6 September 2018
Hyderabad
తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ వస్తోన్న భామ అను ఇమ్మాన్యుయేల్. కెరీర్ మొదలుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఆమె పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ సినిమాల్లో నటించారు. తాజాగా ఆమె మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న సినిమాలో కథానాయికగా నటించారు. అను ఇమ్మాన్యుయేల్ గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ ముచ్చట్లు..
* మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ఇందులో నా పాత్ర పేరు అను. కొంచెం ఇగోగా, కొంచెం కోపంగా కనిపిస్తాను. నా గత సినిమాలు అన్నిటిలోనూ సైలెంట్‌గా ఉన్న నేను, ఈ సినిమాలో కాస్త గట్టిగా మాట్లాడుతుంటాను.
* రియల్ లైఫ్ పేరు ఇప్పుడు స్క్రీన్ మీద వాడటం ఎలా ఉంది?
- యాక్చువలీ ఈ సినిమాలో నా పేరు ముందు జానకి అని ఉండేది. కానీ ఆ పేరును నా కిట్టు ఉన్నాడు జాగ్రత్తలో వాడేశారు. సో మారుతిగారు పేరు చేంజ్ చేయాలని అనుకుని అను అని పెట్టారు.
* కేవలం పేరులోనే పోలిక ఉంటుందా? కేరక్టర్ పరంగానూ మీకూ, అనుకు పోలిక ఉందా?
- నేను కూడా రియల్ లైఫ్‌లో కొంచెం ఇగోయిస్టునే. కాస్త కోపిష్టినే. అయితే మరీ ఈ సినిమాలో చూపించినంత ఎక్కువ మాత్రం కాదు. పోలిక అయితే ఉంటుంది.
* డబ్బింగ్ చెప్పుకొన్నారా?
- లేదండీ. ఈ సినిమాకు చెప్పుకోలేదు. అజ్ఞాతవాసికి చెప్పుకున్నాను.
* సరైన హిట్ లేదని ఎప్పుడైనా బాధపడ్డారా?
- సినిమా ఫ్లాప్ అయినప్పుడు తప్పకుండా బాధగానే ఉంటుంది. సినిమా విడుదలకు ముందు ఒకరకమైన నెర్వస్‌నెస్ ఉంటుంది. సో నేను బాధపడ్డ మాట వాస్తవమే.
* ఈ సినిమాలో రమ్యకృష్ణగారితో పనిచేయడం ఎలా ఉంది?
- ఇందులో ఆమె కుమార్తెగా నటించాను. ఆమె సెట్లోకి వస్తున్నారంటేనే నాకు వణుకు మొదలయ్యేది. కానీ కెమెరా ముందు అలా ఉండేది కాదు. అయితే ఆమె చాలా ఫ్రెండ్లీగా పలకరించేవారు. మామూలుగా మేం అందరం డైలాగుల పేపర్ ను ఇంటికి తీసుకెళ్లేవాళ్లం. కానీ ఆమె మాత్రం ఎంత పెద్ద డైలాగ్ అయినా సెట్లో వచ్చి రెండు నిమిషాలు చదువుకుని చెప్పేసేవారు.
* బ్యూటీ టిప్స్ ఏమైనా చెప్పారా?
- లేదు. ఆవిడ చెప్పలేదు. నేనూ అడగలేదు. కానీ సినిమాల హిట్లకూ, ఫ్లాప్‌లకూ ఏమాత్రం కుంగిపోవద్దని.. మనం నిమిత్తమాత్రులమేననీ చెప్పేవారు.
* చైతన్య గురించి చెప్పండి?
- ఇప్పటిదాకా నేను పనిచేసిన నటుల్లో చాలా డౌన్ టు ఎర్త్. ఈజీగా అనిపించే కోస్టార్ ఆయన.
* గీత గోవిందం ముందు మీ దగ్గరకే వచ్చిందట కదా?
- అవునండీ. అప్పటికి అర్జున్ రెడ్డి విడుదల కూడా కాలేదు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కన్నా ముందే నా దగ్గరకు ఆఫర్ వచ్చింది. ముందు ఓకే అనుకున్నా కానీ, తర్వాత కాల్షీట్ కుదరలేదు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయిందని విన్నాను. నేను ఇంకా చూడలేదు.
* సినిమాను అంగీకరించడంలో మీరు పాటించే సూత్రాలేంటి?
- కమర్షియల్‌గానూ ఉండాలి. కొన్నిసార్లు నటనకు ప్రాధాన్యత కూడా ఉండాలి. ఎందుకంటే `అజ్ఞాతవాసి` సినిమా నా దగ్గరకు వచ్చినప్పుడు అటు పవన్, ఇటు త్రివిక్రమ్ అంతకన్నా ఏం కావాలని ఓకే చెప్పేయవచ్చు. కానీ నేను కథ విన్నాను. `అత్తారింటికి దారేది`లో ప్రణీత తరహా పాత్రయితే వద్దని చెప్పాను. అలా ఉండదు. కీర్తితో సమానమైన పాత్ర ఉంటుందని త్రివిక్రమ్‌గారు చెప్పారు. కీర్తికి ఇప్పుడు `మహానటి`లాంటి హిట్ పడింది. ఒక్క సినిమా ఇక్కడ రాతను మార్చేస్తుంది. శ్రుతికి కూడా ముందు హిట్లు లేవు. కానీ తర్వాత పెద్ద పెద్ద హిట్లు పడ్డాయిగా. కాస్త ఓపిగ్గా వేచిచూడాలంతే.
* ఇంకే సినిమాలు చేస్తున్నారు?
- ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే మరో సినిమా చేసేయాలనే తొందరలో లేను. ఈ సినిమా విడుదలయ్యాక నిలిచి నిదానంగా ఆలోచించి చేస్తాను.త మిళంలోనూ మంచి స్క్రిప్ట్ లు వింటున్నా. మలయాళం ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈ మధ్య నివిన్ పాల్‌తో ఓ సినిమా చేస్తే, స్క్రీన్ స్పేస్ మరీ తక్కువగా ఉంది. అలా కాకుండా మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటాను. ఇప్పుడు హైదరాబాద్ నా సొంతిల్లులా ఉంది. ఇక్కడ నిలదొక్కుకున్నాక మిగిలిన పరిశ్రమల మీద కాన్‌సెన్‌ట్రేట్ చేయాలనుకుంటున్నాను.