31 May 2015
Hyderabad
పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న స్వాతి ప్రస్తుతం 'త్రిపుర' అనే చిత్రంలో కథానాయికగా నటించడానికి అంగీకరించింది. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం టీజర్ లాంచ్ శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ కిరణ్ మాట్లాడుతూ "గీతాంజలి సినిమాకు మించి ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. ఓ శక్తిమంతమైన కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రంలో స్వాతిది టైటిల్ రోల్. ఇలాంటి జానర్ సినిమా ఇప్పటివరకూ స్వాతి చేయలేదు. తనది అద్భుతమైన పాత్ర. నటిగా తనలోని మరో మంచి కోణాన్ని ఆవిష్కరించే చిత్రం అవుతుంది. చిన్నా గారు మొదటిసారి ఈ సినిమాతో ప్రొడక్షన్ లో అడుగుపెట్టారు. సినిమా మంచి హిట్ అయ్యి ఆయనకు లాబాలు తెచ్చిపెడుతుంది'' అని చెప్పారు.
నిర్మాత చినబాబు మాట్లాడుతూ "సినిమాకు మంచి టీం దొరికింది. ఈరోజు టీజర్ లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. సినిమా విజువల్ గా చాలా అందంగా ఉంటుంది. ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
రావు రమేష్ మాట్లాడుతూ "చాలా మంచి స్క్రిప్ట్. గీతాంజలి హిట్ తరువాత రాజ కిరణ్ గారు చేస్తున్న సినిమా ఇది. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సినిమా చూసాక ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్ స్క్రీన్ ప్లే సినిమాకి హైలైట్ గా వుంటాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమాతో అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
స్వాతి మాట్లాడుతూ "ఈ కథ పై అందరం చాలా నమ్మకంతో ఉన్నాం. సినిమా అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
సప్తగిరి మాట్లాడుతూ "రాజ గారు 'గీతాంజలి' సినిమాలో చిన్న రోల్ ఇచ్చినా ఈ సినిమాలో ఫుల్ లెంగ్థ్ రోల్ ఇచ్చారు. 'త్రిపుర' టైటిల్ ఎంత బావుందో ఈ సినిమాలో స్వాతి కూడా అంతే అందంగా ఉంటుంది. ఈ సినిమా డబ్బు కోసం కాకుండా కథను నమ్మి ప్యాషన్ తో తీస్తున్నారు" అని చెప్పారు.
ఈ చిత్రానికి మాటలు: రాజా, స్ర్కీన్ ప్లే: శ్రీనివాస్ వెలిగొండ, కోన వెంకట్, సంగీతం: కమ్రాన్, కెమెరా: రవికుమార్ సానా, నిర్మాతలు: ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్, రచన-దర్శకత్వం: రాజ కిరణ్, సమర్పణ: సర్వత్ రామ్ క్రియేషన్స్ (జవ్వాజి రామాంజనేయులు).