యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుభాష్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మీ నేపథ్యం గురించి?
-మాది రేలంగి. మా నాన్నగారు బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. నేను బీటెక్ చదువుతున్నప్పటి నుంచే షార్ట్ ఫిలిమ్స్ చేయడం ప్రారంభించాను. దాదాపు 80 షార్ట్ ఫిలిమ్స్ చేసిన తర్వాత చెన్నైలో ఎల్‌వీ ప్రసాద్ ఫిలిం ఇన్స్టిట్యూట్‌లో ఫిలిం మేకింగ్ కోర్స్ చేశాను. ఆ తర్వాత ఫీచర్ ఫిలిమ్స్‌లోకి వచ్చాను. నేను ఎక్కువగా రాజ్ తరుణ్‌తో షార్ట్ ఫిలిమ్స్ చేశాను.
మీరు దాదాపుగా వంద షార్ట్ ఫిలిమ్స్ చేశారు.. డైరెక్టర్‌గా మీ నుంచి సినిమా రావడానికి ఇంత సమయం పట్టడానికి కారణం?
-నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఒక సినిమా ప్రీ-ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసి షూటింగ్‌కు వెళ్లే సమయానికి ఆగిపోయింది. మరో సినిమా పూర్తయింది కానీ రిలీజ్ కాలేదు. ఆ సినిమా విడుదల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేనికైనా ఒక సమయం రావాలని నేను నమ్ముతాను. ఆ సమయం ‘గోదారి గట్టుపైన’ సినిమాతో వచ్చిందని భావిస్తున్నాను.
గోదారి గట్టు కోసం సుమంత్ ప్రభాస్ గారిని ఎంపిక చేయడానికి కారణం?
-ముందుగా సునీల్ నారంగ్, జాన్వి నారంగ్ గారికి థాంక్స్ చెప్పాలి. వారే సుమంత్ గారిని రిఫర్ చేశారు. వాళ్లు మా ప్రొడ్యూసర్ గారి పార్ట్నర్స్. సుమంత్ గారికి కథ చెప్పగానే ఆయనకి చాలా నచ్చింది. ఇది ఆయనకు పర్ఫెక్ట్‌గా సరిపోయే కథ. ఈ సినిమాలో సుమంత్ గారిది గోదావరి అబ్బాయి పాత్ర. గోదారి యాసను పర్ఫెక్ట్‌గా పలికారు. అందుకోసం చాలా ట్రైనింగ్ తీసుకున్నారు. అలాగే ప్రమోషన్స్ సుమంత్ గారి సపోర్ట్ ని మర్చిపోలేను.
టెక్నీషియన్స్ గురించి?
-ఇప్పటివరకు నాతో పని చేసిన టెక్నీషియన్స్‌నే ఈ సినిమాకి తీసుకున్నాను. కలిసి పని చేశాం కాబట్టి సక్సెస్ కూడా కలిసి పొందాలని అనుకున్నాను. నా టీమ్ నాకు చాలా బలం. నా ఆలోచనలు వాళ్లకు చాలా క్లియర్‌గా అర్థమవుతాయి.
ఈ ప్రేమ కథ ఎంత కొత్తగా ఉంటుంది?
-ఈ కథ మన జీవితాల్లో చూసినదే. ప్రతి ఇంట్లో తండ్రి–కూతురు ఉంటారు, వారి మధ్య ప్రేమ ఉంటుంది. అలాగే ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ కూడా ఉంటుంది. ఈ రెండింటినీ ట్రయాంగిల్ ఫార్మ్‌లో చూపించాను. సినిమా అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.
జగపతి బాబు గారి పాత్ర గురించి?
-ఈ సినిమాలో జగపతిబాబు గారి పాత్ర మా బాబాయి పాత్ర నుంచి ఇన్‌స్పిరేషన్‌తో రాసుకున్నాను. సినిమాలో ఆయన వాడిన బండి కూడా మా బాబాయి గారిదే. ప్రతి తండ్రికీ తన కూతురికి తనకంటే బెటర్ వ్యక్తికి ఇవ్వాలని వుంటుంది. ఇది ఆయన ప్రేమలో ఉన్న నిజం. అలాగే అబ్బాయి ప్రేమలో నిజం ఉంటుంది. అలాంటి అంశాన్ని ఇందులో చెప్పాలని ప్రయత్నించాం. ఎన్ని తరాలు మారినా ప్రేమ ఎమోషన్ ఒకటే. ఈ కథను చాలా పరిణితితో ట్రీట్ చేశాం.
నిధి ప్రదీప్ గురించి?
-ఈ కథే నటులను ఎంచుకుంది. నిధి ప్రదీప్ భరతనాట్యంలో కూడా ప్రావీణ్యం కలిగినది. కొన్ని సీన్లు ఇచ్చినప్పుడు చాలా అద్భుతంగా చేసింది. ఆమె కళ్లలో మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. ఈ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అనిపించింది.
లైలా గారి గురించి?
-లైలా గారు నాకు చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం. ‘ఎగిరే పావురమా’ చూసినప్పటి నుంచి ఆమెంటే ఇష్టం. ఇందులో జగపతిబాబు గారితో ఆమె కాంబినేషన్ కొత్తగా ఉంటుంది. ఆయనకు ఎదురుగా నిలబడే హుందాతనం ఉన్న పాత్ర కావాలి. దాదాపు 20 ఏళ్ల తర్వాత లైలా గారు తెలుగులో నటిస్తున్నారు. ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు.
-జగపతిబాబు గారు, లైలా గారు, రాజీవ్ కనకాల గారు వంటి అనుభవజ్ఞులైన నటులు కథను నమ్మి ఈ సినిమాలో చేశారు. నాకు ఎంతో సపోర్ట్ చేసి, చాలా కంఫర్ట్ ఇచ్చారు.
-ఈ కథను 2024లో రాశాను. నాకు ఎప్పుడూ కథను షార్ప్‌గా చెప్పడం ఇష్టం. చెప్పాలనుకున్న పాయింట్‌ను స్ట్రైట్‌గా చెప్పితేనే నచ్చుతుంది. నా షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి.
మ్యూజిక్ గురించి?
-ఈ సినిమాకు నాగ వంశీ అద్భుతమైన పాటలు ఇచ్చారు. మాకు 12 ఏళ్ల స్నేహం ఉంది. ఒక రెట్రో సాంగ్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ సినిమాతో ఆ అవకాశం దొరికింది. చిత్ర గారు, ఎస్పీ చరణ్ గారితో ఆ పాటను పాడించడం మర్చిపోలేని అనుభూతి.
నిర్మాత అభినవ్ గురించి?
-అభినవ్ గారు చాలా ప్రొఫెషనల్. ఎవరి పని వారు చేయాలనే ఆయన సిద్ధాంతం. మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.
మీకు స్ఫూర్తిని ఇచ్చిన దర్శకుడు?
-నాకు స్టీవెన్ స్పిల్‌బర్గ్ అంటే ఇన్స్పిరేషన్. చిన్నప్పుడు ‘జురాసిక్ పార్క్’ చూసినప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెరిగింది.
మీకు ఇష్టమైన జానర్?
-నాకు హారర్ థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పటివరకు ఎక్కువగా రొమాంటిక్ కామెడీలు చేశాను. భవిష్యత్తులో మంచి హారర్ థ్రిల్లర్ చేయాలని ఉంది.