06 May 2023
Hyderabad
ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అన్నీ మంచి శకునములే'. మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ప్రాజెక్ట్ కె లాంటి పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ అన్నీ మంచి శకునములే లాంటి చిన్న సినిమా చేయడానికి కారణం ?
స్వప్న : ఏ సినిమాని చిన్న సినిమా, పెద్ద సినిమా అనలేం. మాకు ఆ తేడా లేదు. ప్రాజెక్ట్ కే ఖచ్చితంగా చాలా హ్యూజ్ ప్రాజెక్ట్. మేము ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో మొదలయ్యాం. మా జీవితం టర్న్ తీసుకున్నది ఆ సినిమాతోనే. మా వరకు అది మాకు బిగ్గెస్ట్ మూవీ. మంచి కథ చేయడం ముఖ్యం. అలా ఒక మంచి కథ చెప్పాలనే ఉద్దేశంతో అన్నీ మంచి శకునములే చేశాం. అయితే ఒకటి చెప్పాలి. ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు చేయాలనే ఇష్టం కానీ బ్యాండ్ విడ్త్ గానీ మాకు లేదు. ఒక సినిమా చేస్తున్నపుడు దర్శకుడికి సపోర్ట్ గా వెనుక ఉండటం మాకు ఇష్టం. అయితే కరోనా వలన మూడు సినిమాలు ఒకసారి అవ్వడం జరిగింది.
అన్నీ మంచి శకునములే ఎలాంటి సినిమా ?
స్వప్న: వేసవిలో మన అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి ఓ పది రోజులు హాయిగా గడిపి వస్తే ఆ జ్ఞాపకం ఎలా ఉంటుందో..ఈ సినిమా అలా వుంటుంది.
ఈ కథకు నిజ జీవిత సంఘటనలు స్ఫూర్తి ఉందా?
ప్రియాంక: ఈ సినిమా అంతా కునూర్ హిల్ స్టేషన్ లో అవుతుంది. చిన్నప్పుడు నాన్నగారితో పాటు ఊటీ లాంటి ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళం. ఎప్పటి నుంచో హిల్ స్టేషన్ లో ఒక ఫ్యామిలీ కథ చేయాలని ఉండేది. నందిని చెప్పిన కథ దీనికి సరిగ్గా సూట్ అయ్యింది. హిల్ స్టేషన్ లో సినిమా చేయాలనే కోరిక అన్నీ మంచి శకునములే తో తీరింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ టౌన్ ని క్రియేట్ చేసింది నందిని. చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఓ చిన్న ప్రపంచంలోకి తీసుకెళుతుంది.
నాన్నగారి వారసత్వం మీరు కొనసాగిస్తున్నారు.. ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి సీతారామం ..ఇలా ప్రతిది కొత్తదనంతో పాటు కమర్షియల్ గా విజయవంతమైన చిత్రాలు తీశారు. అన్నీ మంచి శకునములే చిత్రంలో కూడా ఎదో మ్యాజిక్ చేస్తుంటారని అంచనాలు వున్నాయి.. దీనిని ఎలా చూస్తారు?
స్వప్న: ప్రతి సినిమాపై ఒత్తిడి వుంటుంది. అయితే తక్కువ సినిమాలే చేస్తున్నాం. మా మనసుకి నచ్చిన సినిమాలే చేస్తున్నాం. మాకు నచ్చి, ముచ్చట పడి చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులకు నచ్చడం అదృష్టంగా భావిస్తున్నాం.
సీతారామం విజయం ఎలాంటి నమ్మకాన్ని ఇచ్చింది ?
స్వప్న: నమ్మకం కంటే గొప్ప తృప్తిని ఇచ్చింది. అందులో ప్రతి అడుగు ఒక సవాల్. పర భాష హీరో, ఖరీదైన లోకేషన్స్, మార్కెట్ ఎదురీత .. ఇలా ప్రతీది ఒక సవాలే. ఆ ఇలాంటి సమయంలో సీతారామం మరోస్థాయి తృప్తిని ఇచ్చింది. మనం నమ్మింది జరిగిందనే తృప్తి.
నటీనటుల ఎంపిక ఎవరిది ?
స్వప్న: నాకు, ప్రియాంక కి కాస్టింగ్ అంటే ఆసక్తి. అన్నీ సినిమాలు అందరం అలోచించే కాస్టింగ్ చేస్తాం. కొన్ని సినిమాల్లో లెజెండరీ చేయాలనుకున్నప్పుడు నాన్న గారిని అడుగుతాం. సీతారామంలో నటీనటుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ ని పెడితే బావుంటుందనేది నాన్నగారి ఆలోచన. ఆయన సినిమాలని ఎలా చేసేవారో అవన్నీ కలిపే మాకు వచ్చాయాని భావిస్తున్నాం. మేము అందరం కలిపే నిర్ణయం తీసుకుంటాం.
గౌతమీ గారు, ఊర్వశి గారు లాంటి ప్రముఖ నటులు ఇందులో వున్నారు కదా ? తమిళ్ మలయాళంలో ఈ సినిమాని డబ్ చేసే ప్లాన్స్ ఉన్నాయా ?
ప్రియాంక: లేదండీ. పాత్రకు ఎవరు బావుంటారో అనే దానిపైనే మా దృష్టి వుంటుంది. తర్వాత డబ్ అయితే అది వేరే విషయం. అంతే కానీ స్పెషల్ గా దాని కోసం చేసిన ఆలోచన అయితే కాదు. ఇందులో ఊర్వశి గారి పాత్ర కొంచమే వుంటుంది. అయితే ఆ పాత్రకు ఆమెనే పర్ఫెక్ట్.
మీకు కథలు ఎంపిక చేసుకునే విధానం ఎలా వుంటుంది ?
స్వప్న: కథని సింపుల్ ఫీలింగ్ తో వింటాం. ఒక ప్రేక్షకుడిగా తెరపై చూడలనే ఆసక్తి ఆ కథ కలిగించగలిగే దానిని ఎంచుకుంటాం.
మీ చిత్రాల్లో లోకేషన్స్ ప్రత్యేకంగా ఉంటాయి కదా.. ఈ చిత్రం కోసం ఎలాంటి కసరత్తులు చేస్తారు?
స్వప్న: నందిని ఈ కథ చెప్పినపుడు అది కూనూర్ లో లేదు. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లో ఏదో ఒక చోటు అయ్యుండొచ్చు. అయితే విజువల్ గా ఒక ప్రత్యేకత వుండాలి. ప్రేక్షకులు ఆ హాయిని పొందాలి. ఇది ఖర్చుతో కూడుకున్న విషయమే. అయితే ఒక బ్యూటీఫుల్ విజువల్ వుండటం వలన ఒక ఎక్స్ ఫ్యాక్టర్ వస్తుంది. పైగా ఈ సినిమా కథ అలాంటి లోకేషన్స్ అవసరం.
వైజయంతీ మూవీస్ కి 50 ఏళ్ళు పూర్తవుతుంది, మీరు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు అవుతుంది. అయినప్పటికీ మీ చిత్రాలు ఎందుకు ఓవర్ బడ్జెట్ అనే మాట వినిపిస్తుంది?
స్వప్న : బహుశా అండర్ బడ్జెట్ చేసుకోవడం వలనేమో. మహానటి సినిమా సినిమా తీసినప్పుడు నాన్నగారితో 10 కోట్లలో అయిపోతుందని చెప్పాం. ఆయన ఒక నవ్వు నవ్వి ’25 కోట్ల లోపల తీయండి. నేను మార్చుకుంటాను’’ అన్నారు(నవ్వుతూ). పేపర్ మీద చాలా పద్దతి ప్రకారమే మొదలుపెడతాం. కానీ కథ డిమాండ్ చేస్తే దానికి పెట్టాల్సిందే.
సంతోష్ శోభన్ లాంటి హీరోతో చేసినప్పుడు ఎలాంటి కాలిక్యులేషన్ వేసుకుంటారు ?
స్వప్న: అసలు లెక్కలు వేసుకుంటే సినిమాలే చేయకూడదు(నవ్వుతూ). నాన్నగారు 50 ఏళ్ళుగా ఇండస్ట్రీలో నిలబడ్డారు. ఇవాల్టి ఆయన పిల్లలు సినిమాలు తీస్తున్నారు. ఆయన ఏ రోజు లెక్కలు వేసుకోలేదు. బహుశా అది మాకు వచ్చింది. లెక్కలు వేసుకునే వ్యాపారాలు చాలా వున్నాయి. సినిమాల్లోకి వచ్చామంటే అది ప్యాషన్ తోనే.
ప్రియాంక: ప్రాజెక్ట్ కె ప్రభాస్ గారైన, సీతారామం దుల్కర్, అన్నీ మంచి శకునములే సంతోష్ అయినా.. ఆ పాత్రలకు సరిపోతారని అన్నప్పుడే వచ్చారు కానీ లెక్కలు వేసుకొని కాదు.
సహజంగా ఇద్దరు అక్క చెల్లెలు వుంటే వారి ఆలోచనలు వేరుగా వుంటాయి కదా.. మీ ఇద్దరి సమన్వయం ఎలా వుంటుంది ?
స్వప్న: ఖచ్చితంగా ఆలోచనలు వేరుగా వుంటాయి. మొదటి సినిమాకి చాలా కొట్టుకున్నాం(నవ్వుతూ) తర్వాత ఒక అండర్ స్టాండింగ్ కి వచ్చి ఒక ఎకో సిస్టం క్రియేట్ చేసుకున్నాం. కొన్ని తను బాగా చేస్తుంది కొన్ని నేను చేస్తాను. అందులో ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఒకరిని ఒకరు అడిగి క్లియర్ చేసుకుంటాం.
జడ్జిమెంట్ ఫ్యాక్టర్ ఎవరిదీ ?
స్వప్న : ఇద్దరిది (నవ్వుతూ) జాతిరత్నాలు చిత్రాన్ని ప్రియాంక, నాగీ (నాగ్ అశ్విన్) నమ్మినంతగా నేను నమ్మలేదు. మొదటి రోజు చూసినపుడు అందరూ నవ్వుతున్నారు నిజంగా బావుందా అనే మైండ్ సెట్ తోనే వున్నాను. కానీ ప్రియాంక, నాగీ విపరీతంగా నమ్మారు. ఈ సినిమా అయితే ఇటు కాకపోతే అటు అన్నారు. డిజిటల్ లో మంచి ఆఫర్ వచ్చింది. అమ్మేద్దాం అనుకున్నప్పుడు ‘’మనకి ఇంకా ఏజ్ వుంది. డబ్బులు తర్వాత సంపాదించుకోవచ్చు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. పోతే మొత్తం పోతుంది. మిడ్ రూట్ లేదు. మనమే చెద్దాం’’ అన్నాడు నాగీ. మహానటి విషయానికి వస్తే ఒక భాద్యత గా చేశాం.
వైజయంతి 50 ఏళ్ల పండగకు ప్రత్యేకంగా ఏదైనా సన్నాహాలు చేస్తున్నారా ?
వైజయంతి మూవీస్ 50 ఏళ్ల సెలబ్రేషన్స్ వుంటాయి. అందరూ కలసి ఎంజాయ్ చేసేలా ఒక ఆసక్తికరమైన సెలబ్రేషన్ వుంటుంది.
మీకు మరో సిస్టర్ వున్నారు కదా.. తను ప్రొడక్షన్ పనులు చూస్తారా ?
తనపై చాలా భాద్యతలు ఉన్నాయి. ఇంట్లో పిల్లలు సేఫ్ గా ఉన్నారు, అమ్మ చెల్లి చూసుకుంటున్నారనే ధైర్యం వుండబట్టే మేము అందరం వచ్చి పని చేయగలుగుతున్నాం.
ఈ మధ్య కాలంలో ఇంతమంది నటీనటులతో ఓ సినిమా తీసుకొస్తున్నారు..ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఎలా వుండబోతుంది ?
స్వప్న: ప్రతి పాత్ర కథలో భాగమై వుంటుంది. ఇది హీరో హీరోయిన్ సినిమా కన్నా రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. రెండు కుటుంబాలకు ఎలాంటి పాత్రలు కావాలో అలాంటి పాత్రలు ఇందులో చక్కగా కుదిరాయి.
అన్నీ మంచి శకునములే ఎమోషన్స్ ఎలా వుంటాయి ?
స్వప్న: సినిమా చూసినప్పుడు మీకే అనుభవంలోకి వస్తుంది. ఒక మంచి జ్ఞాపకం లాంటి ఎమోషన్, ఆనందం వస్తే కంటి తడి పెట్టె ఎమోషన్. ఎమోషన్స్ అన్నీ చాలా సెటిల్ గా వుంటాయి.
చాలా రోజుల తర్వాత గౌతమీ, వాసుకి ఇందులో కనిపిస్తున్నారు కదా ఇది ఎవరి ఆలోచన ?
స్వప్న: వాసుకి నా స్నేహితురాలు. మళ్ళీ నటన ఎప్పుడని అడిగినప్పుడల్లా పిల్లలు బాధ్యతలు అనేది. ఇప్పుడు పిల్లల్ని అండర్ గ్రాడ్యుయేషన్ కి పంపించింది. అదే సమయంలో నందిని ఆ పాత్ర చెప్పినప్పుడు తను ఓకే చెప్పడం జరిగింది. గౌతమీ గారిని తీసుకోవాలనేది అందరి ఆలోచన.
మీ బ్యానర్ కి, సినిమాలకి నాగ్ అశ్విన్ బలం కదా ?
స్వప్న: నాగ్ అశ్విన్ బలం వలనే, ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాలనే ఇక్కడి వరకూ వచ్చాం. కీలక నిర్ణయాలు తీసుకున్నపుడు నాగీతో చర్చిస్తాం. అయితే ఇతర దర్శకుల విజన్ లో మాత్రం నాగీ ఎప్పుడూ ఇన్వాల్ అవ్వరు.
సంతోష్ శోభన్ ని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది ?
ప్రియాంక : సంతోష్ ని రవి బాబుతో చేసిన తను నేను సినిమా నుంచి చూస్తున్నాను. ఇందులో రిషి పాత్ర చెబుతున్నపుడు సంతోష్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాడని అనిపించింది.
స్వప్న: సంతోష్ చాలా ఫైన్ యాక్టర్. అలాంటి నటులు అరుదుగా వుంటారు. చూస్తే నానినే గుర్తుకు వస్తాడు.
సంతోష్ గత చిత్రాలు నిరాశ పరిచాయి కదా.. ఈ సినిమా, మీ బ్యానర్ తనకి తనకి వాల్యూ యాడ్ చేస్తుందని భావిస్తున్నారా ? తనకి మొదటి హిట్ వస్తుందా ?
స్వప్న: ఈ చిత్రం ఖచ్చితంగా తనకి మంచి విజయం ఇస్తుందనే నమ్మకం వుంది. తప్పకుండా తన కెరీర్ మారుతుంది. తనకి కొత్త ఇమేజ్ వస్తుంది.
నందిని రెడ్డి గారు ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ చేస్తున్నారు కదా.. ఇది కూడా అదే తరహాలో వుండటం రిస్క్ అనిపించడం లేదా ?
స్వప్న : తను భిన్నమైన కథలు, భిన్నమైన ఫార్మెట్ లో చెబుతున్నారు. అలా మొదలైయింది యూత్ ఫుల్ ట్రెండ్ సెట్టర్. కళ్యాణ వైభోగమే పెళ్ళయిన జంట పై చేసింది. ఓ బేబీ కాన్సెప్ట్ సినిమా. అన్నీ మంచి శకునములే కూడా ఒక డిఫరెంట్ ఫ్యామిలీ స్టొరీ.
ప్రాజెక్ట్ కె అప్డేట్స్ ఏమిటి ?
ప్రాజెక్ట్ కె కి అన్నీ మంచి శకునములే(నవ్వుతూ). 70 శాతం షూటింగ్ పూర్తయింది.
వైజయంతి మూవీస్ లో చాలా క్లాసిక్స్ వున్నాయి. అందులో ఏ సినిమా రీమేక్ చేయాలని వుంది ?
జగదీక వీరుడు అతిలోక సుందరి కి పార్ట్ 2 చేయాలనేది అందరి కోరిక.