3 July 2019
Hyderabad
సమంత, లక్ష్మి , ఐశ్వర్య , ఊర్వశి, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం `ఓ బేబీ`. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ నిర్మించాయి. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మాతలు. జూలై 5న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించిన రాజేంద్రప్రసాద్ బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ``ఓ బేబీ చిత్రం కథ, కథనంలోనే చాలా ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఓ బేబీకి బోయ్‌ఫ్రెండ్‌గా నటించాను. మిలిటరీ నుంచి రిటైర్ అయి వచ్చిన నేను, లక్ష్మి కలిసి ఓ హోటల్ నడుపుతుంటాం. తను నన్ను చంటి అని పిలుస్తుంటుంది. ఉన్నట్టుండి ఒక రోజు తను కనిపించదు. ఆ ప్లేస్‌లో సమంత వచ్చి ఉంటుంది. తను నన్ను చంటి అని పిలుస్తుంటుంది. అటు లక్ష్మికి, ఇటు సమంతకు బోయ్‌ఫ్రెండ్ గా ఈ సినిమాలో నటించాను. నా జీవితంలో నేను `బామ్మ బాట బంగారు బాట`లో భానుమతిగారితో, `బృందావనం`లో అంజలీదేవిగారితో నటించాను. ఇప్పుడు లక్ష్మిగారికి పెయిర్‌గా చేయడం ఎగ్జయిట్‌మెంట్ అయ్యే విషయం. జీవితాన్ని సినిమాగా చూపించే అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. ఈ చిత్రంతో అది సాధ్యమైంది. కొరియన్ చిత్రం `మిస్ గ్రానీ`ని తీసుకుని తెలుగుకు తగ్గట్టు చాలా బాగా తీశారు. నందిని రెడ్డికి ఇది చాలా మంచి అవకాశం. తను నన్ను కలవగానే చంటి పాత్రకు మీరు తప్ప ఇంకెవరూ సరిపోరు అని చెప్పింది. నాలాంటి మెచ్యూర్డ్ ఆర్టిస్టులకు ఈ టైప్ కేరక్టర్లు చేసేటప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ఆసక్తి చూసేవారిలోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. నేనే కాదు, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ భయభక్తులతో నటించారు. సమంత నిర్మొహమాటంగా హాస్యానికి సంబంధించి నన్ను అడిగి చేసేది. చాలా చనువుగా అడిగి నేర్చుకునేది. కొన్ని సీన్లు చేసేటప్పుడు జాబ్ శాటిస్‌ఫేక్షన్ ఉంటుంది. ఈ సినిమాలో నాకు అది లభించింది. నాలుగైదు చోట్ల సమంత నటనను చూసి నేను కడా ఎగ్జయిట్ అయ్యాను. ఒక సన్నివేశంలో తను నన్ను జుట్టు పీకి కొడుతుంది. ఆ సన్నివేశంలోనూ బోల్డ్ గా చాలా బాగా నటించింది. మా ఇద్దరి కేరక్టర్లకు మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదరడంతో అదంతా సాధ్యమైంది. మామూలుగా ఉరుకుల పరుగుల జీవితంలో ఇంట్లో వారితో సరిగా గడపలేకపోతుంటాం. ఇలాంటి సినిమా చూసినప్పుడు ఆ కొరత తీరుతుంది`` అని అన్నారు.
అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
* ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్న చదువు ఉపయోగపడిందని అన్నారు..
- నిజమే. ఇన్‌స్టిట్యూషన్‌లో అబ్జర్వేషన్ అని ఒకటి ఉంటుంది. అది ఈ సినిమాకు నాకు చాలా ఉపయోగపడింది.
* నందిని రెడ్డి దర్శకత్వంలో నటించడం ఎలా అనిపించింది?
- నా దృష్టిలో ఈ సినిమా నందిని రెడ్డి కెరీర్‌లో సంథింగ్ స్పెషల్ అన్నమాట. ఇదే విషయాన్ని తనతోనూ చెప్పాను. మంచి అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకోమని సలహా ఇచ్చా.
* ఈ జనరేషన్ వారితో ఎలా కలిసిపోగలుగుతున్నారు?
- మనం ఈ జనరేషన్‌కి తగ్గట్టు మారితేనే వారి కూడా కనెక్ట్ అవుతారు. అలా కాకుండా నేను ఎక్కడి నుంచో వచ్చినట్టు బిహేవ్ చేస్తే వారు కూడా దూరం దూరంగానే ఉంటారు. నేను మా రామారావుగారితో ఉండటం వల్ల అడ్జస్ట్ కావడం అలవాటైంది. జీవితంలో పర్ఫెక్షన్ అలవాటైంది.
* ఆ మధ్య సన్నాఫ్ సత్యమూర్తిలో నెగటివ్ రోల్...
- అది నిజానికి నెగటివ్ రోల్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే హీరోకి నేను చెప్పే మాటలు జనాలకు నన్ను నెగటివ్‌గా చూపించాయి. ఎందుకో నన్ను నెగటివ్ పాత్రల్లో చూడటానికి జనాలు అంతగా ఇష్టపడరేమో. అయినా నేను నెగటివ్ పాత్రలు ఎందుకు చేయకూడదు.
* కమెడియన్లు చాలా మంది హీరోలుగా ట్రై చేసి సక్సెస్ కాలేకపోతున్నారు. మీ లెగసీని కంటిన్యూ చేసేవారేరి?
- కమెడియన్లు హీరోలుగా చేసినా ఇంతకు ముందు ఎప్పుడూ ఫెయిల్యూర్ కాలేదు. రేలంగి, రాజబాబు కమెడియన్లే. హీరోలుగానూ మెప్పించిన వారే. అయితే నా దృష్టిలో కమెడియన్ హీరోగా నవ్వించడం వేరు. హీరో కామెడీ చేయడం వేరు. రెండిటికీ తేడా ఉంది. రెండున్నర గంటలు ఒకరిని భరించగలిగితే వారిని హీరోగా అంగీకరించినట్టే.
* మీ మనవరాలికి మీరు ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు?
- తనకి నటన అంటే ఆసక్తి. అలా ఎలా చేయాలి? ఇలా ఎలా చేయాలి? అని తనే నన్ను అడిగి తెలుసుకుంటుంటుంది. తన ట్యాబ్‌లో సినిమాలు చూస్తూ ఉంటుంది.
* మీ టైమ్‌లో ఉన్నంత మంది దర్శకులు ఇప్పుడు లేకపోవడం వల్లనే ఆ తరహా కామెడీ చిత్రాలు రావడం లేదా?
- అది కూడా కారణం కావచ్చేమో. ఎందుకంటే ఒకప్పుడు జంధ్యాలగారు, సింగీతంగారు, బాపుగారు, రేలంగి నరసింహారావుగారు.. ఇలా చాలా మంది ఉండేవారు. ప్రతి 35 రోజులకూ ఓ సినిమా చేసేవాళ్లం. ఏడాదికి 12 సినిమాలు చేసేవాళ్లం. కొన్నిసార్లు నా సినిమాలతో నా సినిమాలే పోటీ పడేవి. ఇప్పుడు జూలై 5న ఓ బేబీ., బుర్రకథ రెండు విడుదల కున్నాయి. త్వరలోనే కౌసల్యా కృష్ణమూర్తి ఉంది. దేనికదే వైవిధ్యమైన పాత్ర చేస్తున్నా.
* మీ అబ్బాయి సినిమాల్లోకి వస్తాడా?
- లేదండీ. ఒకప్పుడు ఉషాకిరణ్ వాళ్లు కూడా అబ్బాయి కోసం కథ సిద్ధం చేయాలా అని అడిగారు. నేను వద్దన్నాను. మా అబ్బాయికి ఇంట్రస్ట్ లేదు. తన వ్యాపారాలతో బిజీ.
* ఓనమాలు తరహా సినిమాలు వస్తున్నాయా?
- చాలానే వస్తున్నాయి. కన్నడ సినిమా కాలేజీ కుమార్‌కి తెలుగు రీమేక్ ఓ సినిమా చేస్తున్నాం. చాలా బావుంటుంది.
* వెబ్‌సీరీస్లకు మిమ్మల్ని అడగడం లేదా?
- మొన్ననే ఎవరో అడిగినట్టున్నారు. అయినా అటు వెళ్తే ఇక్కడ పనైపోయిందని అనుకుంటారేమో (నవ్వుతూ). ఇప్పటిదాకా నాకన్నా నాకు వచ్చిన అవకాశాలు గొప్పవి. వాటిని కాపాడుకోవడానికి నేను చాలా కష్టపడ్డా.