
2 September 2016
Hyderabad
ప్రచారంలో కొత్త ఒరవడి, అసాధారణమైన కంటెంట్ ఉంటే ఆ సినిమా హిట్టే. ఇటీవలి కాలంలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన అనువాద చిత్రం `బిచ్చగాడు` నేర్పిన పాఠమిది. ఓ అనువాద చిత్రం ఈ స్థాయి విజయం సాధించిందంటే నిర్మాతలు చేసిన అద్భుత ప్రచారమే అందుకు కారణం. ఓ స్ట్రెయిట్ సినిమాకి ధీటుగా ఈ సినిమాకి ప్రమోషన్ చేశారు నిర్మాతలు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. కేవలం కోటిన్నరతో తెరకెక్కి 25 కోట్లు పైగా వసూళ్లు సాధించిన రేర్ మూవీ ఇది. 50 థియేటర్ల నుంచి 200 థియేటర్లకు అంచెలంచెలుగా రేంజు పెంచుకుంటూ వెళ్లి బంపర్ హిట్ కొట్టిన చిత్రమిది. ఈ స్థాయి బ్లాక్‌బస్టర్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత చదలవాడ పద్మావతి మరో అరుదైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
మలయాళంలో ఇటీవల రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన `ఆన్ మరియ కలిప్పిలాను` చిత్రాన్ని తెలుగులో అందించనున్నారు. `ఓకే బంగారం` ఫేం దుల్కార్ సల్మాన్ ఓ ముఖ్య అతిధిగా నటించగా.. `నాన్న` (విక్రమ్ సినిమా) చిత్రంలో క్యూట్ అప్పియరెన్స్, చక్కని పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న బేబి సారా అర్జున్ ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో నటించారు. మిథున్ మాన్యూల్ థామస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సన్ని వాయ్‌నే, అజు వర్గీస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
ఇటీవలే రిలీజైన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో తెలుగు అనువాద హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడింది. పోటీలో ఫ్యాన్సీ రేటు చెల్లించి రిలీజ్ హక్కుల్ని దక్కించుకున్నారు. ఓ ఫ్రాడ్‌స్టర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందన్నదే సినిమా. థామస్ ఓ సింపుల్ సబ్జెక్ట్‌ని రియలిస్టిక్ పంథాలో ఆవిష్కరిస్తూనే... స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో ఆద్యంతం రక్తికట్టించేలా తెరకెక్కించారని మల్లూవుడ్‌లో క్రిటిక్స్ ప్రశంసించారు. కేరళలో 70 పైగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రికార్డ్ వసూళ్లు సాధించింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిదని మలయాళ యంగ్ హీరో, సూపర్‌స్టార్ దుల్కార్ సల్మాన్ ప్రశంసించడం విశేషం.



