తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నారు లావణ్య త్రిపాఠి. తాజాగా ఆమె సాయిధరమ్‌తేజ్ సరసన నటించిన సినిమా `ఇంటిలిజెంట్`. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ నెల 9న విడుదల కానున్న ఈ సినిమా గురించి లావణ్య త్రిపాఠి మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు..
* అదేంటి సరిగా నడవలేకపోతున్నారు..
- లావణ్య పడిపోయింది. (నవ్వుతూ) ఎక్కడో డిన్నర్ కి వెళ్తే స్టెప్ మిస్ అయి పడిపోయాను.
* సరే.. ఇంతకీ మీరు ఎంత ఇంటలిజెంటో చెప్పండి?
- ఎంతో కాదు. కొంచెమే.
* `ఇంటిలిజెంట్`లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ఇందులో నా పేరు సంధ్య. యు.ఎస్. రిటర్న్ అమ్మాయి. ఫాదర్‌కి బిజినెస్‌లో హెల్ప్ చేస్తుంది. హీరో బాస్‌గా నా ఫాదర్ పనిచేస్తుంటాడన్నమాట. కొంచెం కోపంగా.. కొంచెం బాగా ఉంటుంది కేరక్టర్.
* ఇందులో హీరో ఇంటలిజెంటా? కథా?
- ఇది హీరో డామినేటెడ్ సినిమా కదా. అందువల్ల హీరో తన మెదడును ఉపయోగించి విలన్‌ను దెబ్బతీస్తాడు. ఆ ప్రకారం కథ కూడా ఇంటలిజెంట్‌గానే ఉంటుంది.
* ఇది మీ కెరీర్‌లో మీకెలా డిఫరెంట్ చిత్రమవుతుంది?
- తప్పకుండా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా సినిమాకూ దర్శకుడు మారే కొద్దీ నేను నటించే పాత్రల్లోనూ మార్పు ఉంటుంది. ఇందులో ఫక్తు వినాయక్‌గారి మార్కు హీరోయిన్‌లా ఉంటాను. టిపికల్ కమర్షియల్ హీరోయిన్‌గా కనిపిస్తాను. ఇలా చేయడం ఇది తొలి సారి. చాలా ఎంజాయ్ చేశాను.
* సాయిధరమ్‌తేజ్‌తో నటించడం ఎలా ఉంది?
- సాయిధరమ్‌తేజ్‌తో పనిచేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. తను చాలా మంచి నటుడు. మంచి డ్యాన్సర్. నేను కూడా ఇందులో ఆయన పక్కన చాలా డ్యాన్సులు చేశాను. తనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.
* మీ హీరోకి, మీకు మధ్య సినిమాలో రిలేషన్ ఎలా ఉంటుంది?
- టిపికల్ లవ్ స్టోరీ ఇది. సినిమా చూస్తున్నంత సేపు చాలా క్యూట్‌గా ఉంటుంది.
* చమక్కు చమక్కు పాట రీమిక్స్ చేస్తున్నప్పుడు.. పాత పాట కన్నా బెటర్‌గా చేయాలని అనుకున్నారా?
- యాక్చువల్లీ.. స్పాట్‌కి వెళ్లాక ఆ పాటను చిత్రీకరించబోతున్నట్టు నాతో చెప్పారు. అది లెజండరీ సాంగ్. లెజండరీ ఆర్టిస్టులు చేసిన పాట. వాళ్లతో మ్యాచ్ కావడం అనేది కుదరని పని. నేను చిరంజీవిగారికి చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఈ పాటని ఎంజాయ్ చేసి ఒక ఫ్యాన్‌లాగా స్టెప్పులు వేశాను.
* ట్రైలర్‌లో ప్రపోజ్ చేసే సీన్ ఉందిగా.. రియల్ లైఫ్‌లోనూ అలాంటి అనుభవం మీకు ఏమైనా ఉందా?
- ప్రజలు నన్ను చూసి ఆ విషయంలో చాలా భయపడుతారు. నేను పని గురించి తప్ప ఇంకదేని గురించీ మాట్లాడను. అందువల్ల వాళ్లకి నేనంటే భయం. ఆ భయం ఎందుకో నాకూ తెలియదు.
* వినాయక్‌గారితో పనిచేయడం ఎలా ఉంది?
- అంత పెద్ద డైరక్టర్ అయి ఉండి హీరోయిన్ కంఫర్టబుల్‌గా ఉందా? లేదా? అని చూడ్డం చాలా గ్రేట్. ఆయన పనిచేసే విధానం చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నన్ను చిన్నపిల్లలాగా ట్రీట్ చేసేవారు. ఆయనతో సినిమా చేయడం నా అదృష్టం.
* మీకు, తేజ్‌కి కెమిస్ట్రీ బాగా ఉందని అన్నారు..?
- నేను ఇంతకు ముందు రెండు, మూడు సార్లు అతన్ని కలిశాను. కానీ ఎప్పుడూ అంతగా మాట్లాడుకోలేదు. ఈ సినిమా సెట్‌లోనూ ముందు అంతగా మాట్లాడుకోలేదు. తను షై పర్సన్. నేను అంత త్వరగా ఓపెన్ కాలేను. సో అంత తేలిగ్గా మాట్లాడుకోలేకపోయాం. కానీ మస్కట్ షెడ్యూల్లో ఇద్దరం పక్కపక్కనే కూర్చుని నవ్వుకునేవాళ్లం. ఇద్దరికీ నవ్వడం చాలా ఇష్టం. అలా స్నేహం కుదిరింది. దాంతో కెమిస్ట్రీ బాగా పండినట్టు అనిపిస్తోందేమో.
* సినిమా విడుదలైన తర్వాత ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారా?
- తీసుకుంటాను. తీసుకోవాలి కదా. కొన్నిసార్లు కొంత మంది పాజిటివ్ ఫ్యీడ్‌బ్యాక్ ఇస్తారు. కొన్నిసార్లు కొంత మంది నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. అందరి టేస్ట్ ఒకేలా ఉండదు. కొందరికి ఆర్టిస్టిక్ సినిమాలు ఇష్టం. కొందరికి కమర్షియల్ సినిమాలు ఇష్టం. అందుకే అందరూ చెప్పేది వింటాను. ఏది తీసుకోవాలో అదే తీసుకుంటాను.
* కొన్నిసార్లు వర్కవుట్ కాకపోతే..
- నో ప్రాబ్లమ్. నేను దేని గురించీ పశ్చాత్తాప పడను. నేను ఇప్పటిదాకా చేసిన ఏ సినిమా పట్లా అసంతృప్తిగా లేను.
* కొన్నిసార్లు మీరు ప్రొడక్షన్ హౌస్‌లను ఎక్కువ ఇబ్బందిపెడతారని వార్తలు వస్తున్నాయే?
- అలాంటిదేమీ లేదండీ. అన్నిసార్లూ మనం వినే వార్తలన్నీ నిజం కావు. ఇప్పటిదాకా నేను పనిచేసిన ప్రొడక్షన్ హౌస్‌లన్నీ నా పనితీరుతో చాలా హ్యాపీగానే ఉన్నాయి. ఆ విషయాన్ని చాలా కాన్ఫిడెన్ట్ గా చెప్పగలను. కొన్నిసార్లు అనుకున్న కాంబినేషన్లు కుదరకపోవచ్చు. కొన్నిసార్లు ...ఒకసారి కుదిరి మరోసారి కుదరకపోవచ్చు. అలాంటప్పుడు వాటి నుంచి బయటకు రావడమే మంచిది.
* ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మరింత కుంగిపోతారట కదా?
- అలాంటిదేమీ లేదండీ. కాకపోతే ఒక క్షణం ఆలోచిస్తాను. ఎక్కడ తప్పు జరుగుతోంది అని నా అంతట నేను ఆరాతీసుకుంటాను. అలాగే సక్సెస్‌లు వచ్చినప్పుడు కూడా నేనేమీ ఎగరను. భూమ్మీదే ఉంటాను.
interview gallery
* ఇప్పుడు ఇంకేం సినిమాలున్నాయి?
- తమిళ్‌లో ఉన్నాయి. సంతకం చేయాలి. కాకపోతే గతేడాది నావి మూడు, నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా బాగానే రిలీజ్‌లు ఉన్నాయి. అందుకే నెల రోజుల పాటు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నా.
* తమిళ నిర్మాతలు మీ మీద ఎందుకు కంప్లయింట్ చేశారు?
- అది అక్కడ జరిగింది. కొన్నిసార్లు మనకు పడటం లేదని తెలిసినప్పుడు కంటిన్యూ కావడం కన్నా తప్పుకోవడం ఉత్తమం. అందుకే తప్పుకున్నాను. కానీ తెలుగులో అలాంటివి ఇప్పటిదాకా లేవండీ.
* మీరిప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటున్నారా?
- ఈ మధ్యనే ప్లేస్ తీసుకున్నాను. హైదరాబాద్ చాలా బావుంది. నాకు ముంబైలోనూ ఇల్లు ఉంది. అయితే హైదరాబాద్ నాకు బాగా నచ్చింది.
* ఈ సినిమాలో బాగా గ్లామర్‌గా కనిపించినట్టున్నారు?
- అవునండీ. ప్రొడక్షన్ హౌస్ ఘనతే అదంతా.
* సి.కల్యాణ్‌గారి ప్రొడక్షన్ చేయడంలో ఎలా ఉంది?
- ప్రతి రోజూ షూట్‌కి వచ్చేవారు. చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. మమ్మల్ని బాగా చూసుకున్నారు.
* స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో హీరోలకు ఉన్నంత వెసులుబాటు హీరోయిన్లకు ఉంటుందా?
- నిజం చెప్పాలంటే ఉండదు. కానీ నేను అన్ని తరహాల చిత్రాలను చేయడానికి ఓపెన్‌గా ఉంటాను. పెద్ద సినిమాలు చేయడం వల్ల చిన్న సినిమాలను చేయనని కాదు. అన్ని సినిమాలు చేస్తాను. ఈ ఏడాది నేను మిగిలిన భాషల్లోనూ చేయాలని అనుకుంటున్నా. కాకపోతే తెలుగు హోమ్ గ్రౌండ్‌గా ఫీలవుతా.
* తెలుగు, తమిళ్ తప్ప.. మిగిలిన భాషల్లో ఉన్నాయా?
- అంటే నా క్రియేటివ్ శాటిస్‌ఫేక్షన్ కోసం నేను మలయాళం సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.
* డ్యాన్సులు కూడా బాగా చేసినట్టున్నారు.. `ఇంటిలిజెంట్` కోసం?
- నిజమే. నా గత చిత్రాల్లో నేను ఎక్కువగా డ్యాన్సులు చేయలేదు. కానీ ఈ సినిమాలో చేశాను. చమ్మక్కు చమ్మక్కు కోసం ప్రాక్టీస్ చేయడానికి కూడా సమయం లేదు. కళామందిర్ కోసం కొంచెం ప్రాక్టీస్ చేశాను. కాకపోతే నాకు డ్యాన్సులు చేయడం ఇష్టం కాబట్టి ఈజ్‌తో చేయగలిగాను.