pizza

Gabbar Singh re-release press meet
‘గబ్బర్‌ సింగ్‌' అంటేనే ఓ చరిత్ర. రీ-రిలీజ్ కలెక్షన్స్ లోనూ సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది: రీ-రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత బండ్ల గణేష్

You are at idlebrain.com > news today >

31 August 2024
Hyderabad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ క్రేజీ కాంబోలో చరిత్ర సృష్టించిన మూవీ ‘గబ్బర్‌ సింగ్‌'. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం 2012లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పవన్‌ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న ‘గబ్బర్ సింగ్‌’ రీరిలీజ్‌ కానుంది. ఈనేపథ్యంలో రీ-రిలీజ్ ప్రెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది.

రీరిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు బ్రతుకుని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఎంత చెప్పుకున్నా తక్కువే. నేను ఆర్థికంగా ఎంత స్థాయికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నాకు ఈ క్రేజ్, పేరు ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ ఒక రోజు పిలిచి సినిమా నిర్మించే అవకాశం ఇచ్చారు. నన్ను నేను నమ్ములేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. ఎవరు ఎన్ని చెప్పినా.. 'గణేష్ కి మాటిచ్చాను. తనతో సినిమా చేస్తానని' నన్ను నిర్మాతగా నిలనెట్టారు. ఈ సందర్భంగా మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గబ్బర్ సింగ్ ఒక చరిత్ర. రీ రిలీజ్ కి ఇంత క్రేజ్ ఏంటని కొందరు అడుగుతున్నారు. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎంత పవిత్రమైనదో పవన్ కళ్యాణ్ అభిమానులకు గబ్బర్ సింగ్ అంత పవిత్రమైనదని వారికి చెప్పాను. గబ్బర్ సింగ్ సినిమాని అణువణువునా ప్రతి అడుగు ప్రతి మాట ప్రతిక్షణం ప్రతి కష్టం డైరెక్టర్ హరీష్ శంకర్ కి చెందుతుంది. హరీష్ శంకర్ ఏది చెప్తే అది చేద్దాం అని పవన్ కళ్యాణ్ గారు సినిమా ప్రారంభమైన రోజునే చెప్పారు. హరీష్ శంకర్ రాబోయే పాతికేళ్ళు తెలుగు సినిమాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా వుంటారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఆయన గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి. నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి. భారతదేశంలో ఏ నటుడు పొందలేనంత అత్యధిక రేమ్యునిరేష్ పొందగలిగే స్టార్ అయినప్పటికీ హాయిగా బ్రతికే కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ అన్నీ వదిలేసి జనం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. దాదాపు 10ఏళ్లు ప్రజల కోసం పోరాడి ఈ రోజు ఒక స్థాయికి వచ్చారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం వున్న పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ సినిమా తీయడం నా అదృష్టం. నేను, హారిస్, దేవిశ్రీ ప్రసాద్ అందరూ ప్రేమించి ఈ సినిమా చేశాం. కళ్యాణ్ బాబు షూటింగ్ లో గుర్రం మీద నుంచి పడ బోయారు. అప్పుడు పెద్ద ప్రమాదం తప్పింది. నేను షాక్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ ఏం చెబితే అది చేశారు. చాలా కష్టపడ్డారు. ప్రేక్షకులు, అభిమానులు సినిమాకి బ్రహ్మరధం పట్టారు. విందుభోజనం లాంటి ఈ సినిమా మరోసారి విడుదల చేయడం నా అదృష్టం. రీరిలీజ్ లో కూడా టికెట్లు దొరకడం లేదు. అంత క్రేజ్ వుంది. ఏడేళ్ళుగా నేను సినిమా తీయకపోవడం బాధగా వుంది. మళ్ళీ సినిమాలు తీస్తా. సినిమానే నా వ్యాపకం, నా జీవితం. బ్లాక్ బస్టర్స్ తీస్తా. గబ్బర్ సింగ్ రీరిలీజ్ లో వచ్చే కలెక్షన్స్ అదిరిపోవాలి. సెప్టెంబర్ 2 న ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని ఉదయం గుడికి వెళ్తాడు. తర్వాత థియేటర్స్ కి వెళ్తాడు ఇది కన్ఫర్మ్. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఎగ్జిబిటర్ కి నా విన్నపం. థియేటర్స్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా క్రమశిక్షణగా వుంటారు. మా వాళ్ళు థియేటర్స్ కి ఎలాంటి ఇబ్బంది కలిగించరని పవన్ కళ్యాణ్ భక్తుడిగా మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేడు ఉపముఖ్యమంత్రి. ఆయన అభిమానులమైన మేము ఎంతో క్రమశిక్షణగా మెలుగుతాం. గబ్బర్ సింగ్ సినిమా చూస్తే మాకు దైవదర్శనం. కాబట్టి మా దైవదర్సనానికి ఆటంకం కలిగించవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం'అన్నారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి గణేశ్‌ హీరో. అందుకే ఆయన్ని చివరిగా మాట్లాడమని చెప్పా. సోషల్‌మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈరోజుల్లో ‘గబ్బర్‌సింగ్‌’ రిలీజ్‌ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో ఎప్పటినుంచో ఒక చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. అప్పుడు మిస్ అయిన డిజిటల్ హంగామాని మళ్ళీ క్రియేట్ చేసిన ఇస్తున్న మా అన్న గణేష్ కి, సత్యనారయణ కి థాంక్ యూ. ‘గబ్బర్‌ సింగ్‌’ అంటేనే ఒక చరిత్ర. మా జీవితాలను మార్చేసిన చిత్రమిది. ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు అభిమానాన్ని చూపించారు. ఇదంతా పవన్ కళ్యాణ్ గారిదే అని నమ్ముతూవచ్చాను. ఈ సక్సెస్‌ అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి బండ్ల గణేశ్‌. ఆయన ఎప్పుడూ బ్లాక్ బస్టర్ కొడుతున్నామని గట్టి సంకల్పంతో వుండేవారు. సెట్ బయట బయట నా కంటే డబుల్ కష్టపడ్డారు. కెమరామెన్ విన్సెంట్ గారు చాలా సపోర్ట్ చేశారు. దేవిశ్రీ పాటలకు థియేటర్ ఊగిపోయింది. పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకి వస్తాయి. గబ్బర్ సింగ్ సినిమా అంతే ఎవర్ గ్రీన్. ఈ సినిమా సక్సెస్‌ ఊహించిన తొలి వ్యక్తి పవన్‌కల్యాణ్‌ గారు. డబ్బింగ్‌ సమయంలోనే ఆయన ఇది పక్కా బ్లాక్‌బస్టర్‌ అన్నారు. నా ఫ్యాన్స్ కురుకునేది ఇవ్వబోతున్నావ్. ఈ సినిమా నివ్వుఊహించే సక్సెస్ అవుతుంది. సినిమా తర్వాత చాలా జాగ్రత్తగా వుండని చెప్పారు. ఇది పక్కా బ్లాక్ బస్టర్ అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. సినిమా విడుదలైన నాలుగు రోజుల తర్వాత కలిసినప్పుడు ఫ్యాన్స్ హ్యాపీగా వున్నారా అని అడిగారే తప్పితే కలెక్షన్స్ కి గురించి మాట్లాడలేదు. ఒకప్పుడు ఆయన అటోగ్రాఫ్ కి అభిమాని ఆనందించేవాడు. ఇప్పుడు ఆయన సంతకానికి ఒక పవర్ వుంది, ఆ పవర్ కొన్ని జీవితాల్ని మార్చబోతోంది. అంత శక్తి ఆ సంతకానికి ఇచ్చిన భగవంతుడికి, నిర్విరామంగా కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, గబ్బర్ సింగ్ యూనిట్ తరపున మనస్పూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నాను. థాంక్ యూ' అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాని గత ఏడాదే రీరిలీజ్ చేయాలని అనుకున్నాం. 'పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇయర్ పవర్ లోకి వస్తారు. అప్పుడు రిలీజ్ చేస్తే ఆ కిక్కే వేరు'అని బండ్ల గణేష్ గారు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు. నేను పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమానిని. ఈ సినిమాని ప్రతివారం చూస్తుంటాను. అభిమానులు కోరుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారిని చూపించిన డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. రీరిలీజ్ టికెట్లు దొరకడం లేదు, స్క్రీన్స్ పెట్టిన ఐదు నిమిషాలకి ఫుల్ అయిపొతున్నాయి. అన్నీ థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. ప్రిమియర్స్ వేయమని ఫ్యాన్స్ అడుగుతున్నారు. దాని గురించి అలోచిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన హరీష్ గారికి, గణేష్ గారికి థాంక్ యూ' అన్నారు.

యాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. 12ఏళ్ల క్రితం సినిమా రిలీజైయింది. అభిమానులు సందడి చూస్తుంటే ఈ రోజే రిలీజై రిజల్ట్ వచ్చిన ఆనందం వుంది. 12 ఏళ్లకి పుష్కరాలు వస్తాయి. రెండో తారీకు నుంచి థియేటర్స్ కి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ సినిమాకి పని చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ రీరిలీజ్ తర్వాత గణేష్ గారు మళ్ళీ బ్లాక్ బస్టర్ తీస్తారని కోరుకుంటున్నాను'అన్నారు.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved