18 June 2019
Hyderabad
చేతన్ మద్దినేని హీరోగా నటించిన చిత్రం `ఫస్ట్ ర్యాంక్ రాజు`. కాషిష్ ఓరా, ప్రకాష్‌రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రావు రమేష్, నరేష్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ``విద్య 100% బుద్ధి 100%` అనేది ట్యాగ్‌లైన్. నరేష్ కెమార్ హెచ్.ఎన్. దర్శకత్వం వహించిన చిత్రమిది. కిరణ్ రవీంద్రనాథ్ సంగీతాన్ని సమకూర్చారు. మంజునాథ్ వి కందుకూరు నిర్మాత. డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తోంది. ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరో చేతన్ మద్దినేని హైదరాబాద్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు.
* ఫస్ట్ ర్యాంక్ రాజు గురించి చెప్పండి?
- ఇందులో ఫస్ట్ ర్యాంక్ రాజు లైఫ్ జర్నీని చూపిస్తున్నాం. టీజర్‌లో చూపించినట్టు ఇన్నొసెంట్‌గా ఉన్న అతని జీవితం కలర్‌ఫుల్‌గా ఎందుకు మారింది? ఆ తర్వాత ఏమైంది? ఎవరికోసం ఎంత మారాడు? నిజంగా మారాడా? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
* ఫస్ట్ ర్యాంక్ రాజు టైటిల్ గురించి..
- మనందరిలోనూ ఫస్ట్ ర్యాంక్ అని అనిపించుకున్న వాళ్లు ఉంటారు. కాకపోతే ఒకరు 10 పర్సెంట్ అనిపించుకుని ఉంటే, మరొకరు 100 శాతం అనిపించుకుని ఉంటారు. మనం అందరం ఎప్పుడో ఒకప్పుడు బట్టీ పట్టినవాళ్లమే. మన ఎడ్యుకేషన్ సిస్టమే అలా ఉంది.
* ఈ సినిమాను రీమేక్ చేయడానికి కారణం..
- ట్రెండ్‌కు తగ్గట్టు ఉంటుందని. యూనివర్శల్ సబ్జెక్ట్ ఇది. తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను డాక్టర్లుగానో, ఇంజనీర్లుగానో చూడాలనే అనుకుంటారు. ఆ విషయాన్నే ఇందులోనూ చెప్పాం.
* రీమేక్ చేయాలనే ఆలోచన ఎవరిది?
- మా నాన్న వాళ్ల ఫ్రెండ్స్ సినిమా చూసి సజెస్ట్ చేశారు. మేం ఒరిజినల్ నిర్మాతలను అడిగితే వాళ్లకు కూడా తెలుగులో తీయాలని ఉందని అన్నారు. మారుతిగారు ఈ సినిమా విషయంలో చాలా సాయం చేశారు. స్క్రీన్‌ప్లే నుంచి గీతా డిస్ట్రిబ్యూషన్ వరకు ఆయన చేసిన సాయం ఉంది.
* మీరెలా చదివేవారు?
- నేను ఫస్ట ర్యాంక్ వచ్చిన సందర్భాలున్నాయి. అలాగని లైఫ్ మొత్తం ఫస్ట్ ర్యాంక్ రాలేదు. ఆంధ్రా యూనివర్శిటీ మెయిన్ క్యాంపస్‌లో బీటెక్ చేశా. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి కూడా మా క్లాస్‌లోనే ఉండేవాడు. మా క్లాస్‌లో అందరూ టాపర్సేనన్నమాట. అయితే క్యాంపస్ సెలక్షన్‌లో ఐడియాలో ముందు నాకు ఉద్యోగం వచ్చింది.
* ఈ కేరక్టర్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
- రాజు పాత్ర చేస్తున్నంత సేపు నూనె రాసుకుని, జుట్టు దువ్వుకుని అలా ఉండేవాడిని. కెమెరా ముందే కాదు. వెనక కూడా అచ్చం అలాగే ఉండటనికి ప్రయత్నించే వాడిని.
* ఇంజనీరింగ్ చేసి సినిమాల వైపు వచ్చారు?
- చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. దాంతో ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు కూడా కొన్ని డెమో షూట్స్ చేశా. అక్కడి నుంచి `రోజులు మారాయి`లో మారుతిగారు అవకాశం ఇచ్చారు. `గల్ఫ్`లోనూ నా పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా చేశా.
* ఈ చిత్ర దర్శకుడు గురించి చెప్పండి?
- చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ సినిమా కథను చెప్పాలంటే ఆర్ట్ ఫిల్మ్ గానూ చెప్పొచ్చు. అలాగే కమర్షియల్ చిత్రంగానూ చెప్పొచ్చు. ఈ కథకు కమర్షియల్ వేల్యూస్‌ని జోడించి చాలా బాగా తీశాడు. ఐదు పాటలున్నాయి. డ్యూయట్లున్నాయి. కామెడీ కూడా బాగా ఉంటుంది. కిరణ్ అని సంగీతం చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జె.బిగారు ఇచ్చారు. డైలాగులు కూడా చాలా బావుంటుంది.
* ఈ సినిమా హైలైట్స్ చెప్పమంటే?
- ఈ చిత్రంలోని రాజు పాత్ర అమాయకత్వానికి ఐకాన్‌లాగా మారుతాడు.
* మీ తదుపరి చిత్రాలు..
- ఇంకో 2,3, ఉన్నాయి. వాటి గురించి త్వరలోనే ప్రకటిస్తాం.