pizza
Ileana interview (T) about Amar Akbar Anthony
నా గొంతు నాకే నచ్చలేదు - ఇలియానా
You are at idlebrain.com > news today >
Follow Us

11 November 2018
Hyderabad

మాస్ మ‌హారాజా రవితేజ, ఇలియానా జంటగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై శ్రీనువైట్ల దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, చెరుకూరి మోహన్‌(సి.వి.ఎం) నిర్మిస్తోన్న చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'. నవంబర్‌ 16న సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ఇలియానాతో ఇంట‌ర్వ్యూ...

దాదాపు ఆరేళ్ల తర్వాత తెలుగులో సినిమా చేయడానికి కారణమేంటి?
- కచ్చితంగా మంచి కథే. అలాగే రవితేజ వంటి హీరోతో నటించడం గ్రేట్‌ ఎక్స్‌పీరియెన్స్‌. ఆయనతో ఇది నా నాలుగో సినిమా. సినిమాలో నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. నా పాత్ర గురించి వివరించలేను. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే చాలా లేయర్స్‌తో కూడుకున్న కాంప్లికేటెడ్‌ క్యారెక్టర్‌ అని చెప్పగలను. పెర్ఫామన్స్‌కు మంచి స్కోప్‌ ఉన్న చిత్రమే కాదు.. కమర్షియల్‌ విలువలున్న చిత్రం కూడా. సాధారణంగా కొన్ని ట్రైలర్స్‌ చూస్తే స్టోరీ ఎంటనే దానిపై కాస్త ఐడియా వస్తుంది. కానీ మా ట్రైలర్‌లో అలాంటి ఐడియా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే అసలు అమర్‌, అక్బర్‌, ఆంటోని ఎవరనే ఆసక్తిని అందరిలో పెంపొందించింది. మరి ముగ్గురు ఒకరేనా? వేర్వేరు వ్యక్తులా అని తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగు సినిమాలెందుకు చేయలేదు?
- తెలుగులో త్రివిక్రమ్‌గారితో 'జులాయి' సినిమా చేస్తున్నప్పుడు బాలీవుడ్‌లో బర్ఫీ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా స్టోరీ గురించి త్రివిక్రమ్‌గారికి చెప్పాను. ఆయన చాలా గొప్పగా ఉంది. తప్పకుండా చెయ్‌ అని అన్నారు. ఓ మంచి సినిమాలో భాగం కావాలని ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి నేను కూడా ఆ సినిమా చేయడానికి సరేనన్నాను. ఆ సినిమా సక్సెస్‌ తర్వాత అక్కడ వరుస అవకాశాలు వచ్చాయి. ఇక్కడ సినిమా చేయడానికి వీలు కాలేదు. అదే సమయంలో నేను తెలుగులో సినిమా చేయడానికి ఇష్టపడటం లేదంటూ ఇక్కడ వార్తలు వచ్చాయి. ఇక్కడ ఆరేళ్ల పాటు సినిమా చేసిన నేను ఎందుకు సినిమాలు చేయను అని ఎవరూ ఆలోచించలేదు. అలాగే తెలుగులో మంచి కథలు కూడా రాలేదు. కెరీర్‌ ప్రారంభంలో మంచి కథ అనిపిస్తే ఎక్కువగా ఆలోచించకుండా చేసేదాన్ని. ముందు వర్క్‌ను గౌరవించాలనే ఆలోచనతో సాగిపోయాను. అలా నెమ్మదిగా వర్క్‌ పట్ల మరింత ప్యాషన్‌ క్రియేట్‌ అయ్యింది. కథల ఎంపిక మారింది. ఈ ప్రయాణంలో తప్పొప్పులు జరిగి ఉండొచ్చు. అయితే తప్పుల చేశానని ఫీల్‌ కావడం లేదు. ఎందుకంటే నేను నా ప్రయాణాన్ని నేను ఇష్టపడుతున్నాను. తప్పులు చేయడం వల్ల కొత్త విషయాలను తెలుసుకున్నాను. ఉదాహరణకు పోకిరి సినిమా చేసేటప్పుడు అది అంత పెద్ద హిట్‌ అవుతుందని నేను ఊహించలేదు. నేను పోకిరి చేయకూడదని అనుకుంటున్న సమయంలో మంజులగారు నాతో మాట్లాడి ఒప్పించారు. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా పోకిరి నిలిచింది.

