సునీల్, మనీషా రాజ్ జంటగా నటించిన చిత్రం `2 కంట్రీస్`. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎన్.శంకర్ స్వీయ దర్శక నిర్మాణంలో సినిమాను రూపొందించారు. ఈ సినిమా డిసెంబర్ 29న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత ఎన్.శంకర్ సినిమా గురించి విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ
* ఎలా ఉండబోతోంది ఈ సినిమా?
- `2కంట్రీస్` మలయాళంలో పెద్ద హిట్ సినిమా. తెలుగులో అదే టైటిల్‌తో రీమేక్ చేశాం. మాతృకలో లాగే ఇందులో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా ఉంటుంది. ఇటువంటి సినిమాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుంది. ప్రేక్షకులు ఎక్కువ శాతం వినోదాత్మకమైన సినిమాను కోరుకుంటున్నారు. కానీ నాణ్యత లోపం మాత్రం ఉండకూడదు. దీని వల్ల కమర్షియల్‌గా రెవెన్యూ సైడ్‌గానీ, అప్రిషియేషన్‌గానీ బావుంటుంది. నేను ఇప్పటిదాకా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేశాను. సినిమా, సినిమాకూ మార్పు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా. ప్రతి ప్రయత్నం ప్రేక్షకుల ఆదరణ పొందింది. `జై బోలో తెలంగాణ` తీసిన తర్వాత..చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా `2 కంట్రీస్`. మలయాళంంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాత, డైరక్టర్, రైటర్ నాకు మంచి ఫ్రెండ్స్. వాళ్లు ఫోన్ చేసి సినిమా పెద్ద హిట్ అయింది. మార్నింగ్ 40 శాతంతో స్టార్ట్ అయి ఈవెనింగ్‌కి ఫుల్స్ అయ్యాయి. షారుఖ్‌ఖాన్ వంటి నటులు కూడా ఈ సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. తెలుగులో నువ్వు రీమేక్ చేసుకో.. చాలా బావుంటుంది అని అన్నారు. నేను సినిమా చూశాను. చూస్తే దిలీప్ పాత్రకు సునీల్ సరిపోతాడనిపించింది. దిలీప్‌కి ఉండే స్క్రీన్ ఇమేజ్ ఇక్కడ సునీల్‌కి ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే `పూలరంగడు` సినిమాకు మాతృక మలయాళంలో దిలీప్ నటించారు. ఆ రకంగా చూసినా, బాడీ లాంగ్వేజ్ పరంగా చూసినా సునీల్‌కి సరిపోతుందనిపించింది. దాదాపు 50 శాతం సినిమా అమెరికాలో ఉంటుంది. న్యూయార్క్ లోనూ షూటింగ్ చేశాం. సో అక్కడ చేసినప్పుడు స్థానికుల నుండి అద్భుతమైన కో ఆపరేషన్‌ని టీమ్ అంతా పొందారు. సినిమా అద్భుతమైన ఇళ్లల్లో చేశాం. మన దగ్గర షూటింగ్‌కి ఇల్లు ఇవ్వాలంటే యూనిట్ డిస్టర్బ్ చేస్తారని ఫీల్ అవుతారు. కానీ అక్కడ మా ఇంట్లో చేయండి, మా ఇంట్లో చేయండి అని ఇన్వైట్ చేశారు. అందువల్ల ప్రతి ఫ్రేమూ రిచ్‌గా ఉంటుంది. కొత్త లొకేషన్లు కనిపిస్తాయి. మామూలుగా మనకి 5 ఇళ్లు సరిపోతాయని అనుకుంటే, మేం దాదాపు 16 ఇళ్లల్లో చేశాం. కొత్తగా కనిపిస్తుంది. బాలీవుడ్ సినిమా కలర్స్ ఇందులో ఉంటాయి. కొత్త కేన్వాస్ ఉంటుంది. మంచి సందేశాన్ని, ప్రేమను, వినోదాన్ని కలగలిపిన కథ ఇది. రామ్ ప్రసాద్ కెమెరా, గోపీసుందర్ మ్యూజిక్ హైలైట్ అవుతాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో గోపీసుందర్ బిజీగా ఉన్నారు. మలయాళీలు మాత్రమే ఇతర భాషా సినిమాలను అద్భుతంగా అడాప్ట్ చేసుకోగలరు. `మాతృదేవోభవ` అనేది టర్కీ ఫిల్మ్. నేను అసిస్టెంట్ డైరక్టర్‌గా ఉన్నప్పుడు ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చూశా. సిబి మలయాళీ అని ఆయన కూడా నా ఫ్రెండే. ఆయన ఆ సినిమాను మలయాళంలో