21 August 2018
Hyderabad
ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నారా రోహిత్, జగపతిబాబు నటించిన చిత్రం 'ఆటగాళ్ళు'. 'ఆంద్రుడు' చిత్ర దర్శకుడు పరుచూరి మురళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మాతలు. ఈ నెల 24న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా నారా రోహిత్ పాత్రికేయులతో మాట్లాడుతూ...
ఆ ప్రశ్న నాలోనూ ఉంది...
- ''ఆటగాళ్ళు' కంటే ముందుగా పరుచూరి మురళి నాకు వేరే కథ చెప్పారు. ఆ కథ నాకు చెప్పిన ఈ కథతో సినిమా చేయమని తనే అన్నారు. సరేనని అన్నాను. పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా 'బాలకృష్ణుడు' చేశాను. అది వర్కవుట్ కాలేదు. ఇప్పట్లో కొత్తదనం లేకపోతే కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు. డిఫరెంట్ సినిమాలు, న్యూ ఏజ్ సినిమాలే చేయడం వల్లనే నాకు పరిమితులు ఏర్పడుతున్నాయనేది నా భావన కూడా. అందువల్ల కొత్తదనం ఉన్న కమర్షియల్ సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
డబ్బులు రావడం లేదు ...
- డిఫరెంట్ సినిమాలు చేయడం వల్ల మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి కానీ.. డబ్బులు రావడం లేదు. అలాగని నేను తప్పు చేస్తున్నానని ఫీల్ కావడం లేదు. ఏదో ఒకరోజు కమర్షియల్‌గా కూడా సక్సెస్ సాధిస్తానని అనుకుంటున్నాను. 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమా విడుదలైన సమయంలో చిరంజీవిగారి 150వ సినిమా.. బాలయ్యగారి 100 సినిమా విడుదలయ్యాయి. ఆ సినిమాకు మంచి పేరు వచ్చినా డబ్బులు రాలేదు. అలాగే నీది నాది ఒకే కథ సినిమా విడుదల తర్వాత రంగస్థలం సినిమా వచ్చినా.. మా సినిమాను ఆదరించారు. ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో కూడా రీమేక్ చేస్తున్నారు. 'వీరభోగ వసంత రాయులు' సినిమా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్.
సీనియర్స్‌ను గమనిస్తే చాలు...
- `ఆటగాళ్ళు` విషయానికి వస్తే.. ఇద్దరు తెలివైన వ్యక్తుల మైండ్ గేమ్ మీద రన్ అవుతుంది. సీనియర్‌తో నటించేటప్పుడు ఆయన్ను అడిగే నటించక్కర్లేదు. ఆయన్ను గమనిస్తే చాలు నేర్చుకోవచ్చు. అలాగే నేను కూడా జగపతిబాబుగారు నటించేటప్పుడు డైలాగ్ చెప్పేటప్పుడు ఎలా చెబుతారు.. ఎలా నటిస్తారనే విషయాలను జాగ్రత్తగా గమనించి కొన్ని విషయాలు నేర్చుకున్నాను.
ఆ విషయంలో కేర్ తీసుకుంటున్నా..
- ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేస్తున్న నేను.. పరిమిత సంఖ్యలో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాను. సంఖ్య కంటే క్వాలిటీ విషయంలో కేర్ తీసుకోవాలనుకుంటున్నాను. అలాగే యూనివర్సల్ కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తున్నప్పుడు ఇతర భాషల్లో కూడా సినిమాలను చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను.
డైరెక్టర్ గురించి...
- పరుచూరి మురళిగారు ఆటగాళ్ళు సినిమా చాలా చక్కగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది
`యన్.టి.ఆర్` బయోపిక్ గురించి...
- `యన్.టి.ఆర్ `బయోపిక్ చూడటానికి ఆసక్తిగా ఉన్నాను. ఆ సినిమాలో నేను నటించడం లేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే.. బాలయ్యబాబుగారే పిలుస్తారు.