స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్‌బాబు సమర్పణలో రాజ్ కందుకూరి(ధర్మ పథ క్రియేషన్స్), యష్ రంగినేని(బిగ్ బెన్ సినిమాస్) నిర్మాతలుగా కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ, రీతూ వర్మ జంటగా రూపొందిన చిత్రం 'పెళ్ళిచూపులు'. ఈ చిత్రం జూలై 29న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా థాంక్స్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..
దర్శకరత్న డా||దాసరి నారాయణరావు మాట్లాడుతూ ''ఈరోజుల్లో సినిమాను ఎంత గొప్పగా తీశామనడం కంటే ఎంత బాగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లామనేదే ముఖ్యం. ఆ విషయంలో సక్సెస్ అయిన సురేష్‌బాబుగారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. రాజ్‌కందుకూరి చాలా మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. నాకు తెలసి బడ్జెట్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. చిన్న సినిమాలు లేవు. ఏ పెద్ద హీరోఅయినా బడ్జెట్ సినిమాల నుండే వచ్చినవాడు. ప్రతి ఒక్కరి టాలెంట్‌ను, రిస్క్ లేకుండా ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లేది బడ్జెట్ సినిమాలు మాత్రమే. చాలా సార్లు మీడియా వారు మంచి సినిమా అంటే ఏంటని అడుగుతుంటారు. వారికి చెప్పేదేంటంటే పెళ్ళిచూపులు మంచి సినిమా. చాలా మంది నేను చేసిన పెద్ద బడ్జెట్ సినిమాల గురించే మాట్లాడుతుంటారు. కానీ నేను చేసిన తొలి 25 సినిమాలు బడ్జెట్ సినిమాలే. బాహుబలి గొప్ప సినిమా. పెద్ద బడ్జెట్ సినిమా, మీరు దానికి ఓటేస్తారా, పెళ్ళిచూపులకు ఓటేస్తారా అని ఎవరైనా అడిగితే నేను పెళ్ళిచూపులు చిత్రానికే ఓటేస్తాను. ఇది నిర్మాతల గొప్పతనం అనడం కన్నా దర్శకుడు తరుణ్ గొప్పతనం. జనం ఇలాంటి సినిమాలనే కావాలనుకుంటారు. ఈ సినిమా ఒకట్నిర కోటితో రూపొందినా 12 -15 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను వసూలు చేస్తుందని చెబుతున్నాను. సినిమా అంటే రికార్డులు తిరగరాయడం కాదు, చరిత్రలో నిలిచిపోవడమే. గత ఐదారు సంవత్సరాలుగా తెలుగు సినిమా నాశనం అయిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇక్కడ క్రియేటివ్ సినిమాలు రావడం లేదు. తమిళ్, హిందీల్లో కొత్త ఇన్నోవేటివ్ పాయింట్స్‌తో సినిమాలు తీసున్నారు. స్కిన్‌షో, మసాలా లేని, వెకిలి లేని, నిజాయితీ ఉన్న సినిమాయే పెళ్ళిచూపులు. కథలు ఎక్కడనుండో రావు. మన చుట్టుపక్కల ఉంటాయి. అలాంటి కథను తీసుకుని రియాలిటీకి దగ్గరగా దర్శకుడు సినిమాను తెరకెక్కించాడు. ఇలాంటి సినిమాలు ఓ పది సినిమాలు వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ మళ్ళీ నెంబర్‌వన్ స్థానానికి చేరుకుంటుంది'' అన్నారు.
రాజ్‌కందుకూరి మాట్లాడుతూ ''సురేష్‌బాబుగారు తరుణ్‌భాస్కర్ అనే వ్యక్తిని పంపిస్తున్నాను. తన దగ్గర మంచి లైన్ ఉంది విను అన్నారు. నేను ముందు మంచి లైన్ అంటున్నారు కదా..మీరెందుకు చేయడం లేదని ఆయన్ను అడిగాను. అయితే స్టూడియో పనులతో బిజీగా ఉండటం వల్ల కుదరడం లేదని ఆయన అన్నారు. సరేనని నేను కథ విన్నాను. నాకు నచ్చడంతో నేను సినిమా చేయడానికి రెడీ అయ్యాను. ఈ ప్రయాణంలో యష్ రంగినేనిగారు లైన్ విని ఆయన కూడా సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. నేను నమ్మి చేసిన కథ. పది సంవత్సరాల్లో నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. ఈ సినిమా నాకొక విజిటింగ్ కార్డ్‌లా ఉపయోగపడుతుంది. దాసరిగారు, తమ్మారెడ్డి భరద్వాజగారు, రాజమౌళిగారు, రానాగారు ఇలా అందరూ సినిమా చూసి మెచ్చుకున్నారు. వివేక్ సింక్ సౌండ్ మ్యూజిక్‌కు, నాగేష్ సినిమాటోగ్రఫీకి చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది. తరుణ్‌భాస్కర్ కథపై మంచి కమాండ్ ఉన్న దర్శకుడు. ఈ టీంను కూడా తనే నా దగ్గరకు తీసుకొని వచ్చి ఈ సినిమా చేశాడు. ఇక చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా, విజయంతో సినిమా సైజ్‌ను నిర్ణయించవచ్చునని నా నమ్మకం'' అన్నారు.
యష్ రంగినేని మాట్లాడుతూ ''తరుణ్ పూర్తి బాధ్యతలు తీసుకుని ఈ సినిమా చేశాడు. ఈ ఇండస్ట్రీలో న్యూ టాలెంట్‌కు ఎప్పుడూ స్పేస్ ఉంటుందని నా నమ్మకం. ఈ చిత్రంతో మరోసారి అది ప్రూవ్ అయ్యింది. మేం సినిమా తీసిన తర్వాత సురేష్‌బాబుగారు సినిమా చూసి మంచి బూస్ట్ ఇచ్చారు. అందుకు ఆయనకు థాంక్స్'' అన్నారు.
దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ''ఈ సినిమా చేసేటప్పుడు మేం తొంబై శాతం సినిమా గురించేఆలోచించాం. ఈ సినిమా చేసేటప్పుడు చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. అయితే మేం నిజాయితీతో చేసిన ప్రయత్నమే పెళ్ళిచూపులు. చిన్న సినిమాలు సక్సెస్ అవుతాయా, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ సినిమాలు వస్తాయా, స్కిన్‌షో లేకుండా సినిమాలు సక్సెస్ అవుతాయా, సింక్ సౌండ్‌తో సినిమా చేయ్యెచ్చా ? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే పెళ్ళిచూపులు'' అన్నారు.
డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ''తరుణ్‌భాస్కర్ అండ్ టీం చేసిన వర్క్ చూసి ముచ్చటేసే ఈ సినిమాను ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లడానికి నేను ముందుకు వచ్చాను. కానీ చాలా మంది బేసిక్స్ తెలియకుండా సినిమాలు చేసేస్తూ ఉంటారు. తరుణ్ ఓ ప్యాషనేట్ టీంను తయారు చేసుకుని చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమా చేసిన ఆ టీంకు, ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించిన సినిమా ఇది'' అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ''ఈ మధ్య కాలంలో నేను సైరత్, పెళ్ళిచూపుల్లో హీరోయిన్స్‌తో ప్రేమలో పడిపోయాను. అంటే ఆ క్యారెక్టర్స్ నాకు అంత బాగా నచ్చాయి. ముఖ్యంగా రీతూవర్మ క్యారెక్టర్‌ను సినిమా చివరికి వచ్చేసరికి అందరూ ఇష్టపడతారు. తను అంతలా క్యారెక్టర్‌లో ఇమిడి పోయింది. వివేక్‌సాగర్ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇవ్వగా, నాగేష్ ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతుగా సినిమా సక్సెస్‌లో పార్ట్ అయ్యారు. ఇలాంటి మంచి సినిమాను ఎంకరేజ్ చేసిన సురేష్‌బాబు గారికిఅభినందనలు'' అన్నారు.
ఈ కార్యక్రమంలో రీతూవర్మ, సౌండ్ సంజయ్, నందు, వివేక్‌సాగర్, నాగేష్ బానేల్, మధురశ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.