
18 December
Hyderabad
సత్యదేవ్, నందితా శ్వేత నాయకా నాయికలుగా రూపొందిన చిత్రం `బ్లఫ్ మాస్టర్`. గోపీ గణేష్ పట్టాభి. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకులు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై నిర్మాత. తమిళంలో ఘనవిజయం సాధించిన `చతురంగ వేట్టై`ని ఆధారంగా చేసుకుని తెలుగులో `బ్లఫ్ మాస్టర్`రూపొందింది. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతుంది. ఈ చిత్రంలో ధనశెట్టి అనే పాత్రలో థర్టీ ఇయర్స్ పృథ్వీ నటించారు. సినిమా విడుదల సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ....
పాత్ర గురించి..
- `బ్లఫ్ మాస్టర్`లో నేను ధనశెట్టి అనే పాతకాలపు మనిషి పాత్రలో కనపడతాను. చెవిదిద్దులు, సన్నటి మీసంతో పాత కాలపు లుక్‌తో కనపడేలా దర్శకుడు గోపీ గణేష్‌గారు చాలా కేర్ తీసుకున్నారు. గోవిందా అనే ఊతపదంతో నా డైలాగ్స్ అందరినీ మెప్పించేలా ఉంటాయి. రావుగోపాలరావుగారు నటించిన ఓ సినిమాలోని మేనరిజమ్‌ను ఈ సినిమాకు ట్రై చేశాను. ఖడ్గం, లౌక్యం తర్వాత నాకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది. నాకు, హీరో గ్యాంగ్‌తో ఉన్న రిలేషన్ ఏంటనే సంగతి తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సినిమా సంఖ్య తగ్గింది...
- ఇంతకు ముందు ఏడాదికి నలభై సినిమాల్లో నటించాను. ఈ ఏడాది మాత్రం 20 సినిమాల్లోనే నటించాను. కోటగారు, కైకాల సత్యనారాయణగారు ఇచ్చిన సలహాతో కేవలం కమెడియన్‌గానే కాకుండా.. విభిన్నమైన పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను.
బ్యాలెన్స్ అయ్యింది...
- ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన దర్శకులు ఉండటంతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇండస్ట్రీ బ్యాలెన్స్ అయ్యిందని నా భావన. గుత్తాధిపత్యం కూడా తగ్గింది. ప్రేక్షకులు మంచి కాన్సెప్ట్ సినిమాలను ఆదరిస్తున్నారు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, ఆర్.ఎక్స్ 100 వంటి సినిమాలతో అవి నిరూపణ అయ్యాయి.
కామెడీ సినిమాలు తగ్గాయి...
ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, ఎ.వి.ఎస్ వంటి కమెడియన్స్ దూరం కావడం ఇండస్ట్రీకీ పెద్ద లోటు. హాస్యాన్ని పండించే గొప్ప నటులు లేకపోవడంతో కామెడీ సినిమాలు తగ్గిపోయాయి.
తదుపరి చిత్రాలు..
- మహర్షి, వినయవిధేయరామ, యాత్ర, వెంకీమామ, ఎఫ్ 2, బృందావనమిది అందరిదీ .. చిత్రాల్లో నటిస్తున్నాను.