28 July 2019
Hyderabad
స్ప్రింట్ మీడియా, జ్ఞాపిక ఎంటర్ ప్రైజస్. వీరిద్దరూ సంయుక్తంగా శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేకర్స్ పతాకాలపై అర్జున్ జంధ్యాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన చిత్రం 'గుణ 369'. 'ఆర్.ఎక్స్.100' ఫేమ్ కార్తికేయ, అనఘ హీరోహీరోయిన్లు. ఆగస్ట్ 2న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్ జంధ్యాల ఇంటర్వ్యూ...
నేపథ్యం...
- మాది ఒంగోలు దగ్గర చిన్న పల్లె. డిగ్రీ పైనలియర్ చదివేటప్పుడు హైదరాబాద్ వచ్చేశాను. అందులో మా సినిమా షూటింగ్‌నంతా ఒంగోలులోనే చేశాం. నేను 2003లో హైదరాబాద్ వచ్చినా.. 2005 చివరలోనే డైరెక్టర్‌గారి దగ్గర జాయిన్ అయ్యాను. అప్పుడు ఆయన తులసి సినిమా చేయాలనుకుంటున్నారు. అప్పటి నుండి ఆయన దగ్గరే పనిచేస్తున్నాను. డైరెక్టర్ అవుదామనే ఆలోచనతోనే ఇక్కడకు రాలేదు. సినిమాలంటే ఆసక్తితో ఇక్కడకు వచ్చాను. కాలేజ్‌లో చదివేటప్పుడు చిన్న చిన్న నాటకాలు వేస్తుండేవాడిని.
పరిచయమే లేని చుట్టరికం..
- మా తాతగారు కూడా గుంటూరుకి చెందిన వారే. జంధ్యాలగారంటే తెలుసు కానీ.. చాలా దూరపు చుట్టరికం ఉంది కానీ.. పరిచయమైతే లేదు.
అప్పటి నుండి ప్రయత్నిస్తున్నా...
- `లెజెండ్` సినిమా టైమ్ నుండి దర్శకుడు కావాలని ప్రయత్నిస్తున్నాను. చాలా మంది హీరోలను కలుస్తున్నాను. ఏదీ వర్కవుట్ కాలేదు. `వినయ విధేయ రామ` సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ జరిగేటప్పుడు `ఆర్.ఎక్స్ 100` విడుదలైంది. ఆ సినిమా చూశాను. ఇండస్ట్రీకొచ్చిన కొత్తల్లో ఓ లైన్ అనుకుని కథ రాసుకున్నాను. 20 నిమిషాల కథ మాత్రమే అది. హై ఎమోషనల్ ఉంటుంది. మనం డైరెక్టర్ అయిన తర్వాత మనమే డైరెక్ట్ చేస్తూ నిర్మిద్దామని అనుకున్నాను. ఆర్.ఎక్స్ 100 సినిమా చూడగానే ఈయనైతే సూట్ అవుతాడనిపించి వెళ్లి కలిశాను. ఆర్.ఎక్స్ 100లోని హీరో పాత్రకు,నా సినిమాలో హీరో పాత్రకు చాలా తేడా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌లా గుణ 369ను తెరకెక్కించాను. కథ వినగానే హీరో వెంటనే చేద్దాం సార్! అని అన్నాడు. బోయపాటిగారికి కూడా కథ వినిపించాను. ఆయన కూడా బావుందని అప్రిషియేట్ చేశారు.
అదే కథ...
- గుణ బి.టెక్ నుండి గుణ 369 ఎలా అయ్యాడో చెప్పే కథే ఇది. బాధ్యతలుండే వాడికి ఓ భయం ఉంటుందని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. టైటిల్ పరంగా ఏమైనా కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుందేమోనని ముందుగానే ట్రైలర్ ద్వారా రివీల్ చేసేశాను. నేను చూసిన రియల్ ఇన్‌సిడెంట్స్ ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశాను. అందుకనే సినిమాను ఒంగోలులోనే షూట్ చేశాం.
అనుభవం అలా ఉపయోగపడింది...
- మణిరత్నంగారి దగ్గర, శంకర్ గారి దగ్గర పనిచేసిన వాళ్లెవరూ వాళ్లలానే డైరెక్ట్ చేయరు. ప్రతి ఒక్కరికీ కొన్ని టేస్టులుంటాయి. వాటిని ఆధారంగా చేసుకునే డైరెక్ట్ చేశాను. నేను కూడా అంతే బోయపాటిగారి దగ్గర పనిచేశాను. కానీ ఆయనలా ఎందుకు తీస్తాను. నా ఆలోచనలు నావి. ఆయన ఆలోచనలు ఆయనవి. అయితే ఆయన దగ్గర వర్క్ చేయడం వల్ల సెట్స్‌లో కొత్త దర్శకుడిని, అనే ఫీలింగ్‌తో టెన్షన్ పడే అవసరం లేకపోయింది. సినిమా పూర్తయిన తర్వాత బోయపాటిగారికి చూపించాను. ఆయన కూడా బాగా చేశానని మెచ్చుకున్నారు. అలాగే వేరే నిర్మాతలు కూడా చూసి మెచ్చుకున్నారు.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్...
- ఈ సినిమాకు భిన్నమైన సినిమాగా ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లోనే సినిమా చేసే ఆలోచనలో ఉన్నాను.