15 September 2018
Hyderabad
`నన్ను దోచుకుందువటే` సినిమాకు ఓ బజ్ ఉంది. అందుకు కారణం సుధీర్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించడమే కాదు, నిర్మాతగా కూడా ఈ సినిమాతో మారారు. ఈ నెల 21న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వం వహించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు...
* నన్ను దోచుకుందువటే కథ చెప్పండి?
- మా చిత్రంలో కథానాయకుడు సాఫ్ట్ వేర్ కంపెనీలో మేనేజర్. అమెరికాకు వెళ్లాలని కలలు కంటుంటాడు. దాన్ని సాకారం చేసుకోవడానికీ ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలోనే అతనికి ఓ అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె పరిచయం అతనిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అతను గోల్ సాధించగలిగాడా? లేదా? అనేది ఆసక్తికరం.
* మీ గురించి చెప్పండి?
- నేను పుట్టింది తాడిపత్రిలో. అనంతపురం జిల్లా. చిన్నప్పటి నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో చేరాను. ఆ క్రమంలో నేను చిన్నతనం నుంచి చూసింది మాత్రమే సినిమా కాదు.. వరల్డ్ సినిమా అంటే చాలా ఉందని అర్థం చేసుకున్నా. ఆ క్రమంలోనే `నీ మాయలో`, `స్పందన` అని రెండు షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ తర్వాత దర్శకుడిగా చాలా ప్రయత్నాలు చేశాను. అందులో భాగంగానే సుధీర్‌బాబును కలిశా.
* ఆయన విన్నాక ఏమన్నారు?
- ఆయనకు కథ చాలా బాగా నచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ తరహా చిత్రమిది. నిజ జీవితంలో సుధీర్‌బాబు ఎలా ఉంటారో ఈ సినిమాలోనూ అలాగే ఉంటారు.
* ఏమైనా నిజజీవిత ఘటనలుంటాయా?
- కొన్ని ఉంటాయి. నా జీవితంలో జరిగిన కొన్ని అంశాలను కూడా ఇందులో రాశాను. ఈ చిత్రంలో నాజర్‌గారి పాత్రను మా నాన్న స్వభావాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్నా.
* హీరోయిన్ కేరక్టర్ ఎలా ఉంటుంది?
- ముందే చెప్పినట్టు ఆమె పరిచయంతోనే హీరో పాత్రలో మార్పు వస్తుంది. కాస్త స్ట్రాంగ్ కేరక్టర్ అది. అందుకే చాలా మంది హీరోయిన్లను ఆడిషన్ చేశా. ఆఖరికి నభా నటేష్ చక్కగా సరిపోతుందనిపించింది. నా నమ్మకాన్ని ఆ అమ్మాయి నిలబెట్టింది. సినిమాలో ఆమెను చూశాక, నా జీవితంలోనూ ఇలాంటి అమ్మాయి ఉంటే బావుంటుందని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.
* సినిమా బడ్జెట్ ఎంతయింది?
- అది నాకు సంబంధం లేని అంశం. ఎందుకంటే నేననుకున్న కథ చక్కగా తెరపై కనిపించాలంటే నేను బడ్జెట్ గురించి ఆలోచించకూడదు. నా అభిప్రాయానికి సుధీర్‌బాబు విలువిచ్చారు.
* ఇంకే సినిమాలు అంగీకరించారు?
- ప్రస్తుతం ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నా.
...