడం నాకు ఆనందంగా ఉంది. ఇకపై ప్రతి నెలా వారికి నిత్యవసర వస్తువులతో పాటు ఆర్ధిక సహాయాన్ని అందించనున్నాం. రాబోయే కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు మా బౌన్సర్స్ అండ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తరుపున చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..’ అన్నారు.