
21 December 2015
Hyderabad
గోపీచంద్ తనను తాను మౌల్డ్ చేసుకున్నాడు!
- ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
యజ్ఞం చిత్రంతో గోపీచంద్‌లోని మాస్ యాంగిల్‌ను చూపించిన దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి. ఇప్పుడు మరలా గోపీచంద్‌తోనే ఆయన `సౌఖ్యం` సినిమాను తీశారు. ఈ తాజా సినిమాను భవ్య క్రియేషన్స్ రూపొందించింది. ఆనంద్ ప్రసాద్.వి. నిర్మించారు. గోపీచంద్ పక్కన రెజీనా నటించింది. ఈ నెల 24న విడుదల కానున్న ఈ సినిమా గురించి ఎ.ఎస్.రవికుమార్ చౌదరి సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలు...
* `సౌఖ్యం` ఎలా ఉండబోతోంది?
- నేటి ప్రేక్షకుడు కోరుకునేలా ఉంటుంది. పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత సక్సెస్ బాటలో వెళ్లాలనే ఈ సినిమాను రూపొందించాం. ఎన్నెన్నో కాంబినేషన్లను అనుకున్నాం. కానీ గోపీచంద్‌తో నాది యజ్ఞంతో హిట్ కాంబినేషన్. అందుకే వెంటనే మొదలుపెట్టాం. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా ఉన్న కథకు ఆహ్లాదకరమైన వినోదాన్ని జోడించి ఈ సినిమాను రూపొందించాం. కథ కొత్తదని చెప్పను కానీ అందరినీ కట్టిపడేసే స్క్రీన్ ప్లే మాత్రం తప్పక ఉంటుంది.
* భవ్య క్రియేషన్స్ తో మీకున్న అనుబంధాన్ని గురించి చెప్పండి?
- నాకు పరిశ్రమలో తొలిసారి అవకాశాన్ని ఇచ్చిన సంస్థ ఇది. గతంలో ఈ సంస్థలో మనసుతో చిత్రానికి పనిచేశాను. కానీ అక్కడ పొరపాటు జరిగింది. ఈ పొరపాటు మరలా జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ సారి చాలా జాగ్రత్తగా చేశాం. సౌఖ్యం చిత్రం స్క్రిప్ట్ పక్కాగా ఉంది. అందుకే ఆరు నెలల్లో చిత్రీకరించాం.
* సినిమాను చూసిన వారు ఏమంటున్నారు?
- చాలా బావుందని చెబుతున్నారు. డబ్బింగ్ థియేటర్ నుంచి, రీరికార్డింగ్ నుంచి, ఇటీవల సెన్సార్ నుంచి కూడా పాజిటివ్ స్పందన వచ్చింది. అనూప్ ఇచ్చిన సంగీతానికి చాలా మంచి స్పందన వస్తోంది. సో అంతటా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.
* గోపీచంద్, రెజీనాతో రెండో సారి పనిచేస్తున్నారు..?
- గోపీచంద్‌లో అప్పటికి, ఇప్పటికి ఎలాంటి వ్యక్తిత్వ పరంగా ఏ మార్పూ లేదు. కాకపోతే అప్పుడు మాస్‌గా ఉండేవాడు... ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టు మారి కాసింత మౌల్డ్ అయి కనిపిస్తున్నాడు. పిల్లా నువ్వులేని జీవితంలో నేను చూసిన రెజీనా వేరు. ఈ సినిమాలో నేను చూసిన రెజీనా వేరు. డ్యాన్సులు చాలా బాగా చేసింది. తనకి ఈ సినిమాతో తప్పకుండా ఆశించిన కమర్షియల్ బ్రేక్ వస్తుంది.
* మూస కథలతో సినిమాలు తీస్తున్నారని విమర్శ ఉంది కదా?
- మన దగ్గర ట్రెండ్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు కామెడీ ట్రెండ్ నడుస్తోంది. ట్రెండ్ కు తగ్గట్టు వెళ్తుంటాం.
* శ్రీధర్ సీపాన కథతో సినిమా చేయడం ఎలా అనిపించింది?
- తనే కాదు. మంచి కథను ఎవరు ఇచ్చినా నేను తీసుకుంటా. వాళ్ళ వెర్షన్ ను నాలుగైదు సార్లు విని, నా వెర్షన్ కూడా రాసుకుంటా. నా స్టైల్లోనే తీస్తా. రైటర్‌కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తా.