22 May 2019
Hyderabad
`అల్లుడు శీను`తో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన నటించిన తాజా సినిమా `సీత` ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు.
* సినిమా ఎలా వచ్చిందండీ?
- చాలా బాగా వచ్చింది. చివరి అరగంట విపరీతంగా ఎమోషనల్‌గా ఉంటుంది. అంతకు ముందంతా నవ్విస్తూ ఉంటుంది.
* అసలు కథ ఏంటి?
- 20 ఏళ్లు జనాలకు దూరంగా, పొల్యూట్ కాకుండా పెరిగిన ఓ అబ్బాయి ఈ జనారణ్యంలోకి వస్తే ఎలా ఉంటుంది? అందులోనూ డబ్బే సర్వస్వం అనుకునే అమ్మాయికి, నిలిచి నిదానంగా ఉండటం మేలనుకునే అబ్బాయికి పరిచయం ఏంటి? అది ఏ తీరాలకు దారి తీసిందనేది ఈ కథలో కీలకం.
* మీ పాత్ర ఎలా ఉంటుంది?
- చాలా వేరియేషన్లు ఉంటాయి. చాలా కొత్తగా ఉంటుంది. తేజగారు రెండు కథలు చెప్పారు. నాకు ఈ కథ నచ్చింది. మా నాన్నగారికి మరో కథ నచ్చింది. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ కథ ఉపయోగపడుతుందని నా నమ్మకం. నా తొలి సినిమాలో కాస్త కామెడీ చేశాను. ఆ తర్వాత ఇప్పటిదాకా కామెడీ చేయలేదు. ఈ సినిమాలో తేజగారు చేయించారు.
* తేజతో పనిచేయడం ఎలా ఉంది?
- చాలా స్వీట్‌గా ఉంది. ఆయన మంచి ఇన్‌పుట్స్ ఇస్తారు. అలా చేయి.. ఇలా చేయి.. అని చెప్పరు. ఎలా చేస్తే బావుంటుందో ఆలోచించుకోమని చెబుతారు. అది నాకు చాలా ఉపయోగపడుతోంది. `సీత` తర్వాత `రాక్షసుడు` సెట్‌కి వెళ్లినా సరే, ఆ పార్ములానే యూజ్ చేసి చేసేవాడిని.
* కాజల్ పాత్ర గురించి..?
- సినిమాలో ఆమె పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుంది. తేజగారు నాకు ఈ కథ చెప్పేటప్పుడే హీరోయిన్‌గా కాజల్ ఫిక్సయి ఉన్నారు. అంతటి సీనియర్ ఈ పాత్రలో నటించడం చాలా అవసరం.
* సీత టైటిల్ మీరే సజెస్ట్ చేశారని..
- అవునండీ. ఈ సినిమాకు, ఈ టైటిలే కరెక్ట్. లేడీ ఓరియంటెడ్‌గా టైటిల్ పెట్టాలంటే చాలా మంది ఒప్పుకోరట. నేను ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉందని కొందరు ఫోన్లు కూడా చేశారు.
* ఇంకేం హైలైట్స్ ఉంటాయి..
- చాలా ఉంటాయి. సినిమాలో పాత్రల చిత్రీకరణ, కాంబోడియాలోని లొకేషన్లు, కథ, కథనం.. ఒకటేంటి చాలానే ఉంటాయి. అందులో ఓఓ అని వెరైటీ శ్లాంగ్‌లో నేను చెప్పే ఊతపదం ఒకటి.
* సోనూసూద్‌గారి గురించి చెప్పండి?
- సోనూసూద్ ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. మా సంస్థలో గతంలో ఆయన కందిరీగ చేశారు. అప్పుడే నాకు ఆయనతో మంచి పరిచయం ఉంది. కానీ ఈ సినిమాతో క్లోజ్ అయ్యారు. జనరల్‌గా ఇండస్ట్రీలో మనకు పెద్దగా ఫ్రెండ్స్ ఉండరు. కానీ సోనూసూద్‌గారు నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు.
* మీరు నెక్స్ట్ చేస్తున్న సినిమాలేంటి?
- రాక్షసుడు చేస్తున్నా. పూర్తి కావచ్చింది. నాకు హిందీలో మంచి మార్కెట్ ఉంది. అందుక హిందీ కోసం కాస్త స్పెషల్‌గా కొన్నిటిని చేస్తున్నాం. హిందీలో బన్నీవి, నావి ఎక్కువ మిలియన్ల మంది చూసే సినిమాలు. భగవంతుడు హిందీ మార్కెట్‌ను క్రియేట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను.
* ఇంకేం సినిమాలున్నాయి?
- ఇంకా ఏవీ అంగీకరించలేదు. అంగీకరించగానే చెబుతా. `రాక్షసుడు` మాత్రం జులైలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.
* ఈ సినిమాను మీ నాన్న చూశారా?
- ఆయనకు ఈ సినిమా సర్‌ప్రైజ్ ప్యాక్. మా అమ్మ, తమ్ముడు చూశారు. చాలా బాగా కనెక్ట్ అయి ఏడ్చేశారు.