pizza
R. Raj interview (Telugu) about Mallesham movie
సినిమా తీసే ముందు చాలా మంది భ‌య‌పెట్టారు - రాజ్‌.ఆర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

18 June 2019
Hyderabad

పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘చింతకింది మల్లేశం’ జీవితం ఆధారంగా రాజ్ ఆర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “మల్లేశం”. యంగ్ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడిగా అనన్య నటించింది. జూన్ 21న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు రాజ్.ఆర్ ఇంటర్వ్యూ ...

చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది ?
- రెండున్నర సంవత్సరాల క్రితం మల్లేశంగారికి సంబంధించిన ఓ టెక్ వీడియా చూడటం జరిగింది. నేత కార్మికురాలిగా తన తల్లి పడుతున్న కష్టాన్ని చిన్నప్పటి నుండి చూసిన మల్లేశం, తన తల్లిలాగా ఇంకెవ్వరూ కష్టపడకూడదని ఆసు యంత్రాన్ని కనుగొనడం, నేత కార్మికుల కష్టాన్ని తీర్చడం, దాంతో కేంద్ర ప్రభుత్వం మల్లేశం చేసిన కృషికి పద్మశ్రీతో సత్కరించడం వంటి అంశాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో అతని బయోపిక్ స్టార్ట్ అయ్యింది.

మల్లేశం సినిమా గురించి చెప్పండి ?
- సినిమాలో మదర్ సెంటిమెంట్‌ తో పాటు ఒక జీవితానికి సంబంధించి స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ ఉంది. సినిమా ఎక్కువుగా 1992 నుంచి 1999 వరకూ సాగుతుంది. మల్లేశంగారి ఆ ఏడేళ్ల జీవితాన్నే హైలెట్ చేస్తూ సినిమా తీయడం జరిగింది. అయితే సినిమాలో ఒక సామాన్య వ్యక్తి గొప్ప ఆవిష్కరణకు పూనుకోవడనేది ఎంతో స్ఫూర్తివంతంగా అనిపిస్తోంది.

మీ గురించి చెప్పండి. అసలు సినిమాల పై ఎలా ఆసక్తి ఏర్పడింది ?
- నేను పుట్టి పెరిగిందంతా రామగుండంలోనే. అయితే మా స్వస్థలం కరీంనగర్ జిల్లా. మా నాన్నగారి ఉద్యోగరీత్యా రామగుండంలో ఎక్కువుగా ఉన్నాం. నేను ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత అమెరికా వెళ్లాను. అక్కడే కొన్ని షార్ట్‌ ఫిల్మ్‌ లకు స్క్రిప్ట్ రాశాను. ఓ ఫ్రెండ్ సపోర్ట్ తో ఓ తమిళ థ్రిల్లర్ కి ప్రొడ్యూస్ చేశాను. 2007లో ఆ సినిమా రిలీజ్ అయింది. కానీ ఆ సినిమా విజయవంతంగా ఆడలేదు. చాలా సంవత్సరాల తరువాత మల్లేశంగారి కథ గురించి తెలుసుకున్నాక ఎలాగైనా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.

ప్రియదర్శి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ కమెడియన్ గా రాణిస్తున్నారు. మరి మల్లేశం లాంటి ఎమోషనల్ పాత్రలో ప్రియదర్శినే ఎందుకు ఎంచుకున్నారు ?
- కథ రాస్తునప్పుడే నాని, విజయ్ దేవరకొండ లాంటి కొంతమంది హీరోలను అనుకోవడం జరిగింది. కానీ స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక నటీనటుల ఎంపిక సమయంలో పెద్ద హీరోలు దాదాపు మరో మూడు సంవత్సరాల వరకూ అందుబాటులో లేరని అర్థమైంది. అయితే మల్లేశం పాత్రకు ప్రియదర్శి అయితే చాలా బాగుంటుందని ఓ ఫ్రెండ్ చెప్పారు. ఆ తరువాత నేను ప్రియదర్శి విలన్ గా నటించిన ‘బొమ్మలరామారం’ సినిమా చూసాను. అలాగే దర్శి చేసిన కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌ ను కూడా చూశాను. మల్లేశం పాత్రకు తను పూర్తీ న్యాయం చేయగలడని నాకు అనిపించింది. అందుకే ఆయన్నే తీసుకున్నాను.

కమర్షియల్ గా సక్సెస్ అవుతుంది అనుకున్నారా?
- మొదట ఈ సినిమా తీయాలని నిర్ణయించుకోగానే చాలామంది ఎందుకు తీస్తున్నావు, పెట్టిన డబ్బులో తిరిగి ఒక్క రూపాయి కూడారాదు అని అన్నారు. ఎట్టిపరిస్థితిల్లో సినిమా అస్సలు తీయకు అని భయపెట్టారు. కానీ నేను రాసుకున్న స్క్రిప్ట్ పై నాకు బాగా నమ్మకం ఉంది. సినిమాలో కమర్షియల్ అంశాల్ని కలబోసి ఈ సినిమాను తీసాను. సినిమాలో చక్కటి హాస్యం ఉంటుంది.

ఇతర నటీనటుల గురించి చెప్పండి ?
- మల్లేశం పాత్రకు ప్రియదర్శి పూర్తి న్యాయం చేశాడు. అయితే ప్రియదర్శి పాత్రే కాకుండా.. ప్రియదర్శి తల్లి పాత్రలో నటించిన యాంకర్ ఝాన్సీగారు, అలాగే ప్రియదర్శి భార్య పాత్రలో కనిపించిన అనన్య కూడా చాలా బాగా నటించారు. వాళ్ళు ఎక్కడా నటిస్తోన్నట్లు కనిపించదు.. అంత అద్భుతమైన నటనను వాళ్ళు కనబరిచారు. సినిమా మీరందరికీ నచ్చుతుంది.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
- ఇంకో రెండు కథలు అనుకున్నాను. ప్రస్తుతం మల్లేశం విడుదల పనుల్లో బిజీ గా ఉన్నాను. ఈ సినిమా విడుదల అయ్యాక వాటి గురించి వివరిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శక నిర్మాత రాజ్.ఆర్



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved