5 May 2018
Hyderabad
కీర్తిసురేశ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `మహానటి`. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత తదితరులు కీలకపాత్రధారులు. స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్ బ్యానర్స్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా మే 9న విడుదలవుతుంది. ఈ సందర్భంగా కీర్తిసురేశ్‌తో ఇంటర్వ్యూ
`మహానటి` ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది?
- ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాల కంటే భిన్నమైన చిత్రం 'మహానటిస. ఈ మూవీ జర్నీ ఇతర చిత్రాలకు భిన్నంగా సాగిందనడంలో సందేహం లేదు. దాదాపు ఏడాదిన్నర పాటు ఈ సినిమాతో ట్రావెల్ చేశాను. దర్శక నిర్మాతలు ఇంకా ఎక్కువ సమయం జర్నీ చేశారు. ఈ జర్నీలో సావిత్రిగారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను.
సావిత్రి పాత్ర చేయాలనుకోగానే మీ ఫీలింగ్ ఏంటి?
- డైరెక్టర్ నాగాశ్విన్, నిర్మాత ప్రియాంక దత్‌గారు నన్ను కలిసినప్పుడు అలాంటి మహానటి పాత్రలో ఎలా చేయగలను అనిపించింది. దాంతో ముందు చేయనని చెప్పేశా. అయితే దర్శక నిర్మాతలు నన్ను ఫాలో అప్ చేయడం చూసి సరే! ముందు స్క్రిప్ట్ విందామనిపించింది. స్క్రిప్ట్ వినగానే ఇంకా భయమేసింది. ఎందుకంటే సావిత్రిగారి వంటి మహానటి పాత్రను నేనెలా చేయగలను అనిపించింది. చాలా కమర్షియల్ సినిమాల్లో నటించిన నాకు ఇలాంటి చాలెజింగ్ రోల్ రావడం సందిగ్ధంగా అనిపించింది. డైరెక్టర్ నాగాశ్విన్‌ను అడిగి నాకు సందేహలున్న వాటి గురించి తెలుసుకున్నాను. నేను సావిత్రిగారి పాత్ర చేయడం వల్ల ఎలాంటి రాంగ్ ఇండికేషన్ ప్రేక్షకులకు వెళ్లకూడదు. అయితే ఈ బయోపిక్ అందరికీ తెలిసిన నిజాలతోనే తెరకెక్కించాం. చిన్న చిన్న కమర్షియల్ అంశాలు తప్ప ఎక్కడా అడ్వాంటేజ్ తీసుకోలేదు.
కాస్ట్యూమ్స్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు?
- సాధారణంగా నాకు మన సంస్కృతిని ఎలివేట్ చేసే దుస్తులు ధరించడం అంటే ఇష్టం. అందులోనూ చీర కట్టుకోవడం అంటే ఆసక్తి. 'మహానటి' విషయంలో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరించాల్సి వచ్చింది. లుక్ టెస్ట్ చేసేవరకు నాకు కాన్ఫిడెన్స్ లేదు. లుక్ టెస్ట్ తర్వాత కాస్త నమ్మకం వచ్చింది. అందుకు కారణం ఓ గొప్ప నటి నటించిన పాత్ర ఉన్న సిశ్రీనిమాను చేయాలనగానే జడ్జ్ చేయడాన్ని మరచిపోయాను. అయితే టీజర్ విడుదలైన తర్వాత అందరూ చాలా బావుందని అనడంతో నమ్మకం పెరిగింది.
సావిత్రి అమ్మాయి చాముండేశ్వరి సపోర్ట్ గురించి?
- ఈ సినిమా ప్రారంభించిన సమయంలో అసలు సావిత్రిగారి సినిమాల్లో ఏ సినిమాలను తెరపై చూపించనున్నారు? సహా చాలా ప్రశ్నలు వేశారు. అయితే ఈ సినిమాలో మేం క్రియేట్ చేసింది 20 శాతం మాత్రమే. 'మాయాబజార్', 'నువ్వులేక వీణ..' పాట ఇలా కొన్నింటిని మాత్రమే క్రియేట్ చేశాం. మిగతా సినిమా అంతా సావిత్రిగారికి సంబంధించినదే. నటిగా, వ్యక్తిగా ఆమె గురించి ఈ సినిమా ఉంటుంది. అయితే ఆమె నటించిన సినిమాలను తెరపై చూపాలంటే ఆయా సినిమాలను చూస్తే సరిపోతుంది. మరి ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఎలా చూపాలనుకోవడం కష్టతరమే. ఆ సమయంలో విజయ చాముండేశ్వరిగారిని యూనిట్ సంప్రదించింది. ఆమె సావిత్రిగారికి సంబంధించిన చాలా విషయాలను మాకు చెప్పారు. ఆమె చెప్పిన విషయాల్లో చాలా విషయాలు నాకు సరిపోయాయి. ఉదాహరణకు సావిత్రిగారు క్రికెట్ ఆడేవారు. నేను కూడా స్కూల్‌డేస్‌లో క్రికెట్ ఆడేదాన్ని. ఆమెకు ఈత అంటే చాలా ఇష్టం. నాకు కూడా స్విమ్మింగ్ చేయడమంటే ఇష్టం. కారు డ్రైవ్ చేయడానికి ఆమె బాగా ఇష్టపడేవారు. నాకు కూడా కారు డ్రైవ్ చేయడమంటే ఇష్టం. అలాగే నాగాశ్విన్‌గారు ఆమెకు సంబంధించిన పుస్తకం ఒకటిచ్చి చదవమని అన్నారు. నేను చదివిన తర్వాత కొన్ని విషయాలు తెలిశాయి. ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఓ ఇమేజినేషన్ క్రియేట్ అయ్యింది. తర్వాత నాగాశ్విన్ ఇచ్చిన టిప్స్‌ను ఫాలో అయ్యాను.
సినిమా చేసే క్రమంలో ఎలా అనిపించింది?
- సావిత్రిగారి పాత్ర చేయడం ఒక పక్క ఒత్తిడిని, మరో పక్క ఆనందాన్ని కలిగించింది. అదే సమయంలో నేను ఎక్కడకు వెళ్లినా 'నువ్వెంత అదృష్టవంతురాలివి.. సావిత్రిగారి బయోపిక్‌లో ఆమె పాత్రను చేస్తున్నావ్' అని అంటుండేవారు. ఇలా చాలా మంది చాలా రకాలుగా అన్నారు. ఓ రకంగా అలాంటి కామెంట్స్ నాకు తెలియకుండానే ఒత్తిడిని క్రియేట్ చేశాయి. ఓ రకంగా నాలో భయాన్ని క్రియేట్ చేశాయి. ఎలాగూ ఆమెలా నటించలేను. అయితే హండ్రెడ్ పర్సెంట్‌ను దాటి పెర్ఫామెన్స్ చేస్తే కొంత అయినా ప్రెజెంట్ అవుతుందని భావన. అందుకనే పర్‌ఫెక్షన్ కోసం ఒకొక్క సీన్‌ను ఇరవై ముప్పై సార్లు చేసేదాన్ని. డానీ సినిమాటోగ్రఫీ, మిక్కీ సంగీతం, తోట తరణిగారి ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, లైటింట్ అన్ని అంశాలు సినిమాకు మేజర్ ఎసెట్ అయ్యాయి.
అమ్మ హెల్ప్ తీసుకున్నారా?
- తీసుకున్నాను. మా అమ్మగారు ఎప్పుడూ సావిత్రి గారి గురించి గురించి చెప్పడం వల్ల సావిత్రిగారు నాకు చిన్నప్పట్నుంచి తెలుసుననే భావన ఉండేది. నేను సావిత్రిగారి పాత్ర చేస్తున్నానని చెప్పగానే ఆమె కాస్ట్యూమ్స్ చక్కగా కుదిరిందా? లుక్ ఎలా ఉంది? నీ లుక్‌ని ఫోటో తీసి నాకు పంపు అని చెప్పేవారు. అమ్మ సీనియర్ నటి కావడంతో సావిత్రిగారి గురించి ఆమెకు తెలిసిన విషయాలను చాలా చెప్పింది.
డబ్బింగ్ చెప్పడం కష్టమైందా?
- ఈ సినిమాలో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాలి. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత తెలుగులో నేను డబ్బింగ్ చెప్పిన సినిమా 'మహానటి'. అయితే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమైన విషయం. అందుకని రెండు వారాల పాటు డిక్షన్ ట్రైనింగ్ తీసుకున్నాను. నటించేటప్పుడు ఉచ్చారణ గురించి పెద్దగా కష్టపడే అవసరం ఉండదు. కానీ డబ్బింగ్ విషయం అలా ఉండదు. చాలా స్పష్టంగా ఉండాలి. అందుకని డబ్బింగ్‌లో కూడా 20 సార్లు చెప్పాల్సిన అవసరం వచ్చింది. శ్రీనివాస్‌గారు, సాయిమాధవ్‌గారు నాకు డబ్బింగ్ సమయంలో ఎంతగానో సపోర్ట్ చేశారు.