ఐ వింక్ ప్రొడక్షన్స్ లో డైరక్టర్ వినోద్ లింగాల తెరకెక్కించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. వెండితెర మీదకు రావడానికి సిద్దమైంది. సాయి రోనక్, అదితి సింగ్, ఐశ్వర్య.కె, నోయల్ నేని, నవీన్ నేని ప్రధాన తారగణంగా నటించారు. ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అదిత్ సింగ్ సినిమా గురించి చెప్పిన విశేషాలు...
``నేను ఢిల్లీలో పుట్టాను, పెరిగిందంతా ముంబైలోనే. నాన్నగారు జైనేంద్ర ప్రతాప్ ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేశారు. అమీర్ ఖాన్ స్టార్ హీరోలతో కూడా కలిసి నటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన సినిమాల నుండి పక్కకు వచ్చేశారు. ఆయన ప్రభావం నాపై ఉండేదెమో కాబట్టి నాకు చిన్నప్పట్నుంచి సినిమాలంటే చాలా ఆసక్తిగా ఉండేది. సాధారణంగా చిన్నప్పుడు నువ్వేమౌతావని ఎవరైనా అడిగినా నేను హీరోయిన్‌ను అవుతానని చెప్పేదాన్ని. నాకు సినిమాలంటే అంత ఆసక్తి ఉండేది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే నేను ముందు 85 కిలోల బరువు ఉండేదాన్ని నా ఫోటోలు చూసిన దర్శకుడు వినోద్ లింగాలగారు బరువు తగ్గమని సలహా ఇచ్చారు. ఆయన సలహాతో సినిమా కోసం బరువు తగ్గాను. తర్వాత హైదరాబాద్‌కు ఆడిషన్‌కు వచ్చాను. నా కంటే ముందు తెలుగు అమ్మాయిలు, హీరోయిన్స్ కావాలనుకునేవారు ఆడిషన్స్ జరుగుతున్నాయి. వారిని చూసి నేను నెర్వస్‌గా ఫీలయ్యాను. అయితే నాపై నాకు నమ్మకం ఎక్కువ, ఏ పని చేసిన ఫోకస్డ్‌గా చేస్తాను. దాంతో ధైర్యంగా ఆడిషన్స్ ఇచ్చాను. అలామొదలైంది చిత్రంలో నిత్యామీనన్ డైలాగ్స్ ను ఆడిషన్‌లో చెప్పాను. అది విన్న డైరెక్టర్ వినోద్ లింగాలగారు నాకు సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు శాండీ. తెలుగు సంప్రదాయాలను, విలువలను గౌరవించే మన పక్కింటి అమ్మాయి పాత్రలో కనపడతాను. సినిమా అంతా ఫస్ట్ లవ్‌కు సంబంధించిన ప్యూర్ ఫీలింగ్స్‌పై నడుస్తుంది. హీరో సాయిరోనక్ హీరోయిన్ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెలో ఎలాంటి చేంజస్ వచ్చాయనేదే కథాంశం. సినిమాను అందరూ ఇష్టపడి చేశాం. అందుకే మైనస్ 4 డిగ్రీల చలిలో కూడా యాక్ట్ చేశాం. హైదరాబాద్‌లో ఆడియెన్స్ నన్ను బాగా పలకరిస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దర్శకుడు వినోద్ లింగాలగారి గురించి చెప్పాలంటే సినిమా పరంగా, క్యారెక్టర్స్ పరంగా ఏం కావాలో బాగా తెలిసిన వ్యక్తి. ప్రతి ఒక్కరి నుండి మంచి నటనను రాబట్టుకున్నారు. హీరో సాయిరోనక్, నేను షూటింగ్ సమయంలో మంచి స్నేహితులమయ్యాం. మా మధ్య ఉన్న స్నేహమే సినిమాలో కెమెస్ట్రీ చక్కగా వచ్చేలా చేసింది. మా రియల్ లైఫ్ అమ్మగారు సినిమాలో నా అమ్మపాత్రలో నటించారు. తెలుగులో డబ్బింగ్ చెప్పాలని, పాటలు పాడాలని ఉంది. నా తదుపరి చిత్రాలకు అది సాధ్యమవుతుందని భావిస్తున్నాను. ఇక నేను నా తదుపరి చిత్రాలేవీ అంగీకరించలేదు. గుప్పెడంత ప్రేమ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను`` అన్నారు.