చేశారు. వాళ్ల తర్వాత బెంగాళీలు కూడా చక్కగా అడాప్ట్ చేసుకోగలరు. అలా నేను చేయగలిగానని గోపీసుందర్ భావించారు. అంతటితో ఆగకుండా మలయాళ దర్శకనిర్మాతలకు గొప్పగా చెప్పారు. తెలుగువారు అడాప్షన్‌ని సరిగా చేయలేరనే ఫీలింగ్ అవతలివారికి ఉంది. కానీ వాళ్లు `2 కంట్రీస్` చూసి అభినందించారు. మాతృకను చూసిన వారు అభినందించే సన్నివేశాలు అరుదు. ఎక్కడ అవసరమో అక్కడ ఫోకస్ చేసి తీశాను. సునీల్ బాడీ లాంగ్వేజ్, అతని ఏజ్, అతని స్క్రీన్ ఇమేజ్‌కి చక్కగా సరిపోయే సినిమా ఇది. మనీషా రాజ్ కొత్తమ్మాయి అయినా హీరోయిన్ చాలా బాగా నటించింది. మేం ఆ పాత్ర కోసం చాలా మందిని ట్రై చేశాం. ఎందుకంటే అమ్మాయి పాత్రలో మల్టీ ఎమోషన్స్ ఉంటాయి. ప్రొఫషనలిజం ఉన్న ఆర్టిస్ట్ లు మాత్రమే చేయగల పాత్ర అది. అందులో ఎలాంటి అశ్లీలత, అసభ్యకరమైన విషయాలు ఉండవు. మాతృకలో మమతా మోహన్‌దాస్ మలయాళంలో అద్భుతంగా చేసింది. అలాంటి పాత్రలో నటించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు అమెరికాలో ఎవరైనా దొరుకుతారా? అని అమెరికాలో స్టార్ హంట్ పెట్టాం.
* హీరోయిన్ గురించి చెప్పండి?
- లక్కీగా మా ఫ్రెండ్ వాళ్ల డాటర్‌కి ఫ్రెండ్ అయిన మనీషా రాజ్ ను చూశాం. ఆ అమ్మాయికి పాడటం ఇష్టం. పాడాలని మా దగ్గరకు వచ్చి, పాడిన వీడియోలు చూపించింది. కానీ ఆమెను చూడగానే నాకు హీరోయిన్‌గా నచ్చింది. అప్పుడు ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి సెలక్ట్ చేశాం. తను లుక్ వైజ్, పెర్ఫార్మెన్స్ వైజ్.. కేరక్టర్‌ని డైజస్ట్ చేసుకుని చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే సునీల్‌ని డామినేట్ చేసింది. సినిమాకి గోపీసుందర్ మ్యూజిక్, రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ , కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, శ్రీధర్ డైలాగ్స్, ప్రకాష్, ఆర్ట్ డైరెక్షన్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. అలాగే ఆర్టిస్టుల విషయానికి వస్తే నాయిక మనీషా రాజ్‌కి పేరు వస్తుంది. .కొత్త అమ్మాయి ఇంతబాగా నటించగలుగుతుందా? అని అందరూ ఆశ్చర్యపోయేలా నటించింది. టీజర్లలో చూసిన వారు కూడా చాలా మెచ్చుకుంటున్నారు. వినైల్స్, హోర్డింగ్స్ చూసిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు. ఖర్చుకు వెనకాడకుండా సినిమా పబ్లిసిటీ చేస్తున్నాం. జిల్లాల వారిగా కూడా బాగా ప్రమోషన్ చేస్తున్నాను. సినిమాను సొంతంగా విడుదల చేస్తున్నాను. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అనుభూతులు ఇందులో ఉంటాయి.
* కథ గురించి చెప్పండి?
- ప్రతి వ్యక్తికీ చిన్న మెదడు, పెద్దమెదడు ఉంటాయి. వీటకి ఎప్పుడూ ఒక సంఘర్షణ ఉంటుంది. సునీల్ పాత్ర విషయానికి వస్తే.. సునీల్‌కి ఎలాంటి లక్ష్యం వంటివి ఉండదన్నమాట. అతనికి డబ్బు ఉంటే చాలు. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు అంతే. సరదాగా సాగే అతని జీవితంలో ఒకమ్మాయి నిజమైన ప్రేమ ఎలా ఎంటర్ అయింది. ఆ ప్రేమ అతన్ని ఎలా మారుస్తుంది.. దాని కోసం అతను ఎలా మారుతాడు అనేది సినిమా. క్లైమాక్స్ లో మాత్రం హార్ట్ టచింగ్‌గా మంచి ఫీల్ ఉంటుంది. మీనింగ్ ఫుల్ సినిమా చూశామన్న సంతృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది. ఫైనల్ కాపీ రాత్రి చూశాను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.
