వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్,రాజా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం `అంతరిక్షం 9000 KMPH`. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. డిసెంబర్ 21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా అదితిరావ్ హైదరితో ఇంటర్వ్యూ విశేషాలు...
- సంకల్ప్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. 'స్క్రిప్ట్ చాలా బావుంది. అయితే నేను సినిమా చేయాలంటే ముంబై ఇక్కడకు వస్తూ పోతూ ఉండాలి. అది ప్రొడక్షన్ పరంగా చాలా ఇబ్బంది' అవుతుందని చెప్పాను. తెలుగులో నేను 'సమ్మోహనం' చేస్తున్నాను. ఆ సమయంలో సంకల్ప్ ఫోన్ చేసి 'అదితి నేను స్క్రిప్ట్ మొత్తం రెడీ చేశాను. ఓసారి విను' అన్నారు. సరేనని నేను స్క్రిప్ట్ విన్నాను. ఇప్పటి వరకు అంతరిక్షానికి వెళ్లిన ఇద్దరు మహిళా అస్ట్రానాయిడ్స్ మన దేశానికి చెందినవారే.అలాంటి నిజమైన పాత్రలు చేయాలనిపించింది.
- ఈ సినిమా కోసం చాలా ప్రిపేర్ అయ్యాం. బల్గేరియా, ఈస్ట్రన్ యూరప్ నుండి టెక్నీషియన్స్‌తో కలిసి వర్క్ చేశాం. చాలా రోజుల పాటు రోప్స్‌లో అలాగే వేలాడుతూ ఉండటం. దారాల సహాయంతో వెనక్కి తిరిగి పల్టీ కొట్టడం, గాలిలో ఈదడం వంటి స్టంట్స్ నేర్చుకున్నాను. అదే సమయంలో నేను మణిరత్నంగారి సినిమా షూటింగ్ చేస్తున్నాను. సాయంత్రం ఫ్టైట్ ఎక్కి చెన్నై చేరుకుని అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని, మళ్లీ పొద్దున్నే ఇక్కడకు వచ్చి ట్రయినింగ్ సెషన్‌లో పాల్గొనేదాన్ని. చాలా హార్డ్ వర్క్ చేశాను.దారాలపై వేలాడే సమయంలో రక్తప్రసరణ అగిపోయిన బాధవచ్చినప్పుడు స్టంట్ టీంలో షకీరా అనే అమ్మాయిని పిలిచేదాన్ని తను వచ్చి దారాలను కాస్త వదులు చేసేది. మళ్లీ నార్మల్ అయిన తర్వాత మళ్లీ నటించేదాన్ని. పాత్ర కోసం మే ఉపయోగించిన హెల్మెట్ చాలా బరువుగా ఉండేది. దాన్ని వేసుకుంటే మెడనొప్పి వచ్చేది. తొమ్మిదో రోజున హెల్మెట్ ధరించగానే, భరించలేని నొప్పితో విలవిలలాడాను. డాక్టర్స్ పదిరోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారు. నేను మా ఇంట్లో వాళ్లకి చెప్పకుండా మా మేనేజర్ సహాయంతో డాక్టర్‌ని కలిసి పెయిన్ కిల్లర్స్ తీసుకుని మళ్లీ సెట్స్‌కు వచ్చేశాను. భారీ ఖర్చుతో వేసిన సెట్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు నాకోసం పది రోజులు వెయిట్ చేయడం నాకు ఇబ్బందిగా అనిపించడంతో రెండురోజుల్లో సెట్స్‌కు వచ్చేశాను.
- పాత్ర కోసం ప్రత్యేకంగా అస్ట్రానాయిడ్‌ను ఎవరినీ కలవలేదు. అయితే నేను చదువుకునే రోజుల్లో రాకేశ్ శర్మగారి పిల్లలు మా స్కూల్లోనే చదివేవారు. ఆయన వారి పిల్లల కోసం తరుచుగా మా స్కూలుకు వస్తుండేవారు. ఆ సమయంలో ఆయనతో మాట్లాడేదాన్ని. ఆయన అంతరిక్ష్యంలో ఆయన ఫేస్ చేసిన పలు అనుభూతులను చెబుతూ వచ్చారు. అయితే ఎంత విన్నా,చదివినా, ప్రాక్టీస్ చేసినా సెట్స్‌లో చేసేటప్పుడు మనకు మనమే అస్ట్రానాయిడ్‌గా ఫీలై నటించాలంతే!.
- ఇది ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కాదు. ప్లాష్‌బ్యాక్‌లో లావణ్య త్రిపాఠిలో రోల్ కనపడుతుంది. నా పాత్ర సినిమా అంతటా ఉంటుంది.
- నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు చిన్న పాత్ర చేయాలా? లేక పాత్ర నిడివి ఎక్కువగా ఉంటేనే చేయాలా? అని ఆలోచించలేదు. హాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులు కూడా పాత్ర నిడివి గురించి ఆలోచించరు. మన సినిమాల్లోకి వస్తే ఇప్పటి తరానికి చెందిన వాళ్లలో పరిణీతి, ఆదిత్య ఇలా చాలా మంది పాత్ర నిడివి బట్ట నటించాలని అనుకోలేదు. మంచి పాత్రలు చేయాలనే వచ్చారు. నేను మంచి సినిమాలో భాగమవ్వాలని అనుకోవడం, మంచి డైరెక్టర్స్‌తో వర్క్ చేయాలనుకోవడంతో నా పాత్ర నిడివి గురించి ఆలోచించలేదు. ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు మన పాత్ర వారికి గుర్తుండిపోతే చాలు. ఆ పాత్ర ఎంత సేపు ఉందనేది అనవసరం. నేను గొప్ప సినిమాలు చేస్తున్నాననో, చేశాననో గర్వపడటం లేదు. నటిగా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేను పనిచేసే వారికి గౌరవం ఇస్తాను. నటిగా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మంచి డైరెక్టర్, టీం మనలో బెస్ట్ ఔట్‌పుట్‌ను బయటకు తీసుకువస్తాయని నేను నమ్ముతాను.
interview gallery
- నేను చేసే పనిని ప్రేమిస్తాను. నిద్రహారాలు మాని కూడా పనిచేస్తాను. ఉదాహరణకు ధనుష్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రంలో నటిస్తున్నాను. ఈ సినిమా కోసం పన్నెండు రోజులల పాటు రెండు షిఫ్టులు పనిచేశాను. మణిరత్నంగారి దర్శకత్వంలో చేసేటప్పుడు రెండు సాంగ్స్‌ను గ్యాప్ లేకుండా చేస్తూ వచ్చాను. ఉదాహరణకు పిల్లలకు ఆడుకోవడం ఇష్టం. అలాంటి వారినిక గ్రౌండ్‌లో వదిలేస్తే వాళ్లు ఇంటికి వెళ్లాలనుకోవడం కూడా మరచిపోతారు. ఎంత పని ఉన్నా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలినే.
- ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పుకోవాలనుకున్నాను. కానీ ఎందుకనో నిర్మాతలు వద్దన్నారు. సమ్మోహనం సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను కదా!. డబ్బింగ్ చెప్పుకోవాలనుకోవడాన్ని ఇష్టపడతాను.
- హద్దులేని ప్రేమను మనకు పరిచయం లేని వాళ్లు పంచడం అనేది అన్ని ప్రొఫెషన్స్‌లో దొరకదు. ఆ విషయంలో నేనెంతో అదృష్టవంతురాలిని.
- వరుణ్‌తేజ్‌తో సహా మరో ఇద్దరు కూడా నాతో పాటు అస్ట్రానాయిడ్స్‌గా నటించారు. సెట్స్‌లో చాలా ఫన్ ఉండేది. సన్నివేశాలను డిస్కస్ చేసుకునేవాళ్లం. వరుణ్‌తేజ్ చాలా మంచి కథలను ఎంచుకుంటున్నారు.
- ప్రతి ఒక్కరూ వారి రక్షణను వారే చూసుకోవాలి. మనల్ని బట్టే ఎదుటి వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతాడనేది ఆధారపడి ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీ మంచిదే. నా విషయానికి వస్తే.. 99 శాతం చాలా మంచి వ్యక్తులతో కలిసి పనిచేశాను. నా పట్ల కేర్ తీసుకునేవాళ్లు, బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వడానికి సపోర్ట్ చేశారు. అది హిందీ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఏదైనా కావచ్చు.
- మీ టూ ఉద్యమంలో స్త్రీల మార్పు కోసం బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ సమానత్వాన్ని నమ్మాలి. పవర్‌ను తప్పుగా ఉపయోగించకూడదు.
- ధనుష్ సినిమా చేస్తున్నాను. మిస్కిన్‌గారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. మణిరత్నంగారిని నా మార్గ దర్శకుడిగా భావిస్తాను.