pizza
Amitabh takes up Green India Challenge
హైదరాబాద్ లో మొక్కనాటిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్
You are at idlebrain.com > news today >
Follow Us

27 July 2021
Hyderabad

మరో ముందడుగు వేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హైదరాబాద్ లో మొక్కనాటిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమానికి తన మద్దతు, ఆశీస్సులు ఉంటాయని వెల్లడి

దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపటమే లక్ష్యంగా పనిచేస్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవాళ మరో మైలురాయిని సాధించింది. వెండితెర బిగ్ బీ, పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న అమితాబ్ అక్కడే మొక్కలు నాటారు.

ప్రస్తుత తరుణంలో అందరికీ ఉపయోగకరమైన, భావి తరాలకు అవసరమైన మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను బిగ్ బి ప్రశంసించారు. ప్రకృతి, పర్యావరణ ప్రాధాన్యతను అందరూ గుర్తించాలని, పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, సంరక్షించటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అమితాబ్ గుర్తుచేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను దేశ వ్యాప్తంగా కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తాము ప్రత్యేకంగా ప్రచురించిన వృక్షవేదం పుస్తకాన్ని అమితాబ్ కు ఎంపీ సంతోష్ కుమార్ బహూకరించారు. వేద కాలం నుంచి వృక్షాల ప్రాధాన్యతను తెలుపుతూ వృక్షవేదం పుస్తకాన్ని తేవటం పట్ల అమితాబ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. తన తరపున మొక్కలు నాటాల్సిందిగా మరో ముగ్గురిని ప్రతిపాదిస్తానని, ఆ వివరాలు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తానని అన్నారు.

రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిలిం సిటీ ఎం.డి విజయేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved