Bad Boy Karthik pre release event
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అందరికీ నచ్చేలా ఉంటుందని నమ్ముతున్నాము. ఏప్రిల్ 17న అందరూ చూసి చెప్పాలని కోరుతున్నాను: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య
హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ థాంక్యూ. రసూల్ గారు ఈ సినిమాలో నన్ను చాలా బాగా చూపించారు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన వయసులో ఉన్నప్పుడు హీరోగా ట్రై చేసి ఉంటే బాగుండేది (నవ్వుతూ). ఆయన వల్ల ఈ సినిమా విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. మా హీరోయిన్ విధికి ఇది తెలుగులో ఫస్ట్ సినిమా. ఆమెకు ఇది మంచి లాంచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీదేవి గారితో పనిచేయడం చాలా మంచి అనుభవం. ఆమె ప్రభాస్ గారి మొదటి సినిమాలో చేశారు, నాకు కూడా అలాంటి లక్ రావాలని కోరుకుంటున్నాను. సాయికుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, సుదర్శన్ గారు, సముద్రఖని గారు ఇలా చాలా పెద్ద తారాగణం ఈ సినిమాలో ఉంది. డైరెక్టర్ రమేష్ గారు చాలా కష్టపడి చేశారు. మా నిర్మాతలు చాలా కష్టపడి సినిమా తీశారు. వారికి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది అని నమ్ముతున్నాను. ఏప్రిల్ 17న థియేటర్లలో సినిమా చూసి మీ అభిప్రాయం చెప్పండి. థాంక్యూ సో మచ్.
శ్రీదేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఈ నెల 17న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నిర్మాత శ్రీనివాస్ గారు ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాతో ఆయనకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఆయన మరిన్ని మంచి సినిమాలు తీయాలి. రసూల్ గారు లేకపోతే ఈ జర్నీ ఇలా పూర్తి అయ్యేది కాదు. ఈ సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నేనూ థియేటర్‌లో ఈ సినిమా చూడడానికి వెయిట్ చేస్తున్నాను. నాగశౌర్య గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక కొత్త కథలో మేమిద్దరం కలిసి పనిచేయడం చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. శౌర్య గారు చాలా మంచి యాక్టర్. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. విధికి తెలుగులో మంచి సక్సెస్‌ఫుల్ కెరీర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా మొత్తం చాలా బాగుంటుంది. మీ అందరి ఆశీస్సులు మా సినిమా మీద ఉండాలి. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ థాంక్యూ సో మచ్.
నిర్మాత శ్రీనివాస్ చింతలపూడి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఇది మా ఫస్ట్ సినిమా. మా ఫస్ట్ హీరో నాగశౌర్య గారికి థాంక్యూ వెరీ మచ్. ఎంతో కష్టపడి, ఇష్టంతో చేసిన సినిమా ఇది. రసూల్ గారు మాకు ఎంతో సహాయం చేశారు. సినిమా విజువల్‌గా చాలా బాగుంటుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ గారు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. శ్రీదేవి గారు, సముద్రఘని గారు, సాయికుమార్ గారు అందరూ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో శౌర్య గారిని ఒక డిఫరెంట్ స్టైల్‌లో చూస్తారు. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా బాగుంటాయి. చిన్న గారు మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి సినిమాలో చిన్న చిన్న కష్టాలు ఉంటాయి, వాటిని ఎదుర్కొంటేనే సక్సెస్ వస్తుంది. ఇది మా ఫస్ట్ సినిమా. మరిన్ని సినిమాలు చేయబోతున్నాం. జూన్ లో మరో సినిమా మొదలుపెట్టబోతున్నాం. ఏప్రిల్ 17న మీరు ఒక మంచి సినిమా చూస్తారు. మాకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు.”
నిర్మాత అశోక్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లిన మా పెద్దన్నయ్యకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.
జీ స్టూడియోస్ గిరీష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. జీ స్టూడియోస్ తరఫున టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ పెద్ద బాక్సాఫీస్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం.
హీరోయిన్ విధి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. ఈ ఈవెంట్‌లో మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. శౌర్య గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే శ్రీదేవి గారికి థాంక్యూ సో మచ్. ఎంతో ప్రేమ, అభిమానం చూపించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఏప్రిల్ 17న మా సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
నటి ప్రియ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. సక్సెస్ మీట్‌లో మళ్లీ మీ అందరినీ కలుస్తాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఏప్రిల్ 17న థియేటర్లలో కలుద్దాం”
డీఓపీ రసూల్ మాట్లాడుతూ.. ఈ సినిమా నా కెరీర్‌లో ఒక మంచి అనుభవం. కొన్ని కారణాల వల్ల సినిమాను కష్టాలు పడుతూ తీశాం. కానీ సినిమా అద్భుతంగా వచ్చింది. థియేటర్‌లో చూసిన తర్వాత చాలామంది సర్ప్రైజ్ అవుతారు. సినిమాలో చాలా మంచి అంశాలు ఉన్నాయి. ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.