* సునీల్‌కి చాలా ఫ్లాప్‌లున్నాయి కదా. మరి ఎలా సెలక్ట్ చేసుకున్నారు?
- అందరి హీరోలకీ హిట్లూ, ఫ్లాప్‌లూ ఉంటాయి. కాకపోతే మన పాత్రకు సూటబుల్ గా ఉన్నప్పుడు హీరోల ఫ్లాప్‌లు వంటివి పట్టించుకోకూడదు. ఎందుకంటే రైట్ కాస్టింగ్ అనేది చాలా ముఖ్యం. నితిన్‌తో నేను `రామ్` సినిమా చేశాను. అప్పుడు నితిన్ ఏజ్‌గానీ, ఇమేజ్‌గానీ దానికి సరిపోదు. అది ఆలోచించకుండా ఎక్కువ మాస్‌గా సినిమా చేశాం. చిరంజీవిగారిలాంటి వారు సినిమా చూసి పెద్ద హీరోలైతే ఏడాది అడేది. లవ్‌స్టోరీ చేసే పిల్లలతో ఇలాంటి సినిమాలు చేయకూడదు. కానీ ప్రేక్షకులకు కనెక్ట్ కావాలంటే రైట్ కాస్టింగ్ కూడా ఉండాలి అని అన్నారు.
* మీరు నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది?
- సునీల్‌కి మార్కెట్ లేదు.. అందువల్ల వేరే ప్రొడ్యూసర్‌ని కలిస్తే అమెరికా ఎందుకు? బ‌్యాంకాక్‌లో చేద్దామని అంటారు. అది నాకు నచ్చదు. అందుకే నేను నిర్మాతగా మారాను. ఒక నిర్మాత ఆలోచనలకు, టెక్నీషియన్ ఆలోచనలకు గ్యాప్ ఉంటుంది. వస్తే ఆ డబ్బులు నాకే వస్తాయి కదా! అని నేనే నిర్మాతగా మారి సినిమా చేశాను. ఇందులో లాస్ట్ టూ రీల్స్ హ్యూమన్ డ్రామా, హ్యూమన్ టచ్ ఉంటుంది. సునీల్ ఫ్యాన్స్ ని శాటిస్‌ఫై చేస్తూ, నేను చెప్పదలచుకున్న సినిమాను చెప్పడమే నా మార్క్.
* అదే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి?
- టైటిల్ విషయంలో చాలా ఆలోచించాం. కానీ `2 కంట్రీస్` అనేది చాలా కొత్తగా అనిపించింది. `2 కంట్రీస్` అనేది అక్కడ ఆల్రెడీ హిట్ సినిమా. అందుకే ధని ఏలే రాసిన లోగో చాలా మంచి రెస్పాన్స్ రాబట్టింది. అప్పుడు ఫస్ట్ లుక్ వదిలాం. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ టైటిల్‌నే ఫిక్స్ అయ్యాం. రూరల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా డీటైల్స్ బాగా చెప్పాం.
* కమల్‌హాసన్ సినిమా ఎంత వరకు వచ్చింది?
- కథ ఓకే అయింది. నిర్మాతలు మనం కాదు.. వేరే వాళ్లు. కానీ ఆ సినిమా సమయంలోనే `విశ్వరూపం` వంటి సినిమాలు వచ్చాయి. దాంతో ఇది కాస్త పక్కకు మళ్లింది.
* పాలిటిక్స్ లోకి వెళ్లరా?
- నేను ఎప్పుడూ డైరక్ట్ గా వెళ్లలేదు. కానీ మూమెంట్‌లో ఉన్న భావోద్వేగాన్ని నేను తెరపై చూపించా.
* కొత్తవాళ్లతో సినిమా చేస్తానన్నారు?
- తర్వాత చేస్తాం. దానికి `2 కంట్రీస్` ఊతం ఇస్తుందని నమ్మాను. ఇప్పుడు కూడా స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈ స్ట్రగుల్స్ అన్నీ మాయమవుతాయి. ఆ తర్వాత కొత్త వాళ్లతో సినిమా చేస్తా.