26 September 2018
Hyderabad
ఓ వైపు బిగ్‌బాస్ ఫినాలే, మరోవైపు `దేవదాస్` రిలీజ్.. దాదాపు మూడున్నర నెలలుగా అరపూట కూడా రెస్ట్ లేకుండా ఉన్నారు నాని. బుధవారం ఉదయం ఆయన విలేకరులతో హైదరాబాద్‌లో మాట్లాడారు. ఆ విశేషాలు..
* దేవదాస్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ చెప్పండి?
- ఈ సినిమా గురించి అనుకోగానే నాకు నాగార్జునగారు మనసులోకి వచ్చారు. ఆయనతో సెట్ మీద ఎలా ఉంటుంది? అనే టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే నాగార్జునగారు, బాలకృష్ణగారు, చిరంజీవిగారు, వెంకటేష్‌గారు అంటే చాలా సీనియర్లు. మిగిలిన అందరు హీరోలనూ క్లాస్ మేట్స్ గానే చూడొచ్చు. కాకపోతే వాళ్లు ఫ్రెండ్ బెంచ్‌లో కూర్చుంటే, నేను బ్యాక్ బెంచ్‌లో కూర్చున్నట్టు ఫీల్ కావచ్చు. కానీ ఈ నలుగురిని మాత్రం అలా చూడలేం. అందువల్ల చిన్న ఇబ్బందిగా ఫీలయ్యాను. ఎందుకంటే `దేవదాస్` లాంటి స్క్రిప్ట్ లను స్పాట్‌లో చాలా వరకు ఇంప్రూవ్ చేయల్సి ఉంటుంది. అలా చేయగలమా? లేదా? అని అనుకున్నా. ఎలాగో సెట్లోకి నాగార్జునగారు వచ్చారు. అరపూటలో కలిసిపోయారు. సినిమాలో చిన్న చిన్న ఇంప్రూవ్ మెంట్స్ మేం చేసినవన్నీ చాలా బావున్నాయి.
* ఆయన సినిమా చూసి ఏమన్నారు?
- సినిమా అంతా పూర్తయ్యాక రఫ్ ఎడిటింగ్ పూర్తిగా చూశారు నాగ్ సార్. నన్ను పిలిచి `ఎంత బాగా చేశావయ్యా` అని మొదలుపెట్టి 5 నిమిషాలు చెప్పారు.
* ఆక్చువల్‌గా ఈ సినిమా నాగార్జునగారితో అన్నప్పుడు మీకేమనిపించింది?
- ఐఫా అవార్డులను నేను, రానా కలిసి హోస్ట్ చేశాం. ఆ అవార్డుల వేడుకకు అమలగారితో వచ్చారు నాగార్జున. అప్పుడు ఓ యాంకర్ ఆయన ముందు మైక్ పెట్టి నాని యాంకరింగ్ గురించి చెప్పండి అని చెప్పింది.. దాంతో ఆయన తెలుగు బాగా మాట్లాడతాడు.నాకిష్టం అని అన్నారు. ఆయన్ని తోసుకున్నట్టుగా.. కాస్త అమలగారు ముందుకొచ్చి తెలుగు ఎంతో బాగా మాట్లాడతాడు అని అన్నారు. ఆ క్లిప్పింగ్‌ని నాకు ఎవరో పంపారు. నేను మా ఇంట్లో వాళ్లకు కూడా చూపించాను. నా మీద ఆయనకున్న ఇంప్రెషన్ పోకుండా చూసుకోవాలని అనుకున్నా. అంతకు పదింతలు మార్కులు కొట్టేశానని మాత్రం తెలుసు.
*శ్రీరామ్‌ని ఆయనకు మీరే పరిచయం చేశారట కదా?
- మాకు శ్రీధర్ రాఘవన్ కథ చెప్పినప్పుడు దాదాపు 20 పర్సెంట్ బావుందనిపించింది. దాన్ని తెలుగుకు తగ్గట్టు డెవలప్ చేయాలి. మరీ రియలిస్టిక్‌గా చేయాలి. అలాగే కాస్త కమర్షియల్ అంశాలు కూడా ఉండాలి. అలా చేయగలిగిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నప్పుడు నేను శమంతకమణి ట్రైలర్ చూశా. అంతకు ముందు అతను తీసిన సినిమాను నా ఫ్రెండ్ చూస్తే అతన్ని అడిగా. ఓ ఒపీనియన్ రావడంతో ఆదిని పిలిచి నెలరోజులు టైమ్ తీసుకో. స్క్రిప్ట్ బాగా చేస్తే సినిమా బాగా చేస్తాం. లేకుంటే నీ టైమ్ వేస్ట్ అవుతుంది అని అన్నా. అతను స్క్రిప్ట్ రాసుకున్న ఏంసీఏ షూటింగ్ వరంగల్‌లో జరుగుతుంటే అక్కడికి వచ్చాడు. అప్పటికే నేను రెండు, మూడు సినిమాలతో సతమతమవుతున్నా. స్క్రిప్ట్ ఏమాత్రం బాగాలేకున్నా సారీ చెప్పేద్దామని అనుకున్నా. కానీ అతను చాలా బాగా చెప్పాడు. అప్పుడు కాల్షీట్ అడ్జస్ట్ చేసుకుని మరీ ఈ సినిమా చేశా.
*మల్టీస్టారర్ చేయడం ఎలా ఉంది?
- నేనేం ఇమేజ్ డ్రైవన్ ఆర్టిస్ట్ కాదు. ఏదో కటౌట్ చూసి నా సినిమాలకు రారు. ఉదయాన్నే విజిల్స్ ని ఆస్వాదించాలని కూడా ఎవరూ అనుకోరు. సినిమాను సినిమాగా చూడ్డానికి వస్తారు. అలా అనుకునే ఈ సినిమా చేశా. నాగ్ సార్ యాడ్ కావడం చాలా పెద్ద ప్లస్ పాయింట్.
* కృష్ణార్జున యుద్ధం సరిగా ఆడకపోతే ఫీలయ్యారా?
- దిష్టి పోయిందనుకున్నా. నా పరంగా ఏమైనా తక్కువగా చేశానా అని ఆలోచించా. ఏమీ లేదు. నేను, గాంధీ కూర్చుని స్క్రిప్ట్ పరంగా ఇంకాస్త ఏమైనా చేసి ఉండాల్సింది అని అనుకున్నాం. అంతకు మించి ఇంకేమీ అనుకోలేదు. కానీ ట్విట్టర్‌లో సినిమా బావుందని చాలా మంది కామెంట్లు పెట్టారు.
* ఈ సినిమా గుండమ్మకథ అని ఒకరు, మున్నాభాయ్ అని నాగార్జున అన్నారు. మీరేమంటారు?
- ఇద్దరు హీరోల కెమిస్ట్రీ కుదిరింది కాబట్టి గుండమ్మ కథ అని అశ్వనీదత్‌గారు, రాజ్‌కుమార్ హిరానీని గుర్తు చేసే అంశాలుంటాయని మున్నాభాయ్ అని అన్నారు. ఇదేమీ పూర్తిగా నవ్వించే సినిమా కాదు. నవ్వులుంటాయి. మనసును హత్తుకునే విషయాలుంటాయి. కన్నీళ్లు తెప్పించే అంశాలూ ఉంటాయి. మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది.
* వైజయంతీ మూవీస్‌లో సినిమా చేయడం ఎలా ఉంది?
- ఎవడే సుబ్రమణ్యం సమయంలో అశ్వనీదత్‌గారు పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఈ సినిమాకు ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. సెట్లో ఏమైనా కావాలంటే అసలు ఎక్కడా వెనకాడరు. సినిమా అంటే ఆయనకు అంత ప్యాషన్. నా సినిమాలను మొదటిరోజు చూసి జెన్యూన్ రిపోర్ట్ ఇస్తుంటారు. వాళ్లింట్లో వ్యక్తిలాగా నన్ను ట్రీట్ చేసేవారు.
* జెర్సీ ఎప్పటి నుంచి మొదలవుతుంది?
- విజయదశమికి షూటింగ్ మొదలవుతుంది. ప్రతిరోజూ మూడున్నర గంటల సేపు ట్రెయినింగ్ తీసుకుంటున్నా. బ్యాట్స్ మ్యాన్‌గా కనిపిస్తా. నా కెరీర్‌లో నేను గుర్తుంచుకునే సినిమా అవుతుంది, అన్నీ పక్కాగా కుదిరిన సినిమా అవుతుంది.