మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి, ఈ సంక్రాంతికి తన తదుపరి చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
అసలుసిసలైన పండగ చిత్రంగా 2026, జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న 'అనగనగా ఒక రాజు'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి నుంచి ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం. ప్రోమోలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
దాదాపు మూడు నిమిషాల నిడివితో రూపొందిన 'అనగనగా ఒక రాజు' ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. కింగ్ నాగార్జున అందించిన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి చాలా పెద్ద మనసు. ఆ మనసులోకి ధగధగా మెరిసిపోయే నగలు వేసుకొని యువరాణి దిగింది" అంటూ నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది.
ఊరి పెద్దమనిషిలా బుల్లెట్ బండి మీద నవీన్ పొలిశెట్టి పాత్రను పరిచయం చేసిన తీరు బాగుంది. నోట్ల కట్టను గుడిలోని హుండీలో వేయబోతూ "కన్నాన్ని పెద్దది చేయండి" అని పూజారితో చెప్పడం భలే ఉంది. ట్రైలర్ లోని ప్రతి సంభాషణ గిలిగింతలు పెడుతోంది. మంత్రాన్ని తిరిగి చెప్పమని పూజారి అంటే.. మీనాక్షి చౌదరి గుండ్రంగా తిరగడం నవ్వులు పూయించింది.
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి పాత్రలను మలిచిన తీరు, ఆ పాత్రల నుంచి హాస్యాన్ని పుట్టించిన తీరు కట్టిపడేసింది. నవీన్, మీనాక్షి ప్రేమకథకు వచ్చిన సమస్య ఏంటి? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? అనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. "పండగకు అల్లుడు వస్తున్నాడు" అంటూ ఎద్దులబండిపై నవీన్ ను చూపిస్తూ సంక్రాంతికి పండుగను ముందుగానే తీసుకొచ్చారు.
సంక్రాంతి అంటేనే కుటుంబంతో కలిసి చూసి మనస్ఫూర్తిగా నవ్వుకునే సినిమాలకు పెట్టింది పేరు. ఈ సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా 'అనగనగా ఒక రాజు' చిత్రం తెరకెక్కిందని ట్రైలర్ తో స్పష్టమైంది.
నవీన్ పొలిశెట్టి తన కామెడీ టైమింగ్ తో మరోసారి మెప్పించారు. నవీన్, మీనాక్షి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. యువరాజు కెమెరా పనితనం, మిక్కీ జె మేయర్ నేపథ్య సంగీతం ట్రైలర్ కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ట్రైలర్ తో అంచనాలు తారస్థాయికి చేరాయి అనడంలో సందేహం లేదు.
'అనగనగా ఒక రాజు' చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుక హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో గురువారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నాయకానాయికలు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, దర్శకుడు మారి, నిర్మాత సూర్యదేవర నాగవంశీతో పాటు చిత్ర బృందం హాజరైంది.
ఈ వేడుకలో కథానాయకుడు నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. "ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇది మా టీమ్ అందరి ఏడాదిన్నర కష్టం. ఈ సంక్రాంతికి మీ కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా సినిమాని రూపొందించాం. మొదటి నుంచి చివరివరకు నవ్వుతూనే ఉంటారు. అదే సమయంలో అందమైన భావోద్వేగాలు కూడా ఉంటాయి. దర్శకుడు మారి మొదటి సినిమా అయినా చాలా బాగా తెరకెక్కించారు. ఈ సంక్రాంతికి నా అభిమాన హీరోలు ప్రభాస్ గారు, చిరంజీవి గారు, రవితేజ గారి సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నాకు జరిగిన ఒక రోడ్డు ప్రమాదం వల్ల నా సినిమా రావడం ఆలస్యమైంది. ఆ లోటుని భర్తీ చేసేలా అనగనగా ఒక రాజు సినిమా రెట్టింపు వినోదాన్ని అందిస్తుంది." అన్నారు.
కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. "ఈ సంక్రాంతికి మీ కుటుంబంతో వచ్చి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఇందులో నేను చారులత పాత్ర పోషించాను. ఇది నా మనసుకు దగ్గరైన పాత్ర. ఇది పక్కా పైసా వసూల్ ఫిల్మ్." అన్నారు.
దర్శకుడు మారి మాట్లాడుతూ.. "ట్రైలర్ మీ అందరికీ నచ్చింది కదా. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది. మొదటి నుంచి చివరివరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నవీన్ గారిని కొత్తగా చూస్తారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ కూడా బాగా పండాయి. నవీన్ గారు, మీనాక్షి గారి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. సంక్రాంతికి తగ్గ ఓ మంచి వినోదభరిత చిత్రమిది" అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "ట్రైలర్ లో ఎలాగైతే పంచ్ లు పేలాయో.. సినిమా అంతా అలాగే పంచ్ లు పేలుతాయి. రెండు గంటల పాటు మిమ్మల్ని నవ్విస్తూ నవీన్ శైలిలో సాగే సినిమా ఇది. కుటుంబంతో కలిసి సినిమాకు రండి. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. పండగ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి." అన్నారు.
'అనగనగా ఒక రాజు' చిత్రం సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న భారీ స్థాయిలో విడుదల కానుంది.
చిత్రం: అనగనగా ఒక రాజు
తారాగణం: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి
సంగీతం: మిక్కీ జె. మేయర్
దర్శకత్వం: మారి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
The #AnaganagaOkaRaju trailer is thoroughly entertaining, packed with Naveen Polishetty’s trademark punches and humor, along with a refreshing village mass flavor.
Naveen Polishetty promises plenty of laughs and an engaging story for the audience.