తొలిసారి డబ్బింగ్‌ చెప్పినట్లున్నారుగా?
- అవును తెలుగులో డబ్‌ చెప్పాను. అందుకు కారణం డైరెక్టర్‌ శ్రీనువైట్లగారే. ముందు సినిమా ఒప్పుకున్న తర్వాత మీరే డబ్బింగ్‌ చెప్పాలని అన్నారు. అందుకు నేను వద్దని అన్నాను. కానీ నిర్మాతలు నన్ను కన్విన్స్‌ చేశారు. దర్శకుడు దగ్గరుండి చూసుకుంటారని భరోసా ఇచ్చారు. డబ్బింగ్‌ చెప్పే సమయంలో నేను డబ్బింగ్‌ చెప్పలేనెమోనని భయపడ్డాను. కానీ డైరెక్టర్‌గారు, పప్పు నాకు సపోర్ట్‌గా నిలిచారు. మూడు రోజుల్లో నా పాత్రకు డబ్బింగ్‌ పూర్తి చేసేశాను. డబ్బింగ్‌లో నా గొంతు వినడానికి నాకే నచ్చలేదు. భవిష్యత్‌లో ఏ దర్శకుడైనా మీరు చెబితే బావుంటుందని చెబితే నేను డబ్బింగ్‌ చెబుతాను.

interview gallery



ఈ సినిమాకు ముందు తెలుగులో అవకాశాలు వచ్చాయా?
- వచ్చాయి.. పెద్ద హీరోలు, దర్శకులతో చేయమని అడిగారు. అయితే నా పాత్రకు ప్రాధాన్యత లేదు అనిపించడంతో నేను చేయలేనని చెప్పేశాను. ఆ హీరో.. దర్శకుడు పేరు చెప్పలేను అని చెప్పేశాను.

ఎలాంటి పాత్రలను చేయాలనుకుంటున్నారు?
- మన ఆలోచనలే మన ప్రవర్తనకు అద్దం పడతాయి. గ్లామరస్‌ రోల్స్‌ చేయను. కేవలం పెర్ఫామన్స్‌ రోల్స్‌ మాత్రమే చేస్తానని అనుకోకూడదు. గ్లామరస్‌ రోల్స్‌లో కూడా పెర్ఫామన్స్‌కు చాలా మంచి స్కోప్‌ ఉంటుంది. అలాంటి పాత్రనే అమర్‌ అక్బర్‌ ఆంటోని సినిమాలో చేశాను. ఒకప్పుడు మగధీరలో రాజకుమారిలాంటి పాత్రలను చేయూలనే కోరికకుండేది. కానీ ఇప్పుడు నాకు పర్టికులర్‌గా ఇలాంటి డీమ్‌ రోల్స్‌ చేయాలనే ఆలోచనలైతే లేవు. నేను డబ్‌ చేయాలని అనుకోలేదు. శ్రీనువైట్లగారికి నాపై నమ్మకంతో ఈ సినిమాకు డబ్‌ చెప్పాను. అలాగే రేపు మరో దర్శకుడు నేను ఓ పాత్రకు న్యాయం చేయగలుగుతానని నా దగ్గరకు వస్తే అలాంటి పాత్రను తప్పకుండా చేస్తాను.

మీకు పెళ్లైందా?
- నా వ్యక్తిగత విషయాలను నేను చెప్పాలని అనుకోవడం లేదు. నా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పేశాను. నేను ఎంత సినిమాల్లో నటించినా.. నాంటూ ఓ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అందులో ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాలనేం లేదు కదా.

మీ టూ పై మీ అభిప్రాయం ఏంటి?
- అది స్త్రీ కావచ్చు.. పురుషుడైనా కావచ్చు. లైంగిక వేధింపులను భరించిన వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడం చాలా మంచి విషయం. ఓ భయానిక అనుభవం. ఎవరో ఒకరు ముందుకు వస్తేనే ఇలాంటి సమస్యలు తీరుతాయి. ఇలాంటి సమస్యపై నేను స్పందించాల్సిన సమయంలో కచ్చితంగా స్పందిస్తాను.

తదుపరి చిత్రాలు...?
- చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడే చెప్పలేను.

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved