pizza

A film like Aadavallu Meeku Joharlu is rare these days - Rashmika Mandanna
ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమా అరుదుగా వస్తుంది - హీరోయిన్ రష్మిక మందన్న

You are at idlebrain.com > news today >
Follow Us

28 February 2022
Hyderabad

అగ్ర హీరో శర్వానంద్ నటించిన కొత్త సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రంలో నాయికగా రష్మిక మందన్న నటించింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సకుటుంబ కథా చిత్రంగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించారు. మార్చి 4న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తెలిపింది నాయిక రష్మిక మందన్న. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...

- ఫస్ట్ లాక్ డౌన్ టైమ్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా స్క్రిప్టును దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పారు. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో ఇంత మంది లేడీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా వాటిలో ఎవరు నటిస్తారనే ఉత్సుకతనే మొదట కలిగింది. ఆ పాత్రలకు ఎవరెవరిని అనుకుంటున్నారో చెప్పాక సంతోషపడ్డాను. ఈ సినిమా ప్రధానంగా ఇంటర్వెల్ సీన్ ఒకటి నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా ఎలాగైనా చేయాలని అనిపించింది.

- ఈ చిత్రంలో నా పాత్ర పేరు ఆద్య. ఆమె ముక్కుసూటి మనిషి. మొహమాటంగా ఉండదు. అనుకున్నది చెప్పేస్తుంది. మనసులో ఏదో దాచుకుని డ్రామా క్రియేట్ చేయడం ఇష్టముండదు. సినిమా నిండా ఆడవాళ్లమే ఉంటాం కాబట్టి సెట్ లో మగవాళ్లంతా మమ్మల్ని చూసి ..వీళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో అంటూ ఇబ్బంది పడేవారు. - ఈ సినిమాలో మా క్యారెక్టర్స్ అన్నీ డైలాగ్ ప్రధానంగా సాగుతుంటాయి. అందరూ మాట్లాడుతుంటారు. అవన్నీ మనం ఇంట్లో మాట్లాడుకుంటున్నట్లు సహజంగా ఉంటాయి.

- దర్శకుడు కిషోర్ తిరుమలతో పనిచేయడం చాలా సరదాగా ఉండేది. ఆయనకు దైవభక్తి ఎక్కువ. మాల వేసుకునేవారు. ఏం కోరుకున్నారు సార్ అని అడిగితే.. ఇంతమంది మహిళలతో సినిమా చేస్తున్నాను కదా అన్నీ సవ్యంగా జరగాలని కోరుకున్నా అని నవ్వుతూ చెప్పేవారు. అలా ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ నవ్వుకునేవాళ్లం. సినిమా విషయంలో చాలా స్ఫష్టత ఉన్న దర్శకుడాయన. కిషోర్ తిరుమల మహిళలకు ఎంత విలువ ఇస్తారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. కమర్షియల్ సినిమాలు, హీరోయిజం ఉన్న సినిమాలు వస్తున్న ఈ టైమ్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ సినిమా చేయడం సూపర్బ్.

- శర్వానంద్ తో కలిసి నటించడం హ్యాపీ. నేను పుష్ప సెట్ లో నుంచి ఆడవాళ్లు..షూట్ కు వచ్చినప్పుడు చాలా రిలాక్స్ అయ్యేదాన్ని. అక్కడ అడవుల్లో షూటింగ్ చేసి ఇక్కడికొస్తే పిక్నిక్ లా అనిపించేది. ఇంటి నుంచి శర్వా ఫుడ్ తెచ్చి పెట్టేవాడు. ఒక ఫ్యామిలీలా అంతా కలిసి ట్రావెల్ చేశాం. శర్వాను మిగతా ఆడవాళ్లు ఈ సినిమాలో ఇబ్బంది పెడుతుంటారు. నేనూ వాళ్లతో కలిసిపోయాను. అంతమంది మహిళల మధ్య ఆయన ఎలా వ్యవహరించారు అనేది సినిమాలో చూడాలి. చాలా ఫన్ గా ఉంటుంది.

- ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవం. వాళ్లు అప్పటిదాకా మనతో నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటారు. షాట్ రెడీ అనగానే ఆశ్చర్యపోయేలా మారిపోతారు. ఆ క్యారెక్టర్ లోకి వెళ్తారు. సెట్ లో ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలన్నీ వాళ్లను చూసి నేర్చుకున్నా. నేను ఉన్నందుకే సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది అని ఖుష్బూ గారు అనడం నామీదున్న ప్రేమతోనే.

- శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలో పనిచేయడం సంతోషంగా ఉంది. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ కు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. మళ్లీ ఈ సంస్థలో వర్క్ చేయాలని ఉంది. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్. దేవి టాలెంట్ గురించి మీ అందరికీ తెలుసు. ఈ సినిమా ఆల్బమ్ లోని అన్ని పాటలు హిట్ చేశాడు. ఆర్ఆర్ కూడా సినిమాను బాగా ఎలివేట్ చేస్తుంది.

- ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కీర్తి, సాయిపల్లవి ఉండటం ఎంతో హ్యాపీ అనిపించింది. వాళ్లను చూస్తుంటే మహిళా శక్తిని చూసినట్లు ఉంది. కీర్తి, పల్లవి వాళ్ల వాళ్ల నటనతో ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు. నాకు వాళ్లను చూస్తే ఆనందంగా ఉంటుంది. నా తదుపరి సినిమాల వివరాలు త్వరలో వెల్లడిస్తా.